కింగ్ కోసం కాదటగా ?

పోటీకి వెళ్ళేవాడు తాను ఫస్ట్ రావాలనుకుంటాడు, సెకండ్ వచ్చినా ఫరవాలేదు అనుకున్నవాడు ఇంకా వెనక్కి వెళ్తాడు. దానికి అచ్చమైన ఉదాహరణ 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ [more]

Update: 2020-08-13 15:30 GMT

పోటీకి వెళ్ళేవాడు తాను ఫస్ట్ రావాలనుకుంటాడు, సెకండ్ వచ్చినా ఫరవాలేదు అనుకున్నవాడు ఇంకా వెనక్కి వెళ్తాడు. దానికి అచ్చమైన ఉదాహరణ 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ విన్యాసమే. ఏపీలో రెండు బలమైన వైసీపీ, టీడీపీల మధ్య సీట్ల తేడా వస్తే తాను కింగ్ మేకర్ అవుతాననుకుని బరిలోకి దిగారు, దాంతో ఆయన ఎటూ కాకుండా పోయారు. ఇపుడు ఏపీలో తృతీయ కూటమి అంటూ బీజేపీ, జనసేన ముందుకు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా గట్టిగా మూడున్నరేళ్ళే ఉంది. కరోనా తగ్గిన తరువాత కదన రంగంలోకి దిగాలనుకుంటే మూడేళ్ళే సమయం ఉంటుంది. అంటే లక్ష్యం బహు దూరం, భారంగా ఉందని కచ్చితంగా చెప్పాలి.

సీఎం పీఠం కాదా…?

ఏపీలో రాజకీయం చూసుకుంటే 151 సీట్లతో జగన్ అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా సర్వేలు కూడా జగన్ ప్రజాదరణ ఎక్కడా చెక్కుచెదరలేదని చెబుతున్నాయి. దాంతో ఇంతకంటే సీట్లు కొన్ని తగ్గినా కూడా జగనే మళ్ళీ సీఎం అని అంతా అంటున్న స్థితి ఉంది. మరి 2024 నాటికి జగన్ ని దింపకపోతే ఈ కొత్త కూటమి ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానమూ ఉంది. ముందు మూడు నుండి రెండుకు ఎగబాకడంకోసమట. అంటే టీడీపీ ప్లేస్ లోకి రావడమ‌న్న మాట. దాని కోసమే ఇపుడు ఏపీలో బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందని అంటున్నారు.

గోదారిలో ఈత….

ఉభయ గోదావ‌రి జిల్లాలో మొత్తంగా కలుపుకుని 34 సీట్లు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రాలో కూడా మరో 34 సీట్లు ఉన్నాయి. ఇందులో కాపుల ప్రాబల్యం కలిగిన విశాఖ విజయనగరం, శ్రీకాకుళంలలో సీట్లు సగం దాకా ఉంటాయి. అంటే యాభై సీట్లు బీజేపీ జనసేన కూటమి టార్గెట్ అన్న మాట. ఇందులో కనీసనంగా ముప్పయి దాక సీట్లు తెచ్చుకున్నా కూడా వచ్చే అసెంబ్లీలో కీలకం కావచ్చునని ఈ కూటమి నేతల ప్రైవేట్ సంభాషణల్లో వినవస్తున్నమాటగా ఉంది. అంటే కింగ్ మేకర్ పొజిషన్ కోసమని అన్యాపదేశంగా చెప్పేసుకుంటున్నారన్నమాట.

టీడీపీ తగ్గితేనే ….

ఏపీలో ఎంత చెడ్డా టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీకి 23 సీట్లు వచ్చినా కూడా 38 శాతం ఓటు షేర్ 2019లో కనిపించింది. నాయకులతో సంబంధం లేకుండా పార్టీని చూసి వేసే ఓటు అది. అది ఎంత తగ్గితే ఈ కూటమికి అంత మేలు. అదే విధంగా వైసీపీ నుంచి వచ్చే యాంటీ ఇంకబెన్సీ టీడీపీకి పోకుండా కొంత వరకైనా కాపు కాయాలని కూడా కూటమి పెద్దలు ఆశపడుతున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే వ్యూహాలు రూపొందిస్తున్నారు,.

ఢీ అంటే ఢీ……

ఇక ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఈ కూటమి అవతరించాలంటే మరీ డ్రాస్టిక్ గా వైసీపీ బలం పడిపోవాలి. ఆ ప్లేస్ లోని టీడీపీ పోటీ పడకుండా ఉండాలి. అపుడు తాము ఎక్కువ సీట్లు గెలుచుకుని వీలుంటే అధికార పీఠానికి చేరువ కావాలని, లేకపోతే టీడీపీని వెనక్కి నెట్టి ప్రధాన పాత్ర పోషించాల‌న్నది ఈ కూటమి మేధావుల ఆలోచన‌గా కనిపిస్తోంది. సరే ఇవన్నీ ఆలోచనలు, కాగితం మీద రాసుకున్న లెక్కలు అనుకోవాలి. కానీ గ్రౌండ్ రియాల్టీకి వీటికీ చాలా తేడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండగా, ఆయన నాయకత్వంలో టీడీపీ ఉండగా ఆ ఓటు బ్యాంక్ నుంచి భారీగా లాగడం ఈ కూటమి వల్ల కాదనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ 38 శాతం ఓట్ల షేర్ నుంచి ఎనిమిది శాతం వదులుకున్నా అది 30 శాతానికి రావచ్చు, అలాగే వైసీపీకి ఒకటి రెండు శాతం ఓట్ల షేర్ తగ్గినా కూడా అది ఈ కూటమికి కలవవచ్చు ఆ విధంగా 18 శాతం ఓట్ల షేర్ తెచ్చుకుంటే చాలా పెద్ద విజయం సాధించినట్లే. ఇక్కడో విషయం కూడా చెప్పుకోవాలి. ఓట్లకు సీట్లకూ ఎపుడూ పొంతన ఉండదని, దానికి టీడీపీయే అతి పెద్ద ఉదాహరణ. అందువల్ల ఓట్ల శాతం పెరుగుదలతో పాటు కచ్చితంగా గెలిచే సీట్ల మీద కూడా కూటమి దృష్టి పెడితేనే 2024 ఎన్నికలు బీజేపీ జనసేన కూటమికి ఆశాజనకంగా ఉంటాయి.

Tags:    

Similar News