Pawan kalyan : ఆ కార్డు తీయకపోతే ఇక కష్టమేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ రాజకీయంగా అడుగులు వేయడానికి ఒక మార్గాన్ని అయితే ఎంచుకున్నట్లు కనపడుతుంది. కాపు రిజర్వేషన్లను తిరిగి పవన్ కల్యాణ‌్ తెరమీదకు తెస్తున్నారు. తాజాగా [more]

Update: 2021-09-26 06:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ రాజకీయంగా అడుగులు వేయడానికి ఒక మార్గాన్ని అయితే ఎంచుకున్నట్లు కనపడుతుంది. కాపు రిజర్వేషన్లను తిరిగి పవన్ కల్యాణ‌్ తెరమీదకు తెస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ‌్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దంపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం చూస్తే ఎన్నికల వేళ ఈ అంశాన్ని ప్రధానంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు కన్పిస్తోంది.

బలం…బలహీనత….

పవన్ కల్యాణ్ కు బలం, బలహీనత ఆయన అభిమానులే. అదే సమయంలో కాపు సామాజికవర్గం కూడా ఆయన బలం అని చెప్పుకోవాలి. గతంలో కాపు ముద్ర తనపై పడుతుందన్న అభిప్రాయంతో పవన్ కల్యాణ్ వెనుకంజ వేశారు. కాపు రిజర్వేషన్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాపు సామాజికవర్గం సమస్యలను కూడా ఆయన పక్కన పెట్టారు. తనపై ఒక సామాజికవర్గం ముద్రపడితే రాజకీయంగా నష్టం జరుగుతుందని పవన్ కల్యాణ్ భావించారు.

కాపులకు మద్దతుగా….

కానీ ఇప్పుడు పరిస్థిితి అర్థమయినట్లుంది. టీడీపీపై కమ్మ సామాజికవర్గం ముద్ర, వైసీపీ రెడ్డి సామాజికవర్గం పార్టీగా ఏపీలో ఉన్నాయి. అయితే ఏపీలో కాపు సామాజికవర్గం ఓటర్లు అత్యధిక శాతం ఉన్నారు. ఇతర సామాజికవర్గం ఓట్ల తో పోలిస్తే కాపులే ఎక్కువ. దీంతో తాను కూడా ఎందుకు తన సామాజికవర్గాన్ని సొంతం చేసుకోకూడదన్న నిర్ణయానికి పవన్ కల్యాణ‌్ వచ్చినట్లే ఉంది. గత ఎన్నికల్లో పవన్ వైఖరి కారణంగానే కాపులు జనసేన వైపు మొగ్గు చూపలేదు. అందుకే పట్టున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విజయం దక్కలేదు.

ముద్ర పడితేనే బెటర్ అట…

ఈ కారణంగా తాను కాపు సామాజికవర్గం నేతగా ముద్ర పడితేనే బెటర్ అని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుంది. కాపుల్లో ఇమేజ్ ఉన్న నేత కావడం కూడా ఆయనకు ప్లస్ కానుంది. అందుకే కాపు రిజర్వేషన్ల పై ఇక పవన్ కల్యాణ‌్ పోరాడాలని భావిస్తున్నట్లే కనపడుతుంది. అయితే బీజేపీతో కలసి ఉంటే అది సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కావడంతో కేంద్రాన్ని ఆయనే ఒప్పించాల్సి ఉంటుంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ కాపు కార్డుతో వచ్చే ఎన్నికల్లో వెళ్లేందుకే సిద్ధమయ్యారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.

Tags:    

Similar News