పవన్ అడ్డంగా దొరికారా ?

పవన్ కళ్యాణ్ మొదట సినిమా నాయకుడు. తరువాత రాజకీయ నాయకుడు. సినిమా నటుడికి స్క్రిప్ట్ చేతిలో ఉంటుంది. అందువల్ల పెద్దగా సమస్యలు ఉండవు. అదే రాజకీయాల్లొ మన [more]

Update: 2020-05-27 12:30 GMT

పవన్ కళ్యాణ్ మొదట సినిమా నాయకుడు. తరువాత రాజకీయ నాయకుడు. సినిమా నటుడికి స్క్రిప్ట్ చేతిలో ఉంటుంది. అందువల్ల పెద్దగా సమస్యలు ఉండవు. అదే రాజకీయాల్లొ మన స్క్రిప్ట్ మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడే పవన్ కళ్యాణ్ తడబడుతున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కోసారి అందరి కంటే ముందే కోయిల కూసినట్లుగా స్టేట్మెంట్స్ ఇస్తారు. మరి కొన్నిసార్లు అంతా అయిపోయాక ఆయన‌ ప్రకటనలు తాపీగా వస్తుంటాయి. సినిమా నటులకు టైమింగ్ ఎంత ముఖ్యమో రాజకీయ నాయకులకు కూడా అంతే ముఖ్యం. మరి పవన్ కళ్యాణ్ ఈ సంగతిని తెలుసుకోవడంలేదా అన్నదే ఇక్కడ డౌట్.

అయిపోయిన పెళ్ళికి….

అచ్చం ఇదే సామెత చెప్పి వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని ఎకసెక్కం ఆడుతున్నారు. అర్చకులకు, పాస్టర్లకు, ఇమాములకు తలో అయిదు వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని వైసీపీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుంది. ఈ నిర్ణయం తరువాత తాపీగా పవన్ కళ్యాణ్ ఒక గంభీర ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటి అంటే ఏపీలో అర్చకులను ఆదుకోవాలని, లాక్ డౌన్ టైంలో వారు అన్ని విధాలుగా ఇబ్బందులో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఆ సంగతి తెలిసే సర్కార్ వారికి సాయం చేస్తున్నట్లుగా ప్రకటించింది. అది అన్ని పత్రికల్లో వచ్చేసింది కూడా. అయినా సరే పవన్ కళ్యాణ్ కి తెలియకపోవడం విడ్డూరమే. దాంతో అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ వాయిస్తావేంటి పవన్ కళ్యాణ్ అంటూ వెల్లంపల్లి సెటైర్లు వేశారు.

కసరత్తు చేయరా..?

ఏపీలో తామే ఆల్టర్నేటివ్ అని చెప్పుకుంటున్న జనసేన రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద కనీస మాత్రంగా కసరత్తు చేయదా అన్న చర్చ ఇపుడు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పుస్తకాలు వేలల్లో చదువుతారు అని చెబుతారు. కానీ చదవాల్సింది పత్రికలను అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే తాను పార్టీ పెట్టాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తీరు ఉండడంపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శలు చేయాలి. కానీ మంచి పనులు చేసినపుడు మెచ్చుకుంటేనే నాయకుడి విశ్వసనీయత పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో అదే చెప్పారు. తాను రోటీన్ విమర్శలు చేయనని కూడా అన్నారు. కానీ తీరు చూస్తూంటే విమర్శ కోసమే పనిగట్టుకుని ట్విట్టర్ ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఇలా ఆవేశపడి చేసిన తడబాట్లు, పొరపాట్ల వల్ల పరిష్కారం అయిన సమస్యల మీద కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్లు పెడుతున్నారని అంటున్నారు.

పుణ్యకాలం గడుస్తోంది ….

రాజకీయాల్లో కాలం వేగంగా పరిగెడుతుంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి అపుడే ఏడాది గడచింది. ఇక మిగిలింది నాలుగేళ్ళు మాత్రమే. జనసేన పోరాటాలు ఈ మధ్య కాలంలో చేసింది పెద్దగా లేదన్న మాట ఉంది. ఇకనైనా మిగిలిన కాలానికి కార్యాచరణ రూపొందించుకుని ప్రజలతో కలసి ఉద్యమాలు చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించేలా పోరాటాలు ఉండాలి. ఆ ఉద్యమాలు చేయడం వల్ల జనాలకు జైళ్ళు, నేతలకు తిట్లూ బహుమానంగా రాకూడదు. అంటే చేసే పోరాటంలో చిత్తశుధ్ధి ఉండాలి. ప్రభుత్వం కూడా ఇది మేం చేయలేదే అని నిజాయతీగా ఆలోచించేలా ప్రజా సమస్యలను తట్టిలేపాలి. మరి పవన్ కళ్యాణ్ ఇకనైనా ఆ విధంగా చేస్తారా? లేక ట్విట్టర్ ద్వారానే రోజూ సెటైర్లు, కామెంట్స్ చేస్తూ కాలక్షేపం చేస్తరా? చూడాలి మరి.

Tags:    

Similar News