పవన్ లైన్ మారుతోంది…?

ఏపీలో ఇపుడు అన్ని పార్టీలకు హిందూత్వ గాలి సోకింది. బీజేపీ కంటే దూకుడుగా మిగిలిన పార్టీలు హిందూ జపం చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు [more]

Update: 2021-02-01 13:30 GMT

ఏపీలో ఇపుడు అన్ని పార్టీలకు హిందూత్వ గాలి సోకింది. బీజేపీ కంటే దూకుడుగా మిగిలిన పార్టీలు హిందూ జపం చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక అడుగు ముందు ఉన్నారు. ఆయన బీజేపీ కంటే వీర భక్తిని చూపిస్తున్నారు. మరో వైపు చూసుకుంటే అధికార వైసీపీ కూడా హిందూ ఆలయాల పునరుద్ధరణ పేరిట కార్యక్రమాలు వేగంగా చేపడుతోంది. అలాగే గోపూజల పేరిట జగన్ స్వయంగా హాజరై ఆధ్యాత్మిక పరిమళాలు అద్దుతున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ మిత్రుడిగా పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుడాలి. కానీ పవన్ ఒక్కసారిగా లైన్ మార్చారు.

మానవత్వమే మతం ….

తాజాగా ఆయన మతం గురించి మాట్లాడిన మాటలు, ఇచ్చిన నిర్వచనం చూస్తే పవన్ కల్యాణ్ పొలిటికల్ లైన్ ఏంటో అర్ధమవుతుంది. బైబిల్ కావాలా. భగవద్గీత కావాలా అని బండి సంజయ్ తిరుపతి ఓటర్లకు ఇచ్చిన పిలుపు విషయంలో పవన్ మీడియా ఎదుట బాగానే రియాక్ట్ అయ్యారు. మతం అన్నది ఎవరి మటుకు వారికి ఉంటుంది. అది వారి సొంత వ్యవహారం. అన్ని మతాలు కలిసి ఉండాలన్నదే సర్వ ధర్మ భావన అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తన ఇంట్లో చిన్నప్పటి నుంచి అన్ని మత గ్రంధాలు ఉండేవని కూడా ఆయన అంటున్నారు. మతాలు ఎవైనా మానవత్వం గొప్పది అని కూడా పవన్ అంటున్నారు.

ఆ సైడ్ తీసుకుంటారా?

టీడీపీ హిందూత్వ రాగాలాపనలో మైనారిటీ ఓట్లను కోల్పోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. క్రిస్టియన్లు అయితే టీడీపీ మీద గుర్రుగా ఉన్నారు. ముస్లిం మైనారిటీలు కూడా ఎప్పటి నుంచో అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ టైమ్ లో పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఏపీ రాజకీయాలను గమనిస్తున్నారు అన్నదే ఇక్కడ పాయింట్. ఆయన తనకు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులుగా ఉన్నారని చెబుతున్నారు. అన్ని వర్గాలు కలిస్తేనే సమాజం అని కూడా చెబుతున్నారు మొత్తానికి చూస్తే పవన్ కల్యాణ్ మాటలను బట్టి మైనారిటీల వైపు ఆయన సైడ్ తీసుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు.

బీజేపీతో ఉంటూనే…?

బీజేపీతో దోస్తీ కడుతూనే మరీ కరడు కట్టిన హిందూత్వ పాత్రని పండించడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా లేరని ఆయన తాజా వైఖరి బట్టి అర్ధమవుతోంది. బీజేపీ ఎటూ హిందూత్వ ఓట్లకు గురి పెడుతుంది. తనకంటూ సొంత పార్టీ ఉంది కాబట్టి తాను లౌకిక వాదిగా ఉంటే ఆ వైపు ఓట్లు కూడా తనకు కలసివస్తాయని పవన్ కల్యాణ్ మంచి ఆలోచనే చేస్తున్నారు. ఓ వైపు ఏపీలో టీడీపీ తప్పటడుగులు వేస్తోంది. బీజేపీ లైన్ లో వెళ్తోంది. ఇంకో వైపు జగన్ పార్టీకే పూర్తిగా మైనారిటీలని వదిలేయకుండా ఆ వైపు పవన్ కల్యాణ్ కాపు కాయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ రకమైన వ్యూహంతో ఇవాళ కాకపోయినా రేపు అయినా బీజేపీతో బెడిసినా, టీడీపీ తగ్గినా తనకంటూ ఒక ప్లేస్ ఏపీ పాలిటిక్స్ లో ఉంటుందని పవన్ కల్యాణ్ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Tags:    

Similar News