పాపం పవన్.. ఎర్రన్నలకు దొరికేశారు…!

పవన్ కళ్యాణ్. ముందు నటుడు, ఆ తరువాత రాజకీయ నాయకుడు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నా అవగాహన తక్కువ. ఇపుడిపుడే ఏమైనా నేర్చుకుంటున్నాడు అనుకోవాలి. ఇక [more]

Update: 2020-10-07 13:30 GMT

పవన్ కళ్యాణ్. ముందు నటుడు, ఆ తరువాత రాజకీయ నాయకుడు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నా అవగాహన తక్కువ. ఇపుడిపుడే ఏమైనా నేర్చుకుంటున్నాడు అనుకోవాలి. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనది ఆరేళ్ల చరిత్ర. నిజానికి ఇది చాలా తక్కువ సమయం అనే చెప్పాలి. కానీ ఈ సమయంలోనే పవన్ ఏం చేశారో తెలిస్తే ఆయన రాజకీయం మీద ఒక అభిప్రాయం కలుగుతుంది. పవన్ ఏకంగా ఆరు పార్టీలతో దోస్తీలు మార్చేశారు. అంటే సగటున ఏడాదికి ఒక పార్టీ అన్న మాట. ఆ పార్టీల వివరాలు చూస్తే మొదట బీజేపీ, తరువాత టీడీపీ, ఆ తరువాత సీపీఐ, సీపీఎం, ఇక మధ్యలో బహుజన్ సమాజ్ వాది పార్టీ ఒకటి ఉంది. ఇవన్నీ కాదనుకుని మళ్ళీ బీజేపీతో పొత్తులకే దిగారు పవన్ కళ్యాణ్. ఇదీ లెక్కన్నమాట.

ఆయన ఒక్కరేనా …?

పొత్తుల విషయంలో దేశ రాజకీయాలలో ఎవరు ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ముందే చెప్పుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనుభవం లేని వారు కాబట్టి ఆయన సులువుగా విమర్శలకు దొరికేస్తున్నారు. ఈ దేశంలో ఒక్క బీజేపీ, వామపక్షాలు తప్ప అడ్దమైన తీరులో ఎవరు ఎవరితో పొత్తులు ఎన్ని సార్లు పెట్టుకోలేదో చెబితే అపుడు చివరాఖరున పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయవచ్చు. అయితే ముందే చెప్పుకున్నట్లుగా పవన్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన మీద జనాలకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఆయన పోగొట్టుకున్నారన్నదే అందరి బాధ.

గుర్రుమీదున్నారే ….

ఇదిలా ఉంటే పవన్ బీజేపీ, టీడీపీల కూటమి నుంచి విడిపోయాక వామపక్షాలతో జట్టు కట్టారు. ఆలా మూడు పార్టీలు జగన్ మీద 2019 ఎన్నికల ముందు దాకా పోరాటం చేశాయి. పొత్తుకు దిగి పోటీ కూడా చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో పవన్ రెండు సీట్లలో ఓడిపోయాక వెంటనే ఎర్రన్నలతో పొత్తులు పెటాకులు అనేశారు. ఆ మాట ఆయన బయటకు చెప్పలేదు. కనీసం మిత్రధర్మంగా వారికి సూచనాప్రాయంగా చెప్పినట్లు లేదు. ఈ కూటమితో అడుగు ఇక ముందుకు పడదు అని ఒక ఫైన్ మార్నింగ్ ఆయన అనుకున్నట్లుగా ఉన్నారు. అంతే తలాఖ్ అనేశారు. అదే ఇపుడు ఎర్రన్నలకు మంటగా ఉన్నట్లుంది. దాంతో పవన్ కళ్యాణ్ మీద గుర్రుమంటున్నారు.

ఇన్నాళ్ళకా ….?

పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని దాదాపుగా తొమ్మిది నెలలు దాటుతోంది. ఆయన పొత్తు కంటే ముందు కూడా మోడీని, అమిత్ షాను కూడా తెగ పొగడుతూ తన రూట్ ఎటో మీడియా ముఖంగా చెప్పేసుకున్నారు. మరి నాడు పవన్ని పన్నెత్తి ఒక్కమాట కూడా అనని కమ్యూనిస్టులు ఇపుడు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారు. మరి ఇంతకాలం పవన్ కళ్యాణ్ మంచే చేశారనుకున్నారా. లేక మోడీ ప్రజా వ్యతిరేక పాలన భరించలేక మద్దతు పార్టీల మీద కూడా పడి విమర్శలు చేస్తున్నారా అంటే అది వారే జవాబు చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే గట్టిగానే విమర్శలు చేశారు. చిత్రంగా ఆయన మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం కూడా బయటకు తెచ్చి వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కి నిలకడ లేదని దులిపేశారు. ఆయనతో పొత్తు పెట్టుకుని చారిత్రాత్మకమైన తప్పు చేశామని కూడా చింతించారు. అంతకు ముందు కూడా సీపీఎం మధు, సీపీఐ రామక్రిష్ణ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మొత్తానికి చూసుకుంటే ఎర్రన్నలు మాత్రం పవన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మరి జనసేనాని తనలో కమ్యూనిస్టు రక్తం ఉందని ఒకనాడు చెప్పుకున్నారు. ఇపుడు వారి విమర్శలను కూడా లైట్ తీసుకుంటారా. ఎదురుతిరుగుతారా చూడాల్సిందే.

Tags:    

Similar News