పవన్ ముఖ్యమంత్రి ఇలా అవుతారట?

రాజకీయాల్లో అవకాశాలు ఎపుడూ ఉంటాయి. ఇక్కడ ఎవరూ తోపు కాదు, ఆ మాటకు వస్తే ఎవరూ శాశ్వతం కూడా కాదు, నాకు తిరుగులేదు అనుకున్న మహామహులే ఎన్నికల్లో [more]

Update: 2021-09-14 13:30 GMT

రాజకీయాల్లో అవకాశాలు ఎపుడూ ఉంటాయి. ఇక్కడ ఎవరూ తోపు కాదు, ఆ మాటకు వస్తే ఎవరూ శాశ్వతం కూడా కాదు, నాకు తిరుగులేదు అనుకున్న మహామహులే ఎన్నికల్లో ఓడి మాజీలైపోయారు. అందువల్ల ప్రజాభిప్రాయం ఎప్పటికపుడు మారుతూనే ఉంటుంది. నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుకున్నా మరో ముప్పయ్యేళ్ళు నేనే సీఎం అని భావించినా కూడా జనాల దగ్గర ఉడికే పప్పులు కావని కూడా రాజకీయ పండితులు చెబుతారు. ఏపీలో చూసుకుంటే ఇపుడు జగన్ సీఎం గా ఉన్నారు. అపర చాణక్యుడు అనిపించుకున్న చంద్రబాబు హైదరాబాద్ లో జూమ్ యాప్ వెనక చేరి ప్రవాసంలో ఉన్నారు.

అలాగే జరగదు …

గణితానికి లెక్కలు ఉంటాయి. రెండు రెండూ కలిస్తే నాలుగు అని కచ్చితంగా చెప్పవచ్చు. రాజకీయాల్లో మాత్రం అది ఆరు కావచ్చు, నూటా పదహారూ కావచ్చు. ఇపుడు ఏపీలో టీడీపీకి ఒక లెక్క ఉంది. అదేంటి అంటే వైసీపీ పూర్తిగా పరువు పోగొట్టుకున్న చోట ఏకైక ఆముదపు చెట్టులా తాను అవతరిస్తాను అని. జనాలకు తాను తప్ప వేరే దిక్కు కూడా లేదు అని టీడీపీ అతి విశ్వాసం. జగన్ ఫెయిల్ అయిన నాడు జనం గంపగుత్తగా ఓట్లు పసుపు పార్టీకే కుమ్మరిస్తారు అని కూడా తమ్ముళ్ళు భావిస్తూంటారు. తాజాగా అచ్చెన్నాయుడు 155 సీట్ల కధ కూడా అందులో భాగమే. మరి అలాగే జరుగుతుందా అంటే ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో ఈ లెక్కలు అసలు కుదరవు.

మూడు మారితే…?

ఇక ఏపీ జనాలు విభజన తరువాత రెండు పార్టీలను ఇద్దరు నాయకులనూ చూశారు. చంద్రబాబుకి అనుభవం ఎక్కువ అని నెత్తినెక్కించుకుంటే దారుణమైన పాలన సాగించాడు అన్నది జనాలకు ఉన్న అభిప్రాయం. ఆయన ఏలుబడిలో అవినీతి, బంధుప్రీతి, కుల ప్రీతి కూడా హెచ్చుగా సాగడమే కాదు, హైదరాబాద్ మోడల్ పేరిట అమరావతిలో చేసిన ప్రయోగాలకు కూడా జనం విసిగారు, అందుకే యువనేత జగన్ ని అక్కున చేరుకుని 151 సీట్లతో పట్టాభిషేకం చేశారు. కానీ జగన్ రెండున్నరేళ్ల పాలన తరువాత కొంత వ్యతిరేకత వచ్చింది. అది ఎన్నికల నాటికి పెరిగి పెద్దదైతే ఆయన కూడా వద్దు అని ప్రజలు అనుకుంటే వేరే దారేంటి అన్న ప్రశ్న కూడా కళ్ల ముందు ఉంది.

బంపర్ ఆఫర్…

ఇక ఏపీలో ముచ్చటగా మూడవ పార్టీగా జనసేన ఉంది. దాని నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమీ ఆషామాషీ నేత కాదు. ఆయనకు కావాల్సినంత సినీ గ్లామర్ ఉంది. అంతే కాకుండా బలమైన సామాజిక వర్గం కూడా ఉంది. ప్రత్యేకించి అటు బాబుకు, ఇటు జగన్ కి లేని విధంగా యూత్ ఫాలోయింగ్ కూడా వెల్లువలా ఉంది. మరి పవన్ కల్యాణ్ సరైన నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అని చెప్పవచ్చా అంటే కాదు అని కొట్టి పారేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు అప్లై అవుతాయి. పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు, అలాగే టీడీపీని కూడా వెంట తిప్పుకోకూడదు, తనకు తానుగా మొత్తం 175 సీట్లలో పోటీ చేసినా లేక వామపక్షాల లాంటి తటస్థ పార్టీలను కలుపుకుని పోయినా కూడా ఏపీ రాజకీయాల్లో మార్పు తధ్యమనే అంటున్నారు. దాని కోసం పవన్ కల్యాణ్ ఈ రోజు నుంచే కార్యక్షేత్రంలో ఉండాలి. మొత్తానికి మొత్తం అభ్యర్ధులను ఎంపిక చేసుకుని జనంలో ఉంటూ పోరాడితే మాత్రం ఏపీ ప్రజలు మూడో కృష్ణుడికి కూడా పట్టం కట్టడం ఖాయ‌మే. మరి పవన్ కల్యాణ్ కి ఏపీలో బోలెడు స్పేస్ ఉంది, ఆయన ఈ అవకాశాలను వాడుకోగలరా అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News