పవన్ ను పట్టించుకోరా?

పవన్ కళ్యాణ్ బేసికల్ గా సినీ నటుడు. ఆయనకు యువతలో ఉన్న క్రేజ్ కూడా అదే. ఆయన్ని సీరియస్ పొలిటీషియన్ గా గుర్తించకపోవడానికి కూడా ఈ సినీ [more]

Update: 2019-12-12 00:30 GMT

పవన్ కళ్యాణ్ బేసికల్ గా సినీ నటుడు. ఆయనకు యువతలో ఉన్న క్రేజ్ కూడా అదే. ఆయన్ని సీరియస్ పొలిటీషియన్ గా గుర్తించకపోవడానికి కూడా ఈ సినీ ఇమేజ్ అడ్డుగా వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వాడుతున్న భాష, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, విసురుతున్న సవాళ్ళు ఇవన్నీ కూడా సినిమాటిక్ గానే ఉంటున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన వైసీపీనే టార్గెట్ చేసి బాణాలు విసురుతున్నారు. అది ఉల్లి అయినా, ఇసుక అయినా, టమాటా అయినా కూడా జగన్ దే తప్పు అంటూ తగులుకుంటున్నారు. ఆయన మాటకు వస్తే చాలు 151 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంతమందికి ఎన్నుకుని ఏం లాభమని సెటైర్లు వేస్తున్నారు. ఇక ప్రతీదాన్ని జగన్ తోనే ముడిపెట్టి మీరు ఇవేమీ తీర్చలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ బురద రాజకీయం చేస్తున్నారని అంటూ గట్టిగా కౌంటర్లేస్తున్నారు.

కొత్తరకమేనా…?

నా రాజకీయం భిన్నం, నేను అందరిలా వ్యక్తిగత విమర్శలు చేయను, హుందాగా రాజకీయం చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పుకొచ్చారు. విమర్శలు చేస్తే పనులు అవుతాయా, పాలకుల వద్ద ఏమైనా మంత్ర దండం ఉందా, అలాగని అన్ని సమస్యలు ఒకేసారి తీర్చమంటే కూడా అయ్యేపనేనా అన్నది కూడా ఇదే పవన్ కళ్యాణ్. ఇక తాను ఆందోళనలు, బందులు, దీక్షలకు వ్యతిరేకమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇవి రాజకీయ నాయకులు తమను తాము ప్రచారం చేసుకోవడానికి పనికివస్తాయి కానీ సమస్యను పరిష్కరించలేవు అని సుద్దులు చెప్పిందీ కూడా ఆయనే. కానీ పవన్ కళ్యాణ్ ఇపుడు తన మాటలను తానే తప్పేసి మరీ వైసీపీ మీద రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తే ఒక రోజు అంతా నగరవాసులు నానా ఇబ్బందులు పడ్డారు. నెల తిరగకుండానే పవన్ కళ్యాణ్ రైతుల పేరిట దీక్ష అంటున్నారు. ఇలా ఆందోళను చేయడం ద్వారా సమస్య తీరదు అని చెప్పిన ఆయనే ఇపుడు చేస్తున్నారంటే ప‌వ‌న్ చెప్పినట్లుగానే సొంత ప్రచారమే అనుకోవాలా అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

అనీ అబద్దాలేనట….

పవన్ అన్నీ అబద్దాలే చెబుతున్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు అంటున్నారు. ఏపీలో వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని, చేస్తోందని, కానీ ఈ ఆరు నెలల్లో ఏదో జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ చేస్తున్న గడబిడ దారుణమని అంటున్నారాయన. సగం సగం సమాచారంతోనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని కూడా కన్నబాబు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రైతులకు ఇపుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదని, రెచ్చగొట్టాలనే పవన్ కళ్యాణ్ ఇలా జనంలోకి వస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఏపీలో ఇప్పటికిపుడు ఏదో చేసి తాను జనంలో ఉన్నాననిపించుకోవాలన్న తాపత్రయం పవన్ కళ్యాణ్ ప్రతీ అడుగులో కనిపిస్తోందని కూడా చెబుతున్నారు.

రాజకీయ తొందరపాటేనా?

పవన్ కళ్యాణ్ కనీసమాత్రంగా సర్కార్ కి సమయం ఇవ్వకుండా అన్ని సమస్యలూ పరిష్కారం చేస్తారా లేదా అని పంతం పట్టినట్లుగా రచ్చ చేయడం వల్ల ఆయనకు కూడా పొలిటికల్ మైలేజ్ ఎంతవరకు వస్తుందో చెప్పలేమని కూడా విశ్లేషకులు అంటున్నారు. పండు పక్వానికి వచ్చినపుడే కోసుకుతినగలమని, రాజకీయాల్లో కూడా జనాలు కలసివచ్చినపుడే నాయకుడికి విజయం దక్కుతుందని అంటున్నారు, ఇపుడు ప్రజలు కొత్త సర్కార్ మీద ఆశగా ఎదురుచూస్తున్నారని, ఈ టైంలో జనంలోకి వచ్చి హడావుడి చేసినా కూడా వారి చూపు పెద్దగా పడే అవకాశం ఉండదని అంటున్నారు. ఓ విధంగా ఇది రాజకీయ తొందరపాటుగా కూడా అభివర్ణిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కు మాత్రం అన్ని ప్రశ్నలు ఒకేసారి గుర్తుకువస్తున్నాయని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News