పవన్ కి అక్కడ ఉక్కబోతగా ఉందట !

రాజకీయాలంటేనే అలా ఉంటాయి. అవి జడపదార్ధంలా ఒక చోట పడి ఉండవు. నిరంతర ప్రవాహంగా సాగుతూంటాయి. ఒకసారి వెనక్కు కూడా పోటెత్తుతూంటాయి. రాజకీయ స్వభావమే అది. ఇక [more]

Update: 2020-04-19 05:00 GMT

రాజకీయాలంటేనే అలా ఉంటాయి. అవి జడపదార్ధంలా ఒక చోట పడి ఉండవు. నిరంతర ప్రవాహంగా సాగుతూంటాయి. ఒకసారి వెనక్కు కూడా పోటెత్తుతూంటాయి. రాజకీయ స్వభావమే అది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరేళ్ళ క్రితం పార్టీని పెట్టారు. ఆయన పొత్తులతో బరిలోకి దిగారు. తరువాత 2019 ఎన్నికల్లో తానూ పోటీ చేసి పార్టీని కూడా దించారు. ఇంత చేసినా చేదు అనుభవాలే రావడంతో పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2024 లో అధికారం మాదేనని కమలం పార్టీతో చేతిలో చేయేసిన రోజు నిబ్బరంగా చెప్పుకొచ్చారు.

ఆ హుషారేదీ …?

పవన్ కల్యాణ్, బీజేపీ పొత్తు వార్త ఏపీ రాజకీయాల్లో నాడు సంచలనమే అయింది. ఏపీలో మూడవ రాజకీయ వేదిక బలంగా నిర్మాణం అవుతోందని అంతా భావించారు. పవన్ గ్లామర్ కి బీజేపీ గ్రామర్ అద్దితే సూపర్ హిట్టే అన్నారు. కానీ తరువాత మాత్రం రెండు పార్టీలలో హుషార్ తగ్గిపోయింది. ఇలా పొత్తు పెట్టుకుని అలా పవన్ సినిమాల్లోకి దూకేశారు. ఇక బీజేపీ నేతలు కూడా తమదైన పోరాటం చేస్తున్నారు. జగన్ మీద ఒక్క కన్నా లక్ష్మీనారాయణ తప్ప బీజేపీలో పెద్దగా గొంతులు లేవడంలేదు. మరో వైపు పొత్తు తరువాత జనసేనలో కూడా ఎక్కడలేని స్తబ్దత ఆవహించింది.

వైసీపీతో…?

ఇక వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు కొనసాగిస్తుందన్న అనుమానాలను కూడా జనసైనుకులు వ్యక్తం చేస్తున్నారు. అది మూడు రాజధానుల సమస్య అయినా, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించేలా చేసిన మార్పులకు , తెచ్చిన ఆర్డినెన్స్ కి గవర్నర్ మారు మాటాడకుండా సంతకం పెట్టడం వంటివి చూసిన వారికి తెర వెనక బీజేపీ సాయం బాగానే వైసీపీకి అందుతోందనిపిస్తోందిట. దాంతో జనసేనలో అంతర్మధనం మొదలైందని అంటున్నారు.

నీరు కార్చేశారా…?

నిజానికి బీజేపీ, జనసేన పొత్త్తుతో మొదట టీడీపీ చిత్తు అనుకున్నారు. కానీ ఇపుడు కూడా ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్యనే రాజకీయ సమరం సాగుతోంది. మరో వైపు చూసుకుంటే జనసేన గొంతు గతంలో పెద్దగా ఉండేది. ప్రతీ దాని మీద వారి అభిప్రాయం చెప్పేవారు. పొత్తుల పుణ్యమాని జనసేన బీజేపీ వైపు చూస్తోంది. ఉమ్మడి పోరాటాలు అంటూ బీజేపీ చేసింది కూడా ఏమీ లేదు. దాంతో జనసేనకు కూడా ఏపి పొలిటికల్ తెర మీద స్పేస్ తగ్గిపోతోందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. బీజేపీతో పొత్తు తో వెలిగిపోవాలనుకున్న రాజకీయం కాస్తా ఇపుడు ఒక్కసారిగా కాంతులు తగ్గిపోవడాన్ని జనసైనికులు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరి దీని మీద జనసేనాని పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News