పవన్ మళ్ళీ రాంగ్ స్టెప్ వేశారా…?

పవన్ కళ్యాణ్ మళ్లీ రాంగ్ స్టెప్ వేశారు. సినిమాల్లో పాటలకు కరెక్ట్ గా స్టెప్పులు వేసి ఫ్యాన్ చేత ఈలలు చప్పట్లతో గ్రేట్ అనిపించుకునే పవన్ కల్యాణ్ [more]

Update: 2020-11-19 13:30 GMT

పవన్ కళ్యాణ్ మళ్లీ రాంగ్ స్టెప్ వేశారు. సినిమాల్లో పాటలకు కరెక్ట్ గా స్టెప్పులు వేసి ఫ్యాన్ చేత ఈలలు చప్పట్లతో గ్రేట్ అనిపించుకునే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఎటూ కాకుండా పోతున్నారు. ఇదే ఇపుడు ఫ్యాన్స్ ఆవేదన. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇపుడు వచ్చింది. అది బీజేపీకి అనుకూలంగా మారింది. అక్కడ చేసిన బిగ్ సౌండ్ కి తెలంగాణా అంతా దద్దరిల్లుతోంది. దీంతో కమలం పూనకాలు అలా ఇలా లేవు. మరి ఆ పార్టీ మిత్రుడిగా పవన్ కల్యాణ్ కూడా సంబరాలు చేసుకోవాలిగా. కానీ ఒక్క ప్రకటనతో సరిపెట్టేసారు. బీజేపీ గెలిచినందుకు అభినందనలు చెప్పి ఊరుకున్నారు.

అంతేనా పవన్…?

నిజానికి టీయారెస్ కంచుకోట లాంటి సీటును కమలం పార్టీ బద్దలు కొడితే పవన్ కల్యాణ్ ముక్తసరి ప్రకటనతో మమ అనిపించేయడం పట్ల ఆయన పార్టీ వారే ఎత్తిపొడుస్తున్నారు. నిజానికి పవన్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉందా అన్న చర్చ కూడా ముందు పెడుతున్నారు. ఆరేళ్ళుగా అజేయంగా ఉన్న టీయారెస్ ని బద్దలు కొట్టిన బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణాలో అతి కీలకంగా మారుతుంది అంటున్నారు. మరి అలాంటి పార్టీకి మిత్రుడిగా పవన్ ఎంతలా చేయూత ఇవ్వాలి. మరెంతలా పొగడాలి. కానీ పవన్ కి మళ్ళీ ఇక్కడ కూడా ఎవో మొహమాటాలు అడ్డు వచ్చాయా అన్న మాట ఉంది. దాంతో ఆయన ముక్తసరిగా కంగ్రాట్స్ అనేశారు.

క్రెడిట్ రాలేదే …?

దుబ్బాకకు ఉప ఎన్నికలు ప్రకటించాక బీజేపీలోని అతి రధ మహారధులు అంతా వెళ్ళి వచ్చారు. ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ ను కూడా బీజేపీ వారు ప్రచారానికి రావాలని పిలిచారు. కానీ పవన్ మాత్రం ఎందుకో వెళ్లలేదు. దానికి కేసీయార్ పట్ల ఉన్న అభిమానం కారణం అని కూడా అంటారు. కేసీయార్ ప్రగతి శీల ముఖ్యమంత్రి అని ఈ మధ్యనే పవన్ కల్యాణ్ సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తెగ పొగిడారు. మరి అలాంటి సీఎం ని ఏమీ కారు అని దుబ్బాకలో చెప్పలేరుగా. అందుకే వెళ్ళలేదు అంటారు. పైగా మెగా ఫ్యామిలీతో కేసీయార్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్స్ ని చూసుకుని పవన్ కల్యాణ్ పాలిటిక్స్ తో ముడిపెట్టేశారు అంటారు. అదే ఇపుడు రాంగ్ స్టెప్ అని కూడా వినిపిస్తోంది.

గ్రేటర్ కైనా రెడీనా …?

ఇక బీజేపీ ఇపుడు అసలు ఊరుకోదు, కేసీయార్ మీద ఒంటి కాలి మీద లేస్తుంది. ఎటూ హైదరాబాద్ లో బీజేపీకి మంచి పట్టుంది, అది టీయారెస్ పుట్టక ముందు నుంచి ఉన్న బేస్. ఇక తాజాగా ఒక సర్వే చేస్తే కనీసంగా 50 కి తక్కువ కాకుండా డివిజన్లు బీజేపీ గెలుచుకుంటుందని రిపోర్ట్ వచ్చిందట. అందువల్ల తాడో పేడో తేల్చుకోవడానికి బీజేపీ రెడీ. మళ్లీ ప్రచారానికి పవన్ కల్యాణ్ ని పిలుస్తారు. ఈసారి కూడా ఆయన రెడీ అవుతారా. లేక టీయారెస్ తో మనకెందుకు అని ఊరుకుంటారా. అదే కనుక చేస్తే పవన్ రాజకీయం కూడా దెబ్బ తింటుంది అంటున్నారు. ఇక పవన్ కనుక దుబ్బాక సీన్ లోకి వచ్చి ఉంటే ఏకంగా బీజేపీకి మరింత ఊపు వచ్చేదని, పవన్ కూడా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి వీలు అయ్యేదని అంతా అంటున్నారు. ఎవరేమన్నా కూడా పవన్ కల్యాణ్ మాత్రం రాంగ్ స్టెప్పులే వేస్తున్నారు అన్నది తాజాగా వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News