స్టాండ్ మార్చుకోంది ఆ విషయంలోనే

నాకు అధికారం అక్కరలేదు, ముఖ్యమంత్రి పదవి అంతకంటే వద్దు అని పదే పదే చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ అయిదేళ్ళలో తన మాటల ద్వారా ఎన్ని [more]

Update: 2020-01-04 03:30 GMT

నాకు అధికారం అక్కరలేదు, ముఖ్యమంత్రి పదవి అంతకంటే వద్దు అని పదే పదే చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ అయిదేళ్ళలో తన మాటల ద్వారా ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. నిన్న మాట నేడు లేదు, రేపు ఉండదు, ఆయన నిర్ణయాల్లో స్థిరం లేదని విమర్శలు గట్టిగానే ఉన్నాయి. దానికి తగినట్లుగానే పవన్ కల్యాణ్ వ్యవహార శైలి కూడా ఉంది. పవన్ కల్యాణ్ ఒక్క విషయంలో మాత్రమే గట్టిగా నిలబడి ఉన్నారని అంటున్నారు. అదే చంద్రబాబుని అంటిపెట్టుకుని ఆరేళ్ళుగా రాజకీయ ప్రయాణం చేయడం. అలాగే జగన్ ని ద్వేషించడంలో కూడా పవన్ కల్యాణ్ తన స్టాండ్ ఇప్పటిదాకా మార్చుకోలేదు.

కూలితే నెగ్గుతారా..?

పవన్ కల్యాణ్ పార్టీకి ఎలాంటి పరాభవం జరిగిందో 2019 ఎన్నికలు చెప్పాయి. మొదటిసారి వచ్చిన ఊపులోనే తాను ఓడి తన వారిని ఓడించుకున్న పవన్ కల్యాణ్ కి ఇప్పటికిపుడు ఎన్నికలు వచ్చినా గెలిచే తాహతు ఉందా అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. తాను ఓడిపోయానన్న బాధ పవన్ కల్యాణ్ లో అడుగడుగునా కనిపిస్తోంది. తనని ఓడించి గెలిచిన జగన్ సర్కార్ కూడా కుప్ప కూలాలని పవన్ కల్యాణ్ గట్టిగా కోరుకుంటున్నాడు. అది ఎక్కడా దాచుకోవడంలేదు. మాటిమాటికీ జగన్ సర్కార్ కూలిపోతుంది అంటూ పిల్లి శాపనార్ధాలు పెడుతున్నారు. జగన్ సర్కార్ ఎందుకు కూలుతుందో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పలేకపోతున్న్నారు.

జరిగే పనేనా…?

జగన్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడరు. పోనీ వారు వెళ్ళాలనుకున్నా కూడా వేరే పార్టీ ఏదీ అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఇక బీజేపీకి ఏపీలో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. అన్నింటికీ మించి బలమైన నాయకుడు లేడు. వైసీపీని గద్దె దించి తాను కుర్చీ ఎక్కడానికి బీజేపీ ఎటువంటి ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఇపుడున్న పరిస్థితుల్లో అది దుస్సాసహమే అవుతుంది. మొన్న కర్నాటక, నిన్న మహారాష్ట్రలో బీజేపీ గవర్నర్ ద్వారా చేసిన అధికార మార్పిడి ప్రయోగాలు ఘోరంగా ఎదురు తన్నాయి. మరి అక్కడ బీజేపీ బలంగా ఉంది. పెద్ద పార్టీగా ఉంది. అయినా ఆటలు సాగలేదు. ఇక ఏపీలో అసలు సున్నా సీట్లతో ఆ పార్టీ ఏం చేయగలదు. ఇక టీడీపీ, చంద్రబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అక్కసుతోనే…

విషయం ఇలా ఉంటే జగన్ సర్కార్ కూలుతుంది అంటూ పవన్ కల్యాణ్ అంటున్న మాటలు కేవలం అక్కసుతోనేనని భావించాలి. పవన్ కల్యాణ్ కి జగన్ని సీఎం గా చూడడం ఇష్టం లేదు. నేను ఆయన్ని సీఎంగా గుర్తించను అంటూ తానే చెప్పుకున్నారు. మరి పవన్ కల్యాణ్ కి ఇష్టం లేకపోయినా జగన్ సీఎంగా మరో నాలుగున్నరేళ్ళు ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం. ఓటేసిన జనం ఇపుడు వద్దు అనుకున్నా కూడా ఎన్నికలు రావు. ఎవరి కోపాలో, అక్కసులో ఎన్నికలను పదే పదే పెట్టేలా మన రాజ్యాంగం రాసుకోలేదు. పవన్ కల్యాణ్ లో రాజకీయ పరిణతి లేదు అనడానికి ఆయన కూల్చివేత కామెంట్స్ ఒక ఉదాహరణ. పవన్ కల్యాణ్ కి రాజకీయం తెలియదు, ఎత్తులు వ్యూహాలు అసలు తెలియవు. ఆయనకు తెలిసిందల్లా జగన్ మీద ద్వేషంతో చిల్లర మాటలు మాట్లాడడం అని వైసీపీ నేతలు ఎందుకు అంటున్నారో ఒకసారి జనసేనాని ఆలోచించుకుంటే మంచిదేమో.

Tags:    

Similar News