ఎక్కడికక్కడ సర్దుకుంటున్నట్లేనా? పట్టించుకునే వారే లేరా?

రాష్ట్రంలో కీల‌క పార్టీగా అరంగేట్రం చేసిన జ‌న‌సేన పార్టీ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రజ‌ల‌కు చేరువ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ [more]

Update: 2020-05-02 14:30 GMT

రాష్ట్రంలో కీల‌క పార్టీగా అరంగేట్రం చేసిన జ‌న‌సేన పార్టీ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రజ‌ల‌కు చేరువ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన రాజ‌కీయ మిత్రత్వాలు, వేసిన‌ రాజ‌కీయ అడుగులు పార్టీని నేడు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2014 ఎన్నిక‌ల‌కు ముందుగానే జ‌న‌సేన ఆవిర్భవించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్టార్ హీరోగా ఉండ‌డంతో జ‌న‌సేన‌కు తిరుగులేని క్రేజ్ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అయితే, ఆ ఎన్నిక‌ల్లో దూరంగా ఉన్న పార్టీ .. త‌ర్వాత పుంజుకుంది. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. కేవ‌లం ఒక్కడు మాత్రమే విజ‌యం సాధించారు.

అన్నింటా పిల్లిమొగ్గలే…

2014 ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ అప్పటి అధికార టీడీపీతో పాటు బీజేపీ విష‌యంలో తీసుకున్న స్టాండ్‌… పిల్లిమొగ్గలు, మాట మార్చడాలు రాష్ట్ర ప్రజ‌ల‌కు న‌చ్చలేదు. రాజ‌కీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జం కాబ‌ట్టి.. జ‌న‌సేన‌ను కూడా అలానే అంచ‌నా వేశారు. గెలుపు, ఓట‌ములకు భిన్నంగా తాను పార్టీని ముందుకు న‌డిపిస్తాన‌ని పార్టీ అధినేత ప‌వ‌న్ కల్యాణ్ కూడా ప్రక‌టించారు. అయితే, ఎవరూ ఊహించ‌ని విధంగా పార్టీని బీజేపీతో క‌లిపి ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణయించారు. నిజానికి గ‌తేడాది ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీ వేర్వేరుగా పోటీ చేసి ఘోర‌ప‌రాజ‌యం మూట‌క‌ట్టుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడితో పాటు హేమాహేమీలు ఓడిపోయారు. ఇటు జ‌న‌సేన అధ్యక్షుడి హోదాలో రెండుచోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ సైతం ఓడిపోయారు.

బీజేపీకి దగ్గరవ్వడంతో…

ఇక ప‌వ‌న్ కల్యాణ్ బీజేపీకి ద‌గ్గర‌వ్వడంతో ఏపీలో అన్ని ఈక్వేష‌న్లు ప‌వ‌న్‌ కల్యాణ్ కు మైన‌స్ అయ్యాయి. నిజానికి ముస్లింలు స‌హా ద‌ళిత వ‌ర్గాలు బీజేపీకి దూరం. ఈ విష‌యం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌వ‌న్ కల్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు వ‌ర్గాలు కూడా అప్పటి వ‌ర‌కు జైకొట్టి.. ప‌క్కకు త‌ప్పుకొన్నాయి. దీంతో జ‌న‌సేన బ‌లం స‌గానికి ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో పార్టీలోని కీల‌క వ‌ర్గాలు కూడా బీజేపీపై అంత సానుకూలంగా లేవు. అలాంటి వ‌ర్గాలు కూడా ప‌వ‌న్ నిర్ణయంతో దూర‌మ‌య్యాయి. పార్టీలో పేరుకే ఉన్నప్పటికీ.. అనేక మంది నాయకులు ఇప్పుడు త‌ట‌స్థంగా మారిపోయారు. పార్టీలో ఉన్నా.. లేన‌ట్టుగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి స్థానిక సంస్తల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుదామ‌ని చెప్పిన ప‌వ‌న్‌ కల్యాణ్ ఈ విష‌యంలోనూ పార్టీని ముందుండి న‌డిపించ‌లేక పోయారు. ఫ‌లితంగా పార్టీ ఎక్కడిక‌క్కడ చిన్నాభిన్నమై పోయింది.

ఏ ప్రాంతంలో చూసినా…..

అటు రాయ‌ల‌సీమ‌లో నాలుగు జిల్లాల్లో చాలా చోట్ల కాదు క‌దా క‌నీసం సింగిల్ డిజిట్ స్థానాల్లో కూడా ఈ రెండు పార్టీల కూట‌మి అభ్యర్థుల‌ను నిల‌బెట్టలేని దుస్థితిలో ఉంది. ఇక‌, ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో పార్టీ నాయ‌కులు ఉన్నవారు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఈ స‌మ‌యంలో ప్రజ‌ల‌కు ఎంతో అండ‌గా ఉండాల్సిన పార్టీ త‌న కార్యక్రమాలు కూడా చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. నాలుగు రోజుల కింద‌ట ప‌వ‌న్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ కార్యక్రమాలు ప్రక‌టించినా ప‌ట్టించుకునే నాధుడు కూడా క‌నిపించ‌లేదు. ఇక కొద్ది రోజుల క్రిత‌మే వ‌రుస‌గా సినిమాలు స్టార్ట్ చేసిన ప‌వ‌న్ ఇప్పుడు లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇలా మొత్తంగా ప్రశ్నిస్తాన‌ని వ‌చ్చిన‌ జ‌న‌సేన ఇప్పుడు ప్రశ్నార్థక పార్టీగానే మిగిలిపోయింద‌ని చెప్పాలి.

Tags:    

Similar News