సైలెంట్ గా పవన్ కి షాక్ ఇచ్చేసిన బీజేపీ ?

రాజకీయాల్లో పొత్తులు అంటేనే అది ఒక అసహజమైన బంధంగానే చూడాలి. ఎందుకంటే అంత పొత్తు కనుక ఉంటే ఒకే పార్టీగా ఉంటారు కదా. ఎవరి సిద్ధాంతాలు వేరు, [more]

Update: 2021-02-15 13:30 GMT

రాజకీయాల్లో పొత్తులు అంటేనే అది ఒక అసహజమైన బంధంగానే చూడాలి. ఎందుకంటే అంత పొత్తు కనుక ఉంటే ఒకే పార్టీగా ఉంటారు కదా. ఎవరి సిద్ధాంతాలు వేరు, ఎవరి ఆలోచనలు వేరు. కానీ అధికారమే పరమావధి అన్న కామన్ పాయింట్ తోనే రెండు పార్టీలు కలుస్తాయి. వాటి మధ్య సిద్ధాంతాలు లేకపోయినా ఉన్నట్లుగా చెప్పుకుంటూ పీఠం కోసం వెంట మొదలుపెడతాయి. ఉమ్మడి ఏపీలోనూ, విభజన ఏపీలోనూ ఇలాంటి పొత్తులు చాలానే అంతా చూశారు. ఇపుడు ఏపీలో అలాంటి ఒక పొత్తుగా బీజేపీ జనసేన అని చెప్పుకోవాలి.

భావ‌సారూప్యమేదీ ..?

పవన్ కల్యాణ్ జనసేన స్థాపించినపుడు తనకు కులం మతం లేదని చెప్పుకొచ్చారు. ఇక కేంద్రం పెత్తనం కింద రాష్ట్రాలు నలిగిపోతున్నాయని కూడా ఆయన చాలా సందర్భాల్లో ఉన్నారు. బీజేపీలో వారు చెప్పే భారతీయత కంటే వేరే అర్ధాలు తనకు తెలుసు అని కూడా అన్నారు. ఇక ఉత్తరాది దక్షిణాది అంటూ కూడా పవన్ చాలా పెద్ద మాటలే వాడారు. మొత్తానికి పవన్ ఏడాది క్రితం బీజేపీ గూట్లోకి రూట్లోకి వచ్చారు. పొత్తులు పెట్టుకున్నారు. మా కూటమే ఏపీలో వైసీపీకి సరైన ఆల్టర్నేషన్ అన్నారు. రేపటి రోజున అధికారం మాదే అని కూడా చెప్పేశారు.

బీసీ దెబ్బతో…

ఇక ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ అయితే బాబు జగన్ పోవాలి. సోము పవన్ కల్యాణ్ రావాలి అన్నది తమ నినాదమని ఈ మధ్య మీడియాతో గట్టిగానే చెప్పారు, కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే ఏకంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి సంచలనమే రేపారు. ఏపీలో అగ్ర కులాలకే ముఖ్యమంత్రి పదవులు వెళ్తున్నాయి బీజేపీ మాత్రం బీసీలకు అవకాశం ఇస్తుంది అని ఆయన అంటున్నారు. ఆ మాట బయట వారికి ఎలా ఉన్నా కూడా మిత్ర పక్షం అయిన జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో అన్నదే పెద్ద చర్చ. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని అపుడే జనసైనికులు ఓ వైపు గట్టిగా అంటున్నారు. మరో వైపు బీజేపీకి చెందిన వారే సీఎం అని సోము వీర్రాజు అంటున్నారు. అది కూడా బీసీలకే ఇస్తామని చెబుతున్నారు. మరి ఆ విధంగా చూస్తే పవన్ కల్యాణ్ కి సీఎం అవకాశం లేనట్లేనా అన్న మాట అయితే వినిపిస్తోంది.

ఎత్తుకు పై ఎత్తు….

బీజేపీ కాపులను చేరదీయాలని నిన్నటిదాకా చూసింది. అది పెద్దగా వర్కౌట్ కావడంలేదు. ఏకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని కలసినా స్పందన లేదు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కాపుల మద్దతు కోసం తాజాగా మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య వంటి వారితో మీటింగ్ నిర్వహించారు. పవన్ కల్యాణ్ కి ఉన్న సినీ చరిష్మా, ఆయన కూడా కాపు నేత కావడంతో కాపు కార్డు అంటూ పోటీ పడితే కచ్చితంగా పవన్ వైపే మొగ్గు ఉంటుందని బీజేపీ ఆలోచించినట్లు ఉంటుంది. దాంతో ఇపుడు హఠాత్తుగా బీసీ అజెండాను తలకెత్తుంది. ఏపీలో బీసీ కార్డు ను తీసి ముందుకు సాగాలని కొత్త ఎత్తులే వేస్తోంది. మరి కూటమిలో ఉన్న జనసేనకు అయినా చెప్పి దీని మీద ఒప్పించారా. ఏకాభిప్రాయం సాధించారా అన్నదే ప్రశ్న. అయినా పవన్ కల్యాణ్ సీఎం కాకపోతే మనకెందుకీ కంచి గరుడ సేవ అని జనసైనికులు అనుకున్నా అనుకుంటారుగా. మొత్తానికి బీజేపీ జనసేన బంధానికి అగ్ని పరీక్షలా ఈ బీసీ కార్డు ఉంటుందా అన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News