అందరివాడు పవన్ ని ఇలా చేస్తున్నారా…?

కళాకారులకు కులం ఉండదు అంటారు. వారి కళను అందరూ ఆదరించాలి. వెండి తెర వేలుపుల కులాలు ఏంటి అన్నవి ఈ మధ్యన ఎక్కువగా చర్చకు వస్తున్నాయి కానీ [more]

Update: 2021-01-26 13:30 GMT

కళాకారులకు కులం ఉండదు అంటారు. వారి కళను అందరూ ఆదరించాలి. వెండి తెర వేలుపుల కులాలు ఏంటి అన్నవి ఈ మధ్యన ఎక్కువగా చర్చకు వస్తున్నాయి కానీ గతంలో అయితే ఎవరికీ అసలు తెలిసేది కాదు. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన కులం గురించి పెద్దగా జనాలకు తెలియదు. ఇక ఆయన్ని దైవాంశ సంభూతుడిగా జనం కొలిచి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిని చేశారు. ఆ తరువాత అంతటి సినీ గ్లామర్ తో పాటు గట్టి ఇమేజ్ ఉన్న చిరంజీవి పార్టీ పెడితే జనం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దానికి కారణం ఆయన పార్టీకి కులపరమైన ప్రచారం ఎక్కువగా తీసుకురావడమే.

పవన్ తప్పు అదేనా…?

ఇక తాను అందరి వాడిని అని 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ 2019 నాటికి మాత్రం చాలా రకాలుగా జనంలో నానారు. ఆయన చివరికి పోటీ చేసిన రెండు సీట్లూ కూడా కాపులు ప్రాబల్యం ఉన్నవి కావడంతో కోరి మరీ ఆ కులం రొచ్చులోకి దిగారా అన్న విమర్శలు అయితే వచ్చాయి. కానీ వ్రతమే చెడి ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఇలా ప్రజారాజ్యం, జనసేనలకు రెండు చేదు అనుభవాలు కళ్ల ముందే అలా ఉన్నాయి. కానీ ఇపుడు మళ్లీ పవన్ కల్యాణ్ కోరి మరీ అదే తప్పు చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఆ ఉచ్చులో పడితే…?

ఏ రాజకీయ నాయకుడు అయినా గెలవాలి అంటే అన్ని వర్గాల నుంచి ఆదరణ సంపాదించుకోవాలి. ఎన్టీయార్ కి చంద్రబాబుకు వెనక ఉన్న సామాజిక వర్గం ఓట్ల శాతం చాలా తక్కువ. అలాగే జగన్, వైఎస్సార్ లకూ సామాజిక వర్గం ఓట్లు తక్కువే. కానీ వీరంతా కులాల గోడలను చీల్చుకుని బయటకు వచ్చారు. తమ రాజకీయాల ద్వారా అందరివారు అని అనిపించుకున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పేరిట పార్టీ పెట్టినపుడు మంచి సిధ్ధాంతాలే వల్లించారు. అయితే ఆయన పొత్తుల ఎత్తుల వల్లనే అసలు ఫిలాసఫీ వెనక్కిపోతోంది అంటున్నారు. బీజేపీతో పొత్తు ద్వారా హిందూత్వ అజెండాను పవన్ భుజానికెత్తుకున్నారని విమర్శలు ఒకవైపు ఉంటూండగానే ఇపుడు బీజేపీ చేస్తున్న కుల రాజకీయం కూడా మిత్రుడిగా పవన్ కి చుట్టుకునేలా ఉందని అంటున్నారు.

అది జరిగే పనేనా …?

ఏపీ రాజకీయాలు చూసిన వారికి కుల ప్రభావం ఎంత ఉన్నా కూడా దాన్ని దాటి ఆలోచించేవారి వల్లనే ఘనమైన విజయాలు దక్కాయని చరిత్ర నిరూపించిన సత్యం. ఏపీలో మత రాజకీయాలకు అసలు తావు లేవు. అలాగే ఒక కులానికి చెందిన నాయకులకు గుత్తమొత్తంగా ఓట్లు వేసి గెలిపించిన చరిత్ర కూడా లేదు. బీజేపీ ఓ వైపు మతాన్ని దువ్వుతూన మరో వైపు కాపులకు గేలం వేస్తోంది. ఈ రెండు విభిన్న మార్గాల ద్వారా పయనం చేయడం ద్వారా బీజేపీ ఎంతవరకూ రాజకీయ లక్ష్యాన్ని చేరుతుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అందరి వాడు ఇమేజ్ ని మాత్రం ఈ పొత్తు తో డ్యామేజ్ చేస్తోంది అంటున్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ బీజేపీ ఆడుతున్న ఈ సంకుచిత రాజకీయ క్రీడ నుంచి బయటకు వచ్చి అందరివాడుగా జనంలోకి వస్తేనే జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. మరి పవన్ రాగలడా.

Tags:    

Similar News