పవన్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లేనా..?

కులం కూడు పెడుతుందా అని అంటారు బతకడం రాని వాళ్ళు. కానీ కులం కూడు కాదు, కుర్చీయే ఇస్తుంది. ఇది ఎన్నో సార్లు రుజువు అయింది. భారత [more]

Update: 2021-02-20 15:30 GMT

కులం కూడు పెడుతుందా అని అంటారు బతకడం రాని వాళ్ళు. కానీ కులం కూడు కాదు, కుర్చీయే ఇస్తుంది. ఇది ఎన్నో సార్లు రుజువు అయింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ ఏడాదికి 74 ఏళ్ళు అవుతుంది. కానీ కులం మతం గోడలు బద్ధలు కొట్టుకుని ఈ దేశం ఆ బానిస సంకెళ్ళ నుంచి ఇప్పటికీ బయటపడలేదు. మనది లౌకిక రాజ్యమని, సామ్యవాదమని రాజ్యాంగంలో గొప్పగా చాటుకుంటాం, కానీ విషయానికి వస్తే ఎంతో సంకుచితంగా వ్యవహారాలు ఉంటాయి. ఎన్నో ఉన్నత చదువులు చదివిన వారు కూడా కులాన్నే అడ్డుపెట్టుకుని ఎదుగుతున్నారంటే సిగ్గు వేయదూ, ఆశ్చర్యం అంతకన్నా రాదు, ఎందుకంటే ఇండియాకు ఇది ఏ మొహమాటం లేకుండానే అలవాటు అయిపోయింది.

దిగక తప్పదుగా….

సహజంగా సినిమా వాళ్ళు ఓపెన్ గా ఉండరు, వారు బయట చెప్పేది ఒకటి ఉంటుంది. లోపల జరిగేది వేరొకటి ఉంటుంది. ఇక సినిమా పక్కా వ్యాపారం. దానికి అందరూ కస్టమర్లుగా కావాలి. రావాలి. మరి రాజకీయంలోనూ అందరూ కావాలి కానీ మనవాళ్ళు అంటూ ముడి సరకు ఉంటే మిగిలిన కధ సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. అయితే మెగా సోదరులు మాత్రం పార్టీని పెట్టినపుడు ఎపుడూ కులం గురించి పెద్దగా మాట్లాడింది లేదు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం అయినా నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ అయినా తాము అందరివాళ్లమే అంటూ కలరింగ్ ఇచ్చుకున్నారు. వరసపెట్టి మూడు ఎన్నికలు, భారీ ఫెయిల్యూర్స్ చూశాక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోక తప్పింది కాదేమో మరి.

డేరింగ్ గానే….

పవన్ కళ్యాణ్ తాను అందరి వాడిని అంటూనే కాపు నేతల మీటింగుకు వెళ్ళారు, కాపుల జనాభా ఎంతో ఆ మీటింగ్ సాక్షిగా చెప్పారు. కాపులు తలచుకుంటే శాసిస్తారు అంటూ పొలిటికల్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాపులు యాచించే స్థితి ఇకపై రారాదు అని కూడా గర్జించారు. కాపులకు రిజర్వేషన్లు కావాల్సిందే అంటూ శషబిషలు కూడా వదిలేసి మరీ డిమాండ్ చేశారు. ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం అందరి వాడినేంటూ చివరిలో ముక్తాయింపు ఇచ్చారు. సరే పవన్ దాదాపు పుష్కర కాలంగా రాజకీయాల్లో మునిగి ఉన్నారు. ఆయన బాగానే ఇలాంటి విషయాల్లో నలిగారు అనుకోవాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కరెక్ట్ రూట్ లోకే వచ్చేశారా అంటే అవును అనే సమాధానం వస్తోంది

వర్కౌట్ అయితే హిట్టే ….

ఏపీ రాజకీయాలు తీసుకుంటే టీడీపీ నెమ్మదిగా తగ్గిపోతోంది. బీజేపీ జనసేన కాపుల మీద గురి పెట్టి ఉన్నాయి. జగన్ వైసీపీ వైపు దళితులు, మైనారిటీలు ఉన్నారు. ఇక బీసీలను కూడా జగన్ బాగానే దువ్వుతున్నారు. ఈ నేపధ్యంలో మిగిలిన కాపులను కాపు కాయడానికి బీజేపీ జనసేన కూటమి రెడీ అయిందనుకోవాలి. ఏపీలో 27 శాతం కాపు జనాభా ఉంది. దాదాపుగా 75 అసెంబ్లీ సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. దాంతో కాపుల మద్దతు పూర్తిగా కాకపోయినా మెజారిటీ దక్కినా ఏపీ రాజకీయాల్లో టీడీపీని తోసుకుని జనసేన బీజేపీ కూటమి ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. అధికారంలోకి రావాలంటే మాత్రం మిగిలిన కులాల మద్దతు కావాలి. కాపులను భుజానికెత్తుకుంటే బీసీలు దూరం జరుగుతారు. ఇక కమ్మలతో కూడా కొంత ఎడం వస్తుంది. మిగిలిన కులాలు కూడా అనుమానపడతాయి. ఏది ఏమైనా బలమైన రాజకీయ పక్షంగా ఉండడానికి మాత్రం ఇది పనికి వస్తుంది. మొత్తానికి ఇన్నాళ్ళకు ముసుగు తీసి మరీ పవన్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడడానికి రెడీ అయిపోయారు. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News