ఆ ఆలోచన లేకుండా చేస్తే ఎలా?

పవన్ కళ్యాణ్ 2018 రాజకీయం అంతా విశాఖ చుట్టూనే తిరిగింది. ఆనాడు తరచూ విశాఖకు పవన్ వచ్చేవారు. జనసేనకు అసలైన అభిమానం ఈ ప్రాంతంలోనే ఉందని గట్టిగా [more]

Update: 2020-07-31 08:00 GMT

పవన్ కళ్యాణ్ 2018 రాజకీయం అంతా విశాఖ చుట్టూనే తిరిగింది. ఆనాడు తరచూ విశాఖకు పవన్ వచ్చేవారు. జనసేనకు అసలైన అభిమానం ఈ ప్రాంతంలోనే ఉందని గట్టిగా చెప్పుకున్నారు. ప్రజా పోరాట యాత్ర పేరిట ఒక కార్యక్రమాన్ని కూడా ఉత్తరాంధ్రా నుంచే పవన్ కళ్యాణ్ నాడు ప్రారంభించారు. విశాఖలోని అంబేద్కర్ భవనంలో అతి సామాన్యుడిగా కొన్ని రోజులు గడిపి జనసైనుకులకు దిశా నిర్దేశం కూడా చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కచ్చితంగా తనకు అతి పెద్ద రాజకీయ వాటా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశించారు. విశాఖ అంటే ఇష్టమని చెప్పుకున్నారు.

జన్మ ఇచ్చిందిగా ….

విశాఖకు పవన్ కళ్యాణ్ కి అందమైన అనుబంధం ఉంది. ఆయన నట శిక్షణను విశాఖలోనే పూర్తి చేసుకున్నారు. ప్రముఖ నట శిక్షకుడు సత్యానంద్ వద్ద కొంతకాలం ఆయన శిష్యరికం చేసి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. తనకు విశాఖలో అణువణువూ తెలుసు అని పవన్ కళ్యాణ్ నాటి ముచ్చట్లు తరువాత జనసైనికులకు ఎంతో మురిపెంగా చెప్పుకున్నారు. అటువంటి విశాఖకు తాను రాజకీయ కాపాలదారుగా ఉంటానని, పాలకుల దుర్నీతిని నిలదీస్తానని కూడా పవన్ అంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే గాజువాక మీద ప్రేమతో పోటీ చేశారు. కానీ ఆయన ఓడిపోయారు. నాటి నుంచి ఆయన విశాఖ మీద కొంత విరక్తి పెంచుకున్నారని అంటారు.

కోరి మరీ….

పవన్ కళ్యాణ్ పార్టీ ఇపుడు ఏపీ రాజకీయాల్లో నిర్మాణ దశలో ఉంది. కీలకమైన విషయాల్లో ఆచీ తూచీ స్పందించే వీలుంది. ఎందుకంటే అటు అధికారంలో లేదు, ఇటు ప్రధాన‌ ప్రతిపక్షం కూడా కాదు. అందువల్ల వెసులుబాటు ఆయనకు చాలానే ఉంది. సున్నితమైన అంశాల్లో పవన్ ఎంతో ఆలోచించి నిర్ణయాలు ప్రకటించవచ్చు. కానీ పవన్ మాత్రం హడావుడిగా చేస్తున్న ప్రకటనలు ఆయన పార్టీ కొంప ముంచుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో పవన్ ది దుందుడుకు వైఖరి అనే విశ్లేషిస్తున్నారు. టీడీపీ అధికారం చూసేసిన పార్టీ. ఏపీ అంతటా క్యాడర్ ఉన్న పార్టీ. ఆ పార్టీ ఏం మాట్లాడినా కూడా కాసుకోగలుగుతుంది. కానీ మొగ్గ దశలో ఉన్న జనసేన అలా కాదు అన్ని ప్రాంతాలూ కావాలి అనుకోవాల్సిన స్థితి. అటువంటి వేళ వివాదాస్పద విషయాల జోలికి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువగా పోతే అంత మంచిదని కూడా జనసైనికులు అంటున్నారు.

బలమున్న చోటనే…..

విశాఖ రాజధాని అని వైసీపీ అంటోంది. ఆ పార్టీకి రాయలసీమలో ఫుల్ స్ట్రాంగ్ బేస్ ఉంది. ఉత్తర కోస్తాలో పట్టు కోసం వైసీపీ వేసిన రాజకీయ ఎత్తుగడ ఇది. ఆ సంగతి తెలిసి టీడీపీ మోకాలడ్డుతోంది. ఆ రెండు పార్టీల ప్రకటనల వెనక భారీ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. కానీ బోళాగా పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానులు వద్దు అని అనడం ద్వారా కాస్తో కూస్తో పట్టున్న విశాఖను చేజేతులా కాలదన్నుకుంటున్నారని అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి విశాఖ మూడు సీట్లు ఇచ్చింది. మెగా హీరోల సినిమాలకు కూడా ఉత్తరాంధ్ర బలమైన పునాదిగా ఉంది. ఈ కీలకమైన అంశాలను మరచి విశాఖకు వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ తన రాజకీయ అపరిపక్వతను చాటుకున్నారని అంటున్నారు. విశాఖ రాజధాని వద్దు అంటున్న పవన్ రేపటి రోజున ఇక్కడకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. చంద్రబాబు అంతటి వాడినే గో బ్యాక్ అని విశాఖ నుంచి పంపించేసిన వైసీపీకి పవన్ కళ్యాణ్ జనసేన పెద్దగా లెక్కలోకి కాదనే అంటారు. మొత్తానికి పవన్ కి విశాఖలో ఓడించారన్న బాధ ఉండవచ్చు కానీ తన పార్టీ బలపడాలి అంటే జాగ్రత్తగా ప్రకటనలు ఇన్వాలి, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలని సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News