పవన్ వెళితే కుమ్మేసినట్లేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం నీడకు చేరేందుకు సిద్ధం అయిపోయారా ? అవును ఆయన అదే పనిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని వైసిపి ఆరోపిస్తూ గట్టి [more]

Update: 2019-12-06 03:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం నీడకు చేరేందుకు సిద్ధం అయిపోయారా ? అవును ఆయన అదే పనిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని వైసిపి ఆరోపిస్తూ గట్టి ప్రచారమే మొదలు పెట్టింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికార, విపక్షాలు, బిజెపి మినహా కామ్రేడ్ లు, బీఎస్పీ సహా జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగినా ఒకే ఒక్క సీటు క్యాండిడేట్ ఇమేజ్ మీద మాత్రమే తూర్పుగోదావరి జిల్లాలో దక్కించుకుంది. మిగిలిన చోట్ల అభ్యర్థులంతా వైసిపి గాలిలో కొట్టుకుపోయారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఓటమి పాలుకావడంతో ఆ పార్టీ పై భవిష్యత్తు అంచనాలు ఉన్నవారంతా నీరసపడ్డారు.

నమ్ముకున్నవారే గుడ్ బై …

ఇక రాఘవయ్య నుంచి అద్దేపల్లి శ్రీధర్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ వంటివారంతా ఎన్నికల ముందు తరువాత గుడ్ బై చెప్పేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట ఆయన నీట ముంచినా పాల ముంచినా జై కొట్టేవారే ఫైనల్ గా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా చేసిన అనేక తప్పులు పార్టీని నిండా ముంచాయని అధినేతతో పాటు తాము కొట్టుకుపోయాం అన్నది ఇప్పటికి పరాజితుల మనసులో మాట. పవన్ కళ్యాణ్ వైపు గాలి వీస్తే తామంతా ఎమ్యెల్యే, ఎంపి లు అయిపోవొచ్చని ఆశపడ్డ వారంతా సొంత జేబులు ఖాళీ చేసుకుని దెబ్బయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కామ్రేడ్ లను, బీఎస్పీ ని వదిలి బిజెపి తో పొత్తు పెట్టుకుని ఉంటే ఎన్నో కొన్ని సీట్లు సాధించేవారమని జనసేన అభ్యర్థుల్లో వుంది. ఇదే విషయాన్ని కొందరు పార్టీ సమీక్షల్లో వ్యక్తం చేశారని తెలుస్తుంది.

వేరే దారి లేదు ….

కేంద్రంలో నరేంద్ర మోడీ స్ట్రాంగ్ గా వున్న నేపథ్యంలో గతంలో చేసిన తప్పులను దిద్దుకుని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాలంటే కమలంతో సఖ్యత చాలా ముఖ్యమని పార్టీ పెద్దలు సూచించడంతో ఆయన అడుగులు అటు గా కదులుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ రహస్య పర్యటన వెనుక అంతరార్ధం ఇదే అని వైసిపి గ్రహించే ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తరువాత జగన్ రెడ్డి అంటూ కుల ప్రచారం ఆయన మతం మీద చేస్తున్న కామెంట్స్ వెనుక కాషాయ వ్యూహమే అన్నది పొలిటికల్ టాక్. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన నాటినుంచి జగన్ లక్ష్యంగానే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అధికారంలో చంద్రబాబు వున్నా, అరకొరగా మాత్రమే విమర్శలకు దిగేవారు. దాన్నే ఆయుధంగా మలుచుకున్న వైసిపి ఎడాపెడా పవన్ కళ్యాణ్ టిడిపి తొత్తు అంటూ దాడికి దిగి సక్సెస్ అయ్యింది.

వైసిపి లక్ష్యం ఇదేనా …?

అదే ఫార్ములా ఇప్పుడు బిజెపి జనసేన దోస్తీపై చేయాలన్న లక్ష్యంగా ఇటీవల ఆ కోణంలో విమర్శలు ఎక్కుపెట్టింది. టిడిపి పై ఏ స్థాయిలో విమర్శలు, ఆరోపణలకు దిగుతుందో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ ను సైతం అలక్ష్యం చేయకుండా యుద్ధం మొదలు పెట్టింది. భవిష్యత్తు పరిణామాలు గమనించే ఈ రెండు పార్టీలను వైసిపి వ్యూహం ప్రకారం లక్ష్యం చేసుకున్నట్లే కనిపిస్తుంది. వాస్తవానికి జనసేన – బిజెపి దోస్తీ సెట్ అయితే మాత్రం ఎపి లో టిడిపి మరోసారి భంగపడే అవకాశాలే ఎక్కువంటున్నారు విశ్లేషకులు.

పవన్ బిజెపి వైపు చూస్తే …

వైసిపి ఇప్పటికే టిడిపి ఓటు బ్యాంక్ కి భారీగా కన్నం పెట్టింది. వైసిపి ఓటు బ్యాంక్ లాగాలన్న తపనలో తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెన్నెముకగా వున్న వర్గాలను ఆ పార్టీ విస్మరించి చావుదెబ్బ తింది. పవన్ కళ్యాణ్ కు వున్న ఓటు బ్యాంక్ కి హిందూ ఓటు బ్యాంక్ తోడైతే టిడిపి మైనస్ లో పడే ప్రమాదం పొంచి వుంది. ఏపీ లో ఎదుగుదలకు ఎవరితోనైనా టిడిపి మినహా కలిసేందుకు సిద్ధమైన కమలనాధులు బలమైన ఆకర్షణ కలిగిన నేత ను ముందు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అని గుర్తించిన బిజెపి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

Tags:    

Similar News