తన భుజం తానే తట్టుకుంటున్నారే?

పవర్ స్టార్ గా ఒంటి చేత్తే విలన్లను చితకబాదే పవన్ కళ్యాణ్ రాజకీయ తెరపైన మాత్రం నీరసపడిపోతున్నారు. ఇక్కడ రియాలిటీ ముఖ్యం. సినీ డైలాగులు అసలు పనిచేయవు. [more]

Update: 2021-01-11 08:00 GMT

పవర్ స్టార్ గా ఒంటి చేత్తే విలన్లను చితకబాదే పవన్ కళ్యాణ్ రాజకీయ తెరపైన మాత్రం నీరసపడిపోతున్నారు. ఇక్కడ రియాలిటీ ముఖ్యం. సినీ డైలాగులు అసలు పనిచేయవు. పవన్ కళ్యాణ్ పాతికేళ్ల రాజకీయం చేస్తానంటూ 2014లో పార్టీ పెట్టారు. ఇప్పటికి ఏడేళ్ళు పూర్తి అయ్యాయి. మిగిలింది అచ్చంగా 18 ఏళ్ళ సమయం మాత్రమే. చూస్తూంటే వచ్చే ఎన్నికల్లో కూడా అద్భుతాలు జరిగిపోయి జనసేనకు పీఠం దక్కుతుందన్న ఆశలు ఎవరికీ లేవు. దాంతో పవన్ కళ్యాణ్ తాను చేరాల్సిన గమ్యం చాలా దూరంలో ఉందని ఇపుడిపుడే తెలుసుకుంటున్నారు.

సమాధానపడుతున్నారా…?

పవన్ కళ్యాణ్ లో సున్నిత మనస్కుడు ఉన్నాడు. నిజానికి రాజకీయాల్లో రాటు దేలిన వారు సైతం ప్రత్యర్ధుల విమర్శలకు బాధపడిన సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి సినీ హీరోల చుట్టూ ఎపుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆయనకు జయహో నినాదాలే వినిపిస్తూ ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఒక మాట అంటే బాణాల్లా వంద మాటలు తన మీదకే వస్తాయి. ఇపుడు పవన్ కళ్యాణ్ అదే తలచుకుని వగచి వాపోతున్నారు ప్రత్యర్ధుల విమర్శలకు కూడా తన సభల ద్వారానే సమాధానం ఇస్తూ తానూ సమాధానపడుతున్నారు.

వారే తన‌ ఓటర్లుగా….

తన సభలకు ఓటర్లు ఎవరూ రారని, చిన్న పిల్లలే వస్తారని ప్రత్యర్ధులు తరచూ చేసే విమర్శలకు పవన్ కళ్యాణ్ తాజాగా సమాధానం ఇచ్చారు. అవును వారే రేపటి పౌరులు, వారే ఓటర్లు కూడా. తమ బంగారు భవిష్యత్తు కోసం వారు నా మీటింగులకు వస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు అని సమర్ధించుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఆశలన్నీ రేపటి తరం మీదనే ఉన్నాయనుకోవాలి. అలా ఆశావహ దృక్పధంతో ముందుకు సాగిపోవాలనుకుంటున్నారు అని భావించాలి. ఇక తన సభలకు వచ్చిన వారు ఏనాటికైనా తనకే ఓటు వేస్తారని పవన్ కళ్యాణ్ తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నారు.

ఇపుడు అవసరమా….?

అవును ఇదే మాట అంతా అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. తనకు రాజకీయాలు అవసరమా అని. ఆయన ఇప్పటికి పదే పదే అదే అంటున్నారు. అవసరమా కాదా అన్నది పక్కన పెడితే జనాలకు పవన్ అవసరం ఎంత ఉందో తెలుసుకోవాలి. తన లాంటి నాయకుడి అవసరం ఉందని జనాలు అనుకునేట్లు చేయాలి. నాకు రాజకీయాలు ఈ టైం లో అవసరమా డబ్బు కోసమా అధికారం కోసమా నేను రాజకీయాలు చేస్తోంది అని పవన్ కళ్యాణ్ జనాలను నిలదీసి అడగడం వల్ల ఉపయోగం ఉండదు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ వారే తమకు కావాలని జనాలు అనుకోవాలి. ఈ రెండింటికీ మధ్య చాలా దూరమైన భారమైన ప్రయాణం ఉంది. నేను మీ కోసం అన్నీ వదులుకుని వచ్చాను అని పవన్ కళ్యాణ్ అనడం కాదు, ప్రజలు అలా భావించిన నాడే పవన్ రాజకీయానికి సార్ధకత లభించినట్లు. మొత్తానికి రాజకీయంగా ఇంకా తడబాట్లూ పొరపాట్లూ చేస్తూ తన భుజం తానే తట్టుకుంటూ జనసేనాని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News