అక్కడ జనసేన విత్తనాలు మొలకెత్తవా ?

రాజకీయాల్లో పట్టుదల ఉండాలు, పంతాలు ఉండాలి. పగలూ ఉండాలి. కసి కూడా ఉండాలి. ఇవన్నీ కూడా తమను తాము సరిచేసుకుని పాజిటివ్ గా తీర్చిదిద్దుకుని ముందుకు సాగిపోయేందుకు [more]

Update: 2021-01-15 12:30 GMT

రాజకీయాల్లో పట్టుదల ఉండాలు, పంతాలు ఉండాలి. పగలూ ఉండాలి. కసి కూడా ఉండాలి. ఇవన్నీ కూడా తమను తాము సరిచేసుకుని పాజిటివ్ గా తీర్చిదిద్దుకుని ముందుకు సాగిపోయేందుకు ఉపయోగపడాలి. ఇక రాజకీయాల్లో నాయకుడికి జనాలకు మధ్య గట్టి బాండేజ్ ఉండాలి. వద్దు అంటున్నా వెంటపడే అరవీర ప్రేమికుడి సైకాలజీ కూడా ఇక్కడ చాలా అవసరం. ఒకసారి ఎన్నికల్లో ఓడించారు అనో మరో కారణంగానో జనాలను వదిలేస్తే వారు కూడా టేకిట్ ఈజీగానే రెస్పాండ్ అవుతారు.

నాటి మోజు ఏమైందో …?

విశాఖ నా ప్రాణం, సర్వస్వమని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ముందు చాలా పెద్ద మాటలే చెప్పారు. అప్పట్లో విశాఖలో తరచూ పర్యటించారు. చివరికి గాజువాకలో పోటీ చేశారు. అక్కడ ఓడాక పవన్ కల్యాణ్ విశాఖ ఊసు తలవడంలేదు. అంటే పవన్ మదిలో విశాఖ కానీ గాజువాకా కానీ ఉన్నట్లా లేనట్లా అన్న డౌట్లు సొంత పార్టీ జనసేనలోనే వస్తున్నాయి. ఇక పవన్ విశాఖలో పార్టీ కార్యక్రమాలను సైతం గాలికి వదిలేశారు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.

పార్టీ ఆఫీస్ కూడా….

విశాఖలో జనసేనకు ఒక పార్టీ ఆఫీస్ కూడా లేకపోవడం విచిత్రమే. అద్దెకు తీసుకుని అయినా ఒక ఆఫీస్ పెట్టే స్తోమత నేతలకు లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అదేశిస్తే నేతలు కచ్చితంగా పార్టీ ఆఫీసు పెట్టి కార్యకలాపాలు నిర్వహించగలరు. కానీ పవన్ ఉదాశీనత మూలంగానే నేతలలో చలనం లేకుండా పోయిందని అంటున్నారు. మరో వైపు చూసుకుంటే విశాఖలోని కొందరు నాయకులకు పవన్ కల్యాణ్ పార్టీలో కీలకమైన పదవులు ఇచ్చారు. వారు ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం తగిన వేదికను ఎప్పటికప్పుడు వెతుక్కోవాల్సి రావడమే జనసేన వర్తమానాన్ని సూచిస్తోంది.

స్కోప్ ఉన్నా కూడా…?

ఉత్తరాంధ్రా జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉంటారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తూర్పు కాపులుగా బీసీలుగా ఉన్న వారు విశాఖ వచ్చేసరికి మాత్రం ఓసీలు అవుతారు. మొత్తానికి అంతా కాపులే. మరి పవన్ కల్యాణ్ వారిని తన వైపు నికరంగా తిప్పుకునే కార్యక్రమాలు గట్టిగా చేపడితే కొంత వరకైనా పార్టీకి బలం, బలగం సమకూరుతుంది. కానీ పవన్ కల్యాణ్ ఎందుకో తనను ఓడించిన విశాఖ మీద తానూ అలాగే ఉంటాను అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్రా జనసేన రాజకీయ పొలం ఎండిపోతోంది. మరి కొత్త విత్తనాలు వేసేదెవరు. సరికొత్త నెత్తురుని పార్టీకి అందించేది ఎవరు అన్నదే ఇక్కడ చర్చ.

Tags:    

Similar News