షాడో అయితే ఎలా…?

రాజకీయాలంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతీ మాట ఆచీ తూచీ ఉండాలి. అడుగులు కూడా జాగ్రత్తగా వేయాలి. లేకపోతే బదనాం చేసేందుకు ప్రత్యర్ధి పార్టీలు రెడీగా [more]

Update: 2019-11-19 08:00 GMT

రాజకీయాలంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతీ మాట ఆచీ తూచీ ఉండాలి. అడుగులు కూడా జాగ్రత్తగా వేయాలి. లేకపోతే బదనాం చేసేందుకు ప్రత్యర్ధి పార్టీలు రెడీగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ మరి వ్యూహాత్మకం అనుకున్నారో, రాజకీయ అవసరంగా భావించారో తెలియదు కానీ టీడీపీతో ఆయన దోస్తీ చేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల మేధావులు, మధ్యతరగతి వర్గాలు హర్షించాయి. ఎందుకంటే 2014 ఎన్నికల నాడు అటు జగన్, ఇటు చంద్రబాబు ఉన్నారు. దాంతో పవన్ కళ్యాణ్ మద్దతు సీనియర్ నాయకుడిగా, ఏపీకి కొత్త దశ, దిశ చూపే నేతగా బాబుకు ఉండడం సబబేనని కూడా అనుకున్నారు. అంతవరకూ ఒకే కానీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతను నెరవేర్చకపోవడం వల్లనే ఈనాడు ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. బాబును ముఖ్యమంత్రిని చేయడం వరకూ బాగానే ఉన్నా ఆయన పాలనలో చేసే తప్పొప్పులు పవన్ కళ్యాణ్ ఎత్తి చూపకపోవడం, ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన నేత మౌనం దాల్చడంతోనే జనసేన ఉనికి ఇబ్బందులో పడింది.

దెబ్బ పడిందిగా….?

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్త. ఆయన అంటే జనాలకు మోజు ఉండాలి. ఎందుకంటే 2019 ఎన్నికల వరకూ ఆయన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చేయలేదు. దాంతో ఆయన్ని గెలిపిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి ఉత్కంఠ జనాల్లో ఉండి తీరాలి. అవి ఉండాలంటే పవన్ కళ్యాణ్ మటుకు ఆయన చేయాల్సినవి చేయాలి కదా. తాను సొంతంగా రాజకీయాలు చేస్తున్నట్లుగా రుజువు చేసుకోవాలిగా. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చంద్రబాబుని పల్లెత్తు మాట అనలేదు, పైగా లోకేష్, బాబు పోటీ చేసిన చోట్ల ప్రచారమూ చేయలేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో బాబు అదే తీరు కనబరచారు. జగన్ ని ఎంతసేపూ తిట్టడం వల్ల ప్రయోజనం లేదని తెలిసినా పవన్ కళ్యాణ్ అదే రూట్లోనే తిరిగారు. చివరికి రెండు చోట్లా ఓడిపోయారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినా బాబుకు వేసినట్లేనని జనం భావించడమే.

మళ్ళీ అంతేగా…?

ఇక ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక అయినా పవన్ కళ్యాణ్ తన తీరుని మార్చుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి. ఆయన జగన్ ని విమర్శిస్తూ బాబుకు షాడోలా మారుతున్నారన్న విమర్శలు అంతటా వస్తున్నాయి. బహుశా ఇదే ఇపుడు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతోంది. మాటకొస్తే చాలు బాబుతో పవన్ కళ్యాణ్ దోస్తీని చెప్పి మరీ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జగన్ పాలన ఎన్ని పంచులు వేసినా మరెన్ని విమర్శలు చేసినా ఒక్క దెబ్బకు చెల్లు అన్నట్లుగా తుస్సుమంటున్నాయి. పవన్ కళ్యాణ్ బుర్ర నిండా చంద్రబాబు నిండిపోయారని మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్ అల్టిమేట్ అనే చెప్పాలి. మరి ఈ విషయంలో జనసేనలోనూ మధనం మొదలైందట. పవన్ కళ్యాణ్ సొంతంగా రాజకీయాలు చేయాలంటే వీలైనంతవరకూ పసుపు శిబిరానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారుట. అయితే పవన్ కళ్యాణ్ దీన్ని ఎంతవరకూ ఆచరణలో పెడతాడో చూడాలి.

Tags:    

Similar News