పవన్ పనికి రాడంటున్నారు ఎందుకో?

ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకత్వంపై నేతలకు, క్యాడర్ కు నమ్మకం ఉండాలి. ఒక్క అభిమానం ఉంటే సరిపోదు. వారితో తరచూ సమావేశమవ్వాలి. నాయకులకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి. [more]

Update: 2021-04-26 03:30 GMT

ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకత్వంపై నేతలకు, క్యాడర్ కు నమ్మకం ఉండాలి. ఒక్క అభిమానం ఉంటే సరిపోదు. వారితో తరచూ సమావేశమవ్వాలి. నాయకులకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఈ విషయంలో ఫెయిల్ అయినట్లే కన్పిస్తుంది. వరసగా ముఖ్యనేతలను పార్టీని వీడిపోతుండటం ఆయన నాయకత్వానికే పరీక్షగా మారనుంది. అసలు లోపం ఎక్కడుందన్నది పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంతా తానే అయి…..

పవన్ కల్యాణ్ పెక్యులర్ పర్సనాలిటీ. తాను చదివిన పుస్తకాలు, ఉన్నంతలో తనకున్న రాజకీయ పరిజ్ఞానికే పవన్ కల్యాణ్ పరిమితమవుతారు. భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఏ నిర్ణయమైనా ఆయన స్వయంగా తీసుకుంటారు. పార్టీలో కీలక నేతలెవ్వరూ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదు. పార్టీకి అంతా తానే అయి వ్యవహరిస్తారు. నిజమే కావచ్చు. పవన్ కల్యాణ్ ఇమేజ్ తోనే పార్టీ ఉందన్నది వాస్తవమే అయినా అదే సమయంలో నాయకులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది.

ఏడేళ్లవుతున్నా….

జనసేన పార్టీ పెట్టి ఏడేళ్లు కావస్తుంది. పార్టీ పెట్టిన నాడు ఉన్న వారు ఇప్పుడు లేరు. నాదెండ్ల, కందుల దుర్గేష్ మినహా జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వదిలి వెళ్లిపోయారు. అయితే ఆయన చెప్పిన కారణం సబబుగా లేకపోయినా పవన్ కల్యాణ‌్ వైఖరి నచ్చకనే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వీడారు. జేడీ ఉంటే పార్టీకి కొంత ఇమేజ్, మైలేజీ ఉండేది.

బలం ఉందా? లేదా?

ఇటీవల పార్టీలో కీలక నేత మాదాసు గంగాధరం సయితం పార్టీని వీడివెళ్లిపోయారు. ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నేతే. వెళ్లిపోయిన నేత కు బలం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే పవన్ కల్యాణ్ ను నేతలు ఎందుకు వీడిపోతున్నారన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. పవన్ కల్యాణ్ ఎవరితో మాట్లాడరు. ఏ నిర్ణయం తీసుకున్నా నాదెండ్ల మనోహర్ తో తప్ప మరెవ్వరితోనూ చర్చించరు. బీజేపీతో దోస్తీ విషయంలోనూ అంతే. ఇలా తన వద్ద ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఉన్న నేతలూ మిగలరన్నది వాస్తవం.

Tags:    

Similar News