కంప్లీట్ చేంజ్ అంటున్న పవన్… ?

ఏ సినిమాకు అయినా క్లైమాక్స్ అన్నది మూలాధారం. అది గట్టిగా ఉంటే సినిమా సూపర్ హిట్టే. ఇదివరకు మాటేమో కానీ ఇపుడు రాజకీయాలు అంటే ఎన్నికలకు ఏడాది [more]

Update: 2021-05-31 00:30 GMT

ఏ సినిమాకు అయినా క్లైమాక్స్ అన్నది మూలాధారం. అది గట్టిగా ఉంటే సినిమా సూపర్ హిట్టే. ఇదివరకు మాటేమో కానీ ఇపుడు రాజకీయాలు అంటే ఎన్నికలకు ఏడాది ముందే కధ అంతా మారుతోంది. మరి సినీ హీరో కమ్ పొలిటికల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ కంటే క్లైమాక్స్ కధలు ఎవ‌రికి బాగా తెలుస్తాయి. అందుకే పవన్ తన సినిమాను హిట్ చేసిన మాదిరిగానే పొలిటికల్ మూవీని కూడా హిట్ కొట్టించాలనుకుంటున్నాడుట. అంటే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు 2023లో పవన్ కళ్యాణ్ అసలైన పాలిటిక్స్ స్టార్ట్ అవుతుందిట.

సినిమాలే మరి…?

మరి అంతవరకూ ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ వరసపెట్టి సినిమాలు చేస్తారుట. నిజానికి ఈపాటికి కరోనా అన్నది లేకపోతే పవన్ చేసిన చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేవి. పవన్ కూడా 2022 తరువాత ఏపీలో రాజకీయ రధాన్ని జోరుగా నడిపేవాడు. కానీ ఇపుడు మొత్తం షెడ్యూల్ మారిపోయింది. అందుకే సినిమాలు ముందు చకచకా చేసేసి 2023 నుంచి ఏపీ రాజకీయ తెరపైన వెలిగిపోవాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నాడుట. అంతవరకూ ఆయన ఎత్తులు పొత్తులు వ్యూహాలు అన్నీ కూడా అలా అట్టేపెడతారుట.

బాబే ముద్దు…

బీజేపీతో బంధం కుదరదు, పొసగదు ఇదీ జనసేనలో వినిపిస్తున్న మాట. ఎంత ఎగిరినా కూడా ఏపీలో జనసేన బలం అయిదు శాతం మించడంలేదు. బీజేపీకి ఎంత చేయి కాపు ఇచ్చినా ఒక శాతం కంటే ఎదగలేకపోతోంది. ఈ రెందు పార్టీలు కలిస్తే ఆరు శాతం ఓట్లు తప్ప ఎక్కువగా వచ్చే చాన్స్ లేదు. అదే ముప్పయి అయిదు శాతం ఓట్లు ఉన్న టీడీపీలో కలిస్తేనే వైసీపీని ఎదిరించగలమని పవన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికిపుడు బీజేపీతో దోస్తీ కట్ అంటే చిన్నపిల్లాటగా ఉంటుంది. పైగా పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం పవన్ కళ్యాణ్ కి అలవాటే అన్న చెడ్డ పేరూ కూడా వస్తుంది. అందుకే 2023 దాకా ఫుల్ సైలెంట్ గా ఉండి ఒక్కసారి కాషాయానికి తలాక్ అనేసి టీడీపీతో కొత్త పొత్తుకు జనసేనాని తెర తీస్తారు అన్నది వినిపిస్తున్న మాట.

జగనే టార్గెట్ …?

మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కి ఏంటి లాభం అన్న మాట కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కి జగన్ మాజీ సీఎం కావడమే ముఖ్యం అన్న మాట వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా భాగస్వామ్యం తీసుకుని తన పార్టీని విస్తరించుకోవచ్చు అన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. మరో సారి జగన్ వస్తే మాత్రం రాజకీయాలకే స్వస్తి పలకాల్సి ఉంటుందన్న ఆలోచనతోనే టీడీపీ తో జట్టు కట్టేందుకు మొగ్గు చూపిస్తున్నారు అంటున్నారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య కూడా రాయబేరాలు సాగుతున్నాయని కూడా తెలుస్తోంది. మొత్తానికి చూస్తూంటే 2014 ఎన్నికల ముందు వచ్చి మొత్తం పొలిటికల్ సినేరియాను మార్చేసినట్లుగా 2024లో కూడా క్లైమాక్స్ లో వచ్చి మొత్తం ఏపీ పొలిటికల్ సినిమాను తామే మారుస్తామని జనసేన నేతలు ధీమాగా చెబుతున్నారు.

Tags:    

Similar News