పవన్ బలవంతుడే…. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్

పంచాయతీ ఎన్నికలు ఎవరికి ఎంత నష్టం.. ఎవరికి ఎంత ప్రయోజనం కల్గించాయన్నది చెప్పడం కష్టమే. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం పంచాయతీ ఎన్నికలు [more]

Update: 2021-03-01 05:00 GMT

పంచాయతీ ఎన్నికలు ఎవరికి ఎంత నష్టం.. ఎవరికి ఎంత ప్రయోజనం కల్గించాయన్నది చెప్పడం కష్టమే. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం పంచాయతీ ఎన్నికలు కలసి వచ్చాయనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతు దారులు పెద్దగా విజయం సాధించకపోయినా ఊహించని విధంగా అనేక చోట్ల రెండు, మూడు స్థానాల్లో నిలవడం జనసేనకు సంతృప్తి కల్గించే అంశమని చెప్పక తప్పదు. ఇది పవన్ కల్యాణ్ కూడా ఊహించనిదే.

తాను పట్టించుకోకపోయినా…..

నిజానికి పవన్ కల్యాణ్ పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదు. పూర్తిగా స్థానిక నాయకత్వానికే వదిలిపెట్టారు. స్థానిక నాయకత్వం కూడా అనేక నియోజకవర్గాల్లో లేదు. అయినా సరే జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉండేందుకు ప్రయత్నించింది. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. పార్టీ గుర్తు లేకపోయినా ఈ ఎన్నికల్లో రెండు పార్టీల్లో ఎవరి సత్తా ఏంటో బయటపడింది.

బీజేపీ కంటే…..?

జనసేన కు పంచాయతీ ఎన్నికల్లో 22 శాతం ఓట్లు వచ్చాయి. అనేక చోట్ల వార్డు మెంబర్లుగా, సర్పంచ్ లుగా విజయం సాధించారు. బీజేపీ కంటే పై చేయి పంచాయతీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ దే అయింది. అంటే బీజేపీ కంటే రాష్ట్రంలో తానే బలవంతుడినని చెప్పుకోవడానికి పవన్ కల్యాణ్ కు పంచాయతీ ఎన్నికలు ఉపయోగపడ్డాయని చెప్పక తప్పదు. ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత పవన్ కల్యాణ్ ను బీజేపీ దూరం చేసుకునే ప్రయత్నం చేయదు.

పవన్ అవసరాన్ని…..

ఇక మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అవసరం ఉందని ఇప్పుడు అన్ని పార్టీలూ గుర్తించాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ‌ తో దోస్తీకి ఇక అన్ని ప్రయత్నాలు మొదలు పెడతారు. వైసీపీ కూడా పవన్ కల్యాణ్ పట్ల కొంత అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా పవన్ కల్యాణ‌్ కు పంచాయతీ ఎన్నికలు అన్ని విధాలుగా కలసి వచ్చాయంటున్నారు. ఇక పవన్ కల్యాణ‌్ జనంలోకి వచ్చి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News