బీజేపీ టీడీపీ పొత్తుకు పవనే అడ్డంకి…?

అవును మరి. నిన్నటిలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు, అదే రాజకీయ విచిత్రం. ఏపీలో చూసుకుంటే పేరుకు మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం పోటీ [more]

Update: 2021-04-16 00:30 GMT

అవును మరి. నిన్నటిలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు, అదే రాజకీయ విచిత్రం. ఏపీలో చూసుకుంటే పేరుకు మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి కానీ విడిగా ఉంటే వేటికవే అన్నట్లుగా చాలీ చాలని ఓట్లతో వైసీపీ ముందు ఓడిపోతున్నాయి. మరి విపక్షం ఓట్లు చీలకుండా ఉండాలంటే పొత్తులు ఉండాల్సిందే అన్న మాట అయితే ఈ మధ్య బలంగా వినిపిస్తోంది. అది కూడా టీడీపీ వైపు నుంచి ఎక్కువగా వస్తోంది.

పవన్ కి ప్రమోషన్….

ఏపీలో పవన్ కల్యాణ‌్ ఇపుడు అటు బీజేపీకి, ఇటు టీడీపీకి కూడా చాలా కావాల్సిన మనిషి అయిపోయాడు. సరిగ్గా సంస్థాగత నిర్మాణం లేని పార్టీ జనసేన. అయినా పవన్ వెంట ఈ రెండు పార్టీలు పడుతున్నాయంటే ఆయన సినీ గ్లామర్ తో పాటు సామాజిక ఓట్ల కోసమే అన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ‌్ ను టీడీపీ వైపు మళ్ళించే ప్రయత్నం తెలుగుదేశం అనుకూల శక్తులు చేస్తున్నాయి అన్న ప్రచారంతో బీజేపీ ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయింది. అంతే పవన్ కి ప్రమోషన్ ఇచ్చేసింది. ఆయన్ని కాబోయే సీఎం అంటూ కొత్త ట్యాగ్ తగిలించేసింది. దాంతో ఇపుడు పవన్ కల్యాణ‌్ గురించి ఆలోచించాలంటేనే టీడీపీకి దడ పుట్టేలా ఉందిట.

ఇరకాటంలో టీడీపీ ….

ఇక ఏపీలో పవన్ కల్యాణ‌్ ఫ్యాక్టర్ బాగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. పవన్ తో పొత్తు ఉంటే గెలుపు మాట పక్కన పెడితే దారుణమైన ఓటమి నుంచి తప్పించుకోవచ్చు అన్న రాజకీయ తెలివిడి కూడా టీడీపీ పెద్దలకు ఇపుడిపుడే కలుగుతోంది. పవన్ కల్యాణ‌్ విడిగా పోటీ చేస్తే చీల్చే ప్రతీ ఓటూ టీడీపీదే అన్న నగ్న సత్యం కూడా వారి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ‌్ తో పొత్తు అని ఇపుడు టీడీపీ ఆహ్వానిస్తే ఆయన ఎలా స్పందిస్తారు అన్న మీమాంస కూడా ఉంది. పవన్ కాబోయే సీఎం అని బీజేపీ అంటోంది. మరి టీడీపీ వైపు పవన్ కల్యాణ‌్ వస్తే సైకిల్ ఆయన ఎంత తొక్కినా కూడా అక్కడ సీఎంలు అయ్యేది మాత్రం కచ్చితంగా చంద్రబాబు, లోకేష్ బాబు తప్ప మరొకరు కారు. ఈ సంగతి తెలిసి కూడా పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అన్నదే ప్రశ్న.

అలా చేస్తేనే పొత్తు ….?

అయితే ప్రతీ సమస్యకూ ఒక పరిష్కారం ఉంది. అలాగే ఏపీలో పవన్ కల్యాణ‌్ తో పొత్తు పెట్టుకోవాలి అంటే కనుక టీడీపీ కొన్ని త్యాగాలు చేయాలి. రేపటి రోజున టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా పవన్ కల్యాణ‌్ కి రెండున్నర ఏళ్ళు అయినా సీఎం పదవి అప్పచెప్పాల్సిందే. అలా కనుక టీడీపీ పెద్దలు అప్పగించడానికి రెడీ అయితే 2014 నాటి ఈ పొత్తులు మళ్ళీ పొడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. ఎటూ సీఎం సీటు పంచుకోవడం అంటూ మొదలుపెడితే బీజేపీ నుంచి కూడా వాటా కోరే వారు కూడా ఉంటారు. మొత్తానికి అందరికీ సీఎం సీటు పంచేసి తాను అరకొర కాలానికే గద్దె మీద కూర్చోవడానికి టీడీపీ సిద్ధపడాల్సి ఉంటుంది. అలా అయితేనే మూడు పార్టీలతో బలమైన కూటమికి ఏపీలో చాన్స్ ఉంటుందని అంటున్నారు. కాబోయే సీఎం ట్యాగ్ కాదు కానీ పవన్ కల్యాణ‌్ ఇపుడు పెద్ద వాటాదారు అయిపోతున్నాడు అంటున్నారు.

Tags:    

Similar News