వెయిటింగ్ లో టీడీపీ … వదిలేందుకు సిద్ధంగా లేని బీజేపీ

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే రీతిలో ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి. బిజెపి ఆహ్వానించకుండానే అమరావతి రైతులకు న్యాయం కోసం అంటూ ఆయన కేంద్రంలోని బిజెపి [more]

Update: 2021-04-12 02:00 GMT

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే రీతిలో ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి. బిజెపి ఆహ్వానించకుండానే అమరావతి రైతులకు న్యాయం కోసం అంటూ ఆయన కేంద్రంలోని బిజెపి పెద్దలను కలిసి ఆ పార్టీ తో పొత్తు ప్రకటన చేసేసారు. కట్ చేస్తే ఆ తరువాత ఎపి విషయంలో బిజెపి చేస్తున్న రాజకీయ విన్యాసాలతో జనసేన కు ఉన్న ఓటు బ్యాంక్ మరింత పలచబడిందన్నది ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు చెప్పక చెప్పేశాయి. ఒక పక్క ప్రత్యేక హోదా అంశంలో కానీ, పోలవరం అంశంలో కానీ, విశాఖ స్టీల్ ప్రవేటీకరణ అంశంలో కానీ, రైల్వే జోన్ విషయం లో కానీ చివరికి కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలపై చూపిన ప్రేమ ప్రత్యక్షంగా చూసిన పవన్ కల్యాణ్ ఇక లాభం లేదని డిసైడ్ అయ్యిపోయారు. మరో పక్క టిడిపి పవన్ ఎప్పుడు కాషాయాన్ని వదిలేసి తమవైపు వస్తారా అని వేయికళ్లతో ఎదురు చూస్తుంది.

తెలంగాణ తో శ్రీకారం …

బిజెపి లో గౌరవం లేదని వారికి తెలిసి రావాలంటే టీఆరెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ ప్రధాని కుమార్తె వాణీ దేవి ని గెలిపించాలంటూ పోలింగ్ ముందు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దాంతో అవాక్కయిన టి బిజెపి వివరణలు ఇచ్చుకున్నా జరగాలిసిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలే తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ప్రకటన తో ఇరకాటంలో పడిన కమలం ఎలాగోలా ఆయన్ని ప్రసన్నం చేసుకునే పని లో సక్సెస్ అయ్యింది. ఈలోగా జనసేన శ్రేణులు అధినేత మనసులో ఉద్దేశ్యం గ్రహించి బిజెపి కి మింగుడు పడని వ్యాఖ్యలతో రాజకీయాన్ని మరింత వేడెక్కించారు.

పువ్వులా చూసుకోవాలి …

తిరుపతి ఎన్నికల్లో జనసేన ఓట్లు బిజెపి కి బదిలీ కాకపోతే ఘోరపరాజయం తప్పదు. ఈ నేపథ్యంలో బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయం గా మారాయి. పవన్ కళ్యాణ్ గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా బిజెపి శ్రేణులు నడుచుకోవాలని సోము పార్టీ సమావేశంలో ఆదేశించేశారు. అంతే కాదు ఆయన్ను ఒక పువ్వును చేసుకున్నంత సున్నితంగా చూసుకోవాలంటూ చెప్పడం గమనార్హం.

సిఎం ను చేయాలి …

అక్కడితో సోము ఆగలేదు. ఎపి లో పవన్ కల్యాణ్ ను ఉన్నతమైన పదవిలో కూర్చో పెట్టాలంటూ అధిష్టానం చెప్పిందని ప్రధాని మోడీకి సైతం పవన్ అంటే చాలా ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా పవన్ కల్యాణ్ ను ప్రసన్నం చేసుకోవడం తో పాటు ఆయన కమలాన్ని కాదని సైకిల్ ఎక్కేయకుండా బిస్కట్ వేశారన్న అనుమానాలు రెండు పార్టీల్లో వినిపిస్తున్నాయి. కొద్ది కాలం క్రితమే ఎపి కి బిసిని ముఖ్యమంత్రి చేస్తామంటూ సోము చేసిన ప్రకటన తరువాత తాజాగా అయన జనసేనానికే పట్టాభిషేకం అని చెప్పడం చూస్తే బిజెపి అవసరార్ధం అజండా మార్చిందా అనే సందేహాలు సహజమే.

Tags:    

Similar News