పవన్ పరుగు తీయలేరనేగా?

నిజమే.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో జనసేనకు బలం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిరంజీవి విజయం సాధించారు. కానీ తిరుపతి [more]

Update: 2021-01-31 12:30 GMT

నిజమే.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో జనసేనకు బలం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిరంజీవి విజయం సాధించారు. కానీ తిరుపతి పార్లమెంటు పరిధిలో అంత బలం ఉందా? అంటే… లేదనే చెప్పాలి. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో మరోసారి పవన్ కల్యాణ్ బీజేపీకి తలొగ్గుతారా? అన్న చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ లేచి నిలబడకముందే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ పరుగులు తీస్తుంది.

బీజేపీ ముందస్తుగానే…?

పార్లమెంటు ఉప ఎన్నిక కావడంతో తమకు వదిలేయాలని బీజేపీ పట్టుబడుతుంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని తెలిపారు. ఈ మేరకు బీజేపీ కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. మండలాల వారీగా బాధ్యులను నియమించింది. ఉప ఎన్నికకు అంతా తాము సిద్దమంటూ జనసేనకు పరోక్షంగా సంకేతాలను పంపింది. మరోవైపు రధయాత్రను కూడా తిరుపతి నుంచే బీజేపీ ప్రారంభించనుంది.

ఏమీ లేకుండానే…?

జనసేన విషయానికొస్తే ఆ పార్టీకి ఏడు నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు. క్యాడర్ పెద్దగా లేదు. పవన్ కల్యాణ‌్ అభిమానులు తప్పించి ఆ పార్టీకి ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఓటు బ్యాంకు లేదనే చెప్పాలి. రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో సామాజికవర్గ ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. కానీ స్థానిక జనసేన నాయకులు మాత్రం ఇక్కడ తమ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలని పట్టుబడుతున్నారు.

అందుకోసమేనా?

పవన్ కల్యాణ్ సయితం జనసేన అభ్యర్ధినే బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఒకటి తమ పార్టీ గుర్తు మరోసారి ప్రజల్లోకి వెళుతుండటం, ఇప్పటి వరకూ అన్నీ బీజేపీకే జనసేన తలొగ్గిందన్న అభిప్రాయం నుంచి బయటపడేందుకే తిరుపతిలో పోటీ చేయడానికి పవన్ కల్యాణ‌్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అయితే బీజేపీ పెద్దలు ఈ విషయంలో మరోసారి పవన్ కల్యాణ‌్ ను ఒప్పించే అవకాశాలున్నాయంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద వపన్ కల్యాణ‌్ ప్రయత్నాలను బీజేపీ తన దైన రీతిలో చెక్ పెడుతుందనే అభప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

Tags:    

Similar News