దారి దొరికిందా…?

జనసేనాని పవన్ కల్యాణ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యపై ఆందోళనకు పిలుపునిచ్చారు. లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. ప్రజల్లో కనిపించిన ఐక్యత [more]

Update: 2019-11-04 15:30 GMT

జనసేనాని పవన్ కల్యాణ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యపై ఆందోళనకు పిలుపునిచ్చారు. లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. ప్రజల్లో కనిపించిన ఐక్యత ప్రతిపక్షాల్లో మాత్రం కానరాలేదు. విపక్షాలన్నీ కలిసికట్టుగా తమ సంఘీభావాన్ని చాటుకోవడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా వామపక్షాలు, బీజేపీకి నైతిక మద్దతే తప్ప పాలు పంచుకోక పోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణల్లో మార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అధికార విపక్ష రాజకీయాలను పరిశీలిస్తే చాలా వేగంగానే పోటాపోటీ వాతావరణం నెలకొంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రజల్లో ఎప్పటికప్పుడు నెలకొనే అసంతృప్తిని అదుపు చేయడానికి ప్రభుత్వాలు కొంత కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటాయి. రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్య దశలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ లక్షణాలు మాత్రం మారలేదు. అయితే ప్రజాస్వామ్యంలో లభించిన ఏకైక వరం నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల రూపంలో తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జనసమీకరణ చేపట్టవచ్చు. దీనిపై కూడా ఎంతో కొంతమేరకు ప్రభుత్వాలు నియంత్రణ విధిస్తూ ఉంటాయి. వీలుంటే ఉక్కుపాదం మోపడానికి సైతం వెనకాడవు. ఈ స్థితిలోనే ప్రతిపక్షాలన్నీ ప్రజాబాహుళ్యానికి సంబంధించిన సమస్యల విషయంలో ఏకతాటిపైకి వస్తుంటాయి. దీనివల్ల సర్కారుకు హెచ్చరిక పంపడంతో పాటు సమస్య తీవ్రతను బలంగా ముందుకు తీసుకురావడానికి వీలవుతుంది. ఇక్కడ సిద్ధాంతరాద్ధాంతాలకు ఆస్కారం ఉండదు. ప్రజాసమస్యను ప్రతిబింబించడమే ఏకైక అజెండాగా ఉంటుంది.

రెడ్ సిగ్నల్….

ఆయా పార్టీలు అంగీకరించకపోయినా వామపక్షాల బలం నానాటికీ క్షీణిస్తోంది. దేశరాజకీయ పటంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. గడచిన ఎన్నికల్లో జనసేనతో కలిసి వామపక్షాలు పోటీ చేశాయి. ఓట్లు, సీట్ల పరంగా పరంగా లభించిన విజయం ఏపాటిదనే సంగతి పక్కనపెడితే కమ్యూనిస్టు క్యాడర్ లో ఈ పొత్తు జోష్ నింపింది. ఆ పార్టీల సానుభూతిపరులకు హుషారు తెచ్చింది. యువతలో పట్టున్న పవన్ తో కలిసి నడవడం ద్వారా కామ్రేడ్లు తమ సిద్ధాంతాలను లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్తరక్తాన్ని ఎక్కించుకునేందుకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. అయితే ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పవన్ ఇచ్చిన పిలుపును ఒక అవకాశంగా మలచుకోవడంలో సీపీఐ, సీపీఎంలు రెండూ విఫలమయ్యాయి. ఈ ఆందోళనకు అందరూ కలిసిరావాలనే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ సహా అందరినీ ఆహ్వానించింది జనసేన. అయితే కమలం పేరు చెబితే కత్తులు దూసే కామ్రేడ్లు దూరంగా ఉండిపోయారు. నిజానికి కార్మికులు , కర్షకుల పేరు చెబితే వామపక్షాలు గుర్తుకొస్తాయి. లక్షలమంది ప్రజల జీవనంతో ముడిపడిన ప్రధాన సమస్యపై తమ మిత్రపక్షం చేపట్టిన ఆందోళనలో ప్రత్యక్ష భాగస్వామ్యం వహించకుండా తమంతతాముగానే జనసేనకు దూరమయ్యాయి వామపక్షాలు.

