అరుపులేనా? ఆలోచన లేదా?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో కాదు. ఒక సంపూర్ణ రాజకీయనాయకుడు, జనసేన అధినేత. లక్షలాదిమంది సైన్యానికి సేనాని. అయితే ఆయన మ్యానరిజం మాత్రం మెజారిటీ ప్రజలు ఇష్టపడటం [more]

Update: 2020-01-01 03:30 GMT

పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో కాదు. ఒక సంపూర్ణ రాజకీయనాయకుడు, జనసేన అధినేత. లక్షలాదిమంది సైన్యానికి సేనాని. అయితే ఆయన మ్యానరిజం మాత్రం మెజారిటీ ప్రజలు ఇష్టపడటం లేదన్న విమర్శలు మొన్నటి ఎన్నికల నుంచి వినవస్తున్నాయి. అయినా తన స్టయిల్ ను ఉద్వేగంతో ఊగిపోయే తీరు, ఆవేశంతో అరిచే అరుపుల్లో ఏ మాత్రం మారలేదన్నది తాజాగా అమరావతి ప్రాంతంలో రైతుల పరామర్శ కార్యక్రమంలో స్పష్టం చేసింది. రెండు పదుల వయస్సులో వుండే కుర్రకారు ఉద్రేకాన్ని పరిణతి కలిగిన వయసులో పవన్ కళ్యాణ్ ప్రదర్శించడం చర్చనీయంగా మారుతుంది.

ప్రతి అంశాన్ని జనం పరిశీలిస్తారు…

రాజకీయాల్లో వుండే వారిని ముఖ్యంగా పార్టీ అధినేతలుగా ఉండేవారి ప్రతి అంశాన్ని ప్రజలు, మీడియా నిశితంగా పరిశీలిస్తారు. వారి ప్రసంగాల తీరు, హావభావాలు, ప్రజలతో మమేకం అయ్యే విధానం,చేపట్టే కార్యక్రమాలు, వేసుకునే బట్టలు, జీవన శైలి మరింతగా చర్చనీయం అవుతాయి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఆవేశంతో ఊగిపోతూ ఆకట్టుకునే ప్రసంగాలు చేయడం ఏపీ లో ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది. ఆయన తరువాత ఆ స్థాయిలో తెలుగు రాజకీయాల్లో రాణించే నటులు సమీప భవిష్యత్తులో లేరనే చెప్పొచ్చు. సినీ జీవితంలో వున్నప్పుడు పవర్ స్టార్ గా క్రేజీ హీరోగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఉన్నంత ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి లా హుందాతనంతో కూడిన రాజకీయాలు మాత్రం ఆయన అలవర్చుకోలేకపోయారు.

ఆకట్టుకోలేకపోతున్న …

విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా డొంక తిరుగుడు లేకుండా మాట్లాడటం, ఒక సబ్జెక్ట్ లో నుంచి మరో దాంట్లోకి వెళ్లిపోవడం పవన్ కళ్యాణ్తరచు చేస్తారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఒక్కోసారి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ అంతే సాఫ్ట్ గా మాట్లాడే పవన్ కళ్యాణ్ అపరిచితుడు అవతారం దాలుస్తూ ఉండటం వల్లే ఆయన కేవలం యూత్ స్టార్ గా మిగిలిపోయారని విశ్లేషకుల భావన. టిడిపి అధినేత చంద్రబాబు ఆకట్టుకునే ప్రసంగాలు చేయలేరు. అయితే హావభావాలు స్థిరంగా వుంటూ చెప్పే మాటలకు అనుగుణంగా ఉంటాయి. కానీ తన అభిప్రాయమే ప్రజాభిప్రాయమనే అభిప్రాయ వ్యక్తీకరణలో ఆయన అందెవేసిన చేయి. చంద్రబాబు. అదే పవన్ కళ్యాణ్ స్థిరంగా మాట్లాడటం, ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడతారు అనే రీతిలో నడుచుకుంటే ప్రతి వయస్సు వారిని ఆకట్టుకోగలరని సూచిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో దెబ్బ తిన్న తరువాత అయినా పవన్ కళ్యాణ్ లో మార్పు వస్తుందనుకున్నవారిలో ఇప్పుడు నిరాశే ఎదురు అవుతుంది.

పద్దతి మార్చుకుంటేనే …

జనసేనాని అదే రీతిలో మరింతగా వివిధ సందర్భాల్లో భావావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతూ వస్తుంది. ప్రత్యర్ధులు పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనీ డ్రామాగా కొట్టిపారేయడానికి ఆయన వ్యవహరశైలి కారణం అవుతున్నా నేరుగా ఆయనకు చెప్పేంత వారు లేకపోవడంతో జనసేనకు జరగాలిసిన నష్టం జరిగిపోతుంది అని అంటున్నారు. మంచి చరిష్మా ఉండి ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలిసిన పవన్ కళ్యాణ్ పార్టీ ఇలాంటి మైనస్ లను అధిగమిస్తే కానీ ముందుకు వెళ్లలేదని ఏదో ఒక పార్టీతో పొత్తు తోనే వెళ్లాలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News