“పట్టు” పట్టనేల…?

ప‌ట్టుప‌ట్టనేల.. ప‌ట్టి విడువ‌నేల‌..! అనేది సామెత‌. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న వారికి ఈ సామెత అచ్చు గుద్దిన‌ట్టు స‌రిపోతుంది. ఈ ప‌రిస్తితిలో రాజ‌కీయాల్లో ఉన్నవారికి బ్యాడ్‌నేమ్ కూడా [more]

Update: 2019-12-15 14:30 GMT

ప‌ట్టుప‌ట్టనేల.. ప‌ట్టి విడువ‌నేల‌..! అనేది సామెత‌. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న వారికి ఈ సామెత అచ్చు గుద్దిన‌ట్టు స‌రిపోతుంది. ఈ ప‌రిస్తితిలో రాజ‌కీయాల్లో ఉన్నవారికి బ్యాడ్‌నేమ్ కూడా వ‌స్తోంది. ఏదైనా విష‌యం పై ప‌ట్టు ప‌ట్టడం, ఆ వెంట‌నే కొన్నాళ్లకు తెర‌మ‌రుగు కావ‌డం స‌హ‌జ ప‌రిణామంగా మారిపోయింది. ఇక‌, స‌మాజంలో మార్పుకోసం అంటూ ఆవిర్భవించిన జ‌న‌సేన వంటి పార్టీ విష‌యంలో ఇప్పుడు ఇది కామ‌న్ అయిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. మారుతున్న కాలాని అనుగుణంగా పార్టీని, నాయ‌కుల‌ను తయారు చేసుకోక పోతే.. ఏం జ‌రుగుతుందో దేశంలోని క‌మ్యూనిస్టులే ప్రధాన ఉదాహ‌ర‌ణ‌. ఇక‌, ఈ జాబితాలో కాంగ్రెస్ కూడా చేరిపోయింది.

సుదీర్ఘ సమరం కావడంతో….

ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజకీయాలు చేస్తున్నార‌నే వాద‌న జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విషయంలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆయ‌న చేస్తున్న రాజకీయం ఆయ‌న‌కైనా అర్ధమ‌వుతోందా ? అనే భావ‌న కలిగిస్తోంది. గ‌డిచిన ఆరు మాసాల కాలంలో ప‌వ‌న్ కల్యాణ్ అనేక వ్యూహాత్మక అంశాల‌ను భుజాన వేసుకున్నారు. వీటిలో ప్రదానంగా ఏపీకి ప్రత్యేక హోదా, త‌ర్వాత ఇసుక‌, త‌ర్వాత తెలుగు, త‌ర్వాత సీమ క‌రువు, ఇప్పుడు రైతులు, అయితే, ఈ విష‌యాల్లో దేనిపైనా ప‌వ‌న్ నిబ‌ద్దత‌తో కూడిన రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏ విష‌యాన్ని ఎత్తుకున్నా.. అవి సుధీర్ఘ స‌మ‌రంతో కూడిన అంశాలే కావ‌డం గ‌మ‌నార్హం.

కేంద్రం నిర్ణయమైనా…..

పైగా గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అంశాలే. ఆయా స‌మయాల్లో మౌనంగా ఉన్న ప‌వ‌న్‌ కల్యాణ్ ఇప్పుడే కొత్తగా సీమ‌కు క‌రువు వ‌చ్చిన‌ట్టు, ఇప్పుడే కొత్తగా రైతుల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర‌లు ల‌భించ‌న‌ట్టు, ఇప్పుడే కొత్తగా తెలుగు ప్రాధాన్యం పోయిన‌ట్టు ఆయ‌న క‌న్నీరు పెడుతున్నారు. వాస్తవానికి ఆయా విష‌యాల్లో జ‌ర‌గాల్సిన న‌ష్టం ఎప్పుడో జ‌రిగిపోయింది. రైతుల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర అనేది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక‌, రైతుల‌కు మూడు రోజుల్లో డ‌బ్బులు ఇస్తాన‌న్న ప్రభుత్వం ఇవ్వడం లేద‌ని ప‌వ‌న్ కల్యాణ్ అంటు న్నారు. ధాన్యం కొనుగోలు చేసిన డ‌బ్బులు కొన్నిరోజులు ఆల‌స్యమైనా కూడా ఎట్టి ప‌రిస్థితిల్లోనూ రైతుల ఖాతాల్లోకి చేరిపోతాయి.

నిలకడ లేమితో…..

మ‌రో ప్రధాన మైన విష‌యం హోదా. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ కల్యాణ్ గ‌తంలో గ‌ట్టిగానే పట్టుకున్నా.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న జార విడిచారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ప‌వ‌న్‌ కల్యాణ్ కు నిబద్ధత ఉందా ? ఆయ‌న ఎప్పుడు ఏ అంశాన్ని ఎంచుకుంటారో ? అంటూ .. వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ప‌ట్టుప‌ట్టనేల‌.. విడ‌వ‌నేల ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా.. రాష్ట్రంలో మార్పు కోసం ఆవిర్భవించిన పార్టీ మార్పులు చూడ‌కుండానే వ్యక్తి పార్టీగా మారిపోవ‌డం, స‌మాజానికి చేరువ కాలేక పోవ‌డం ఇప్పుడు చ‌ర్చకు వ‌స్తున్న ప్రధాన అంశాలుగా పేర్కొంటున్నారు.

Tags:    

Similar News