కమలం కబురు…

పవన్ కల్యాణ్ తో బీజేపీ అధిష్ఠానం తొలి నుంచి సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తూ వస్తోంది. 2014కు ముందు పవన్ ను తమతో చేతులు కలపమని కమలం పార్టీ నేతలు ఆహ్వానించారు. తన సొంత అజెండాతో ప్రత్యేక ముద్రతో వెళ్లాలనే ఉద్దేశంతో జనసేనాని తిరస్కరించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి సైతం పవన్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. మోడీ, అమిత్ షా లు పవన్ లో పొటెన్షియల్ లీడర్ ఉన్నారని, అది తమ పార్టీకి ఉపయోగపడుతుందని భావించారు. ఎన్నికల తర్వాత సైతం జనసేనను విలీనం చేయాలని సంప్రతింపులు జరిపారు. తన పార్టీపై అతిశయించిన అంచనాలతో పవన్ కల్యాణ్ ప్రతిసారి తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని మొదటిసారిగా లేవనెత్తి బీజేపీ అధిష్ఠానానికి కొంత దూరంగా వైదొలిగారు . 2019 ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఆయా పార్టీల బలాబలాలు నిగ్గు తేలిపోయాయి. అధికారపార్టీ ని నిలువరించాలంటే విపక్షాలన్నీ ఒకేతాటిపైకి రావాల్సిన అవసరం మరింతగా పెరిగింది. అయినప్పటికీ వామపక్షాలు తమకు ఎంతోకొంత మద్దతు ఉండే కార్మిక సమస్య విషయంలో నే భిన్నంగా ప్రవర్తించడం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి వామపక్షాల కంటే బీజేపీతో చేతులు కలిపితేనే రాజకీయంగా జనసేనకు అడ్వాంటేజ్ ఉంటుందనే విశ్లేషణలు కూడా లేకపోలేదు. తమంత తాము దూరంగా జరగడం ద్వారా పవన్ కల్యాణ్ కేంద్రంలోని బీజేపీకి సన్నిహితం కావడానికి వామపక్షాలే మార్గం సుగమం చేశాయని చెప్పుకోవాలి.

అనివార్యత…

తెలుగు రాష్ట్రాల్లో అధికారేతర పార్టీలు రాజకీయ నిస్సహాయతను చవి చూస్తున్నాయి. పాలక పార్టీలు ప్రతిపక్షాలను పెద్దగా లెక్క చేయడం లేదు. విమర్శలను పట్టించుకోవడం లేదు. ఆరోపణలను బేఖాతరు చేస్తున్నాయి. ఉద్యమాలు, ఆందోళనలు సర్కారును కదిలించలేకపోతున్నాయి. ఈ స్థితిలో అధికారాన్ని వేరొక అధికారంతోనే ఎదుర్కోవాలనే భావన రాజకీయనేతల్లో నెలకొంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వలసలు భారీగా పెరగడంలోని ఆంతర్యమిదే. రాష్ట్రప్రభుత్వాలతో పోరాడాలంటే రాజకీయంగా బీజేపీని ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. లాంగ్ మార్చ్ సభలో పవన్ కల్యాణ్ సైతం తన ప్రసంగంలో ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చేశారు. ‘కేంద్రంలో తానంటే ఇష్టపడేవారున్నారు. వారిని కలుస్తాను. రాష్ట్రసమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళతానని పవన్ స్పష్టంగానే చెప్పేశారు. దీనివల్ల క్రమేపీ కేంద్రంతో, బీజేపీ అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకునేందుకు అవకాశాలేర్పడతాయి. అదే జరిగితే రాష్ట్ర రాజకీయ సమీకరణలోనే అనూహ్యమార్పులు ఏర్పడతాయి. కొత్త పొత్తులకు , సరికొత్త వేదికలకు ఆస్కారమేర్పడుతుంది. జనసేనతోపాటు బీజేపీకి సైతం ఈపరిణామం రాజకీయంగా కలిసివచ్చేదే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News