పవన్ పెద్ద ప్లాన్ లో ఉన్నారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన కోరుకున్న పాత్ర అందని పండుగా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో [more]

Update: 2020-12-29 12:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన కోరుకున్న పాత్ర అందని పండుగా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనకేమీ వద్దు అని అంటారు కానీ ఆయన కన్ను ముఖ్యమంత్రి పదవి మీదనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది తప్పు కూడా కాదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టేవారు ఎవరైనా కూడా సీఎం పదవి కోసమే చూస్తారు. దాన్నే టార్గెట్ గా చేసుకుంటారు.

అందుకే చకచకా…..

పవన్ కళ్యాణ్ 2018లో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. ఆ తరువాత ఆయన నటనకు గుడ్ బై అంటూ రాజకీయాల్లోకి మళ్ళారు. అయితే ఆయన అనుకున్నట్లుగా ఏపీ రాజకీయాల్లో కింగూ కాక, కింగ్ మేకరూ కాక కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇపుడు వరసగా అయిదారు సినిమాలను ఒప్పేసుకున్నారు. పవన్ కి ఉన్న చరిష్మాతో చాలా మంది నిర్మాతలు క్యూ కట్టడమే కాదు, ఆయన కోరినంత పారితోషికం కూడా ఇవ్వడం విశేషం. దాంతో పవన్ ఆర్ధికంగా పటిష్టం కావడం కోసం సినిమాలను చకచకా కానిచ్చేస్తున్నారు.

అదీ కధ అన్న మాట….

ఏపీలో వైసీపీకి ధీటుగా ఎదిగేందుకు బీజేపీ, జనసేన కూటమి చూస్తోంది. ఇక ఈ కూటమిలో పెద్దన్నగా బీజేపీ ఉంటోంది. ఆ పార్టీకి ఏపీలో సీన్ ఏదీ లేకపోయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉండడం మోడీ ఇమేజ్ ని అడ్డుపెట్టుకుని నాదే పై చేయి అనేస్తోంది. ఈ నేపధ్యంలో అన్నింటా వెనకబడుతున్న పవన్ కళ్యాణ్ అటు మిత్ర పార్టీ బీజేపీకి, ఇటు బద్ధ శత్రువు జగన్ కి ఒకేసారి ఝలక్ ఇవ్వడం కోసం ఏకంగా జనంలోకే రాబోతున్నాడట. ఇప్పటిదాకా సభలూ సమావేశాలూ నిర్వహించే జనసేనాని ఇక మీదట జనం తో కలిపి అడుగులో అడుగు వేస్తాడట. అలా వారితో మమేకం కావడం ద్వారా తాను రాష్ట్రాధినేతను అని చెప్పుకునేందుకు జనమంతా ఒప్పుకునేందుకు వీలు ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడుట.

పాదయాత్ర మంత్రం….

ఏపీలో ముగ్గురిని సీఎం చేసింది పాదయాత్ర మంత్రం. ఎన్నికలకు ఏడాదో రెండేళ్ళో సమయం ఉన్న వేళ కాళ్ళకు బాగా పని చెప్పి ఆ వైపు నుంచి ఈ వైపునకు నడిస్తే దెబ్బకు సీఎం కుర్చీ వచ్చి వెనకాల వాలుతుంది. ఇది మూడు సార్లు ఏపీలో నిజమైంది, రుజువు కూడా అయింది. దాంతో పవన్ కళ్యాణ్ 2022లో సినిమాలు ఇలా కంప్లీట్ చేసి రెట్టించిన సినీ చరిష్మాను అడ్డం పెట్టుకుని జనంలోకి వస్తాడన్న మాట. ఆయన పాదయాత్ర చేపట్టి మొత్తానికి మొత్తం పదమూడు జిల్లాలూ కలియతిరిగేస్తాడూ అంటూ ఒక ప్రచారం అయితే జనసేన వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపడితే బీజేపీ కంటే ఇమేజ్ సంపాదిస్తే ఏపీలో జనసేన బలం పెరుగుతుంది. వీలుంటే సీఎం సీటు కూడా దక్కుతుందని భలే ప్లాన్ వేశాడని అంటున్నారు. మరి ఆ ముచ్చట చూడాలంటే మరో రెండేళ్ల పాటు వేచి ఉండాల్సిందే.

Tags:    

Similar News