ఇద్దరి పొత్తు వెనక గమ్మత్తు అదేనా…?

ఏపీలో కూటమిగా ముందుకు వచ్చిన బీజేపీ జనసేన అద్భుతమైన ప్రదర్శన చేస్తారని ఎవరూ అనుకోకపోయినా తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో మరీ అంత పేలవమైన పనితీరు [more]

Update: 2021-03-30 09:30 GMT

ఏపీలో కూటమిగా ముందుకు వచ్చిన బీజేపీ జనసేన అద్భుతమైన ప్రదర్శన చేస్తారని ఎవరూ అనుకోకపోయినా తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో మరీ అంత పేలవమైన పనితీరు కనబరుస్తారని మాత్రం అసలు ఊహించలేదు. అది కూడా ఏపీలో చాలా వేగంగా టీడీపీ పతనం అవుతున్న సమయంలో ఈ రెండు పార్టీలు ఎంత దూకుడుగా ఉండాలి. పైగా కేంద్రంలో మోడీకి క్రేజ్ ఉంది. బీజేపీకి అధికారం ఉంది. ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఎవరి అంచనాలకు అందనంతగా సినీ గ్లామర్ ఉంది. సామాజికవర్గం పరంగా కూడా ఎంతో బలం ఉంది. ఇలా అన్ని సమీకరణలు కుదిరినా ఎందుకీ కూటమి రాంగ్ రూట్లో వెళ్తోంది అన్నది ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

పవన్ అవసరం అది ….

ఇక బీజేపీతో పొత్తు వద్దు అని జనసైనికులు ఎంతగా మొత్తుకున్నా కూడా అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కొనసాగించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే ఒక రాజకీయ పార్టీని నడపాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కదిలించాలంటే తలకు మించిన భారమే. ఎన్నో సార్లు అధికారం అనుభవించిన తెలుగుదేశం విపక్షంలోకి రాగానే ఎలా జావగారుతోందో అందరూ చూస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నడపడానికి బీజేపీ మీద ఆధారపడుతున్నారు అన్న ప్రచారం ఉంది. అదే సమయంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ దూకుడు తట్టుకోవాలంటే కేంద్రంలో బీజేపీ అండ అవసరం. అందుకే పవన్ తెలివిగానే ఈ పొత్తు కుదుర్చుకున్నారు అని అంటారు.

గ్లామర్ కోసమే….?

ఇక పవన్ కళ్యాణ్ తో పొత్తు బీజేపీకి అవసరం ఎలా ఉంది అంటే రాజకీయంగా ఆయనకు అనుభవం తక్కువ. దాంతో పాటు బీజేపీ పెద్దన్న వైఖరితో తనకు అనుకూలంగా ఏపీ రాజకీయాలను తిప్పుకోవచ్చు. అదే వేరే పార్టీలతో అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, ఆయన సామాజికవర్గం కూడా బీజేపీకి కావాలి. పవన్ నిరాజకీయంగా తమ్ముడిని చేసి తమ పెత్తనం సాగించుకోవాలంటే కూడా ఈ పొత్తే బెటర్ అన్నది కమలనధుల ఎత్తుగడ. ఇలా బీజేపీ మంచి ప్లాన్ తోనే పవన్ని చేరదీసింది.

అక్కడే ఇబ్బంది…

రెండు పార్టీల మధ్య ఏడాది క్రితమే పొత్తు కుదిరింది. అయితే బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా మౌల్డ్ కాలేకపోతున్నారు. అలాగే బీజేపీ నుంచి తాను కోరుకున్న సహకారం దక్కడంలేదని పవన్ కళ్యాణ్ బాధగా ఉంది. ఇలా అనుమానాలు అపార్ధాలు బోలేడు ఈ ఏడాది కాలంలో కూడా రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్నాయి. తిరుపతి ఉప ఎన్నికతో అవి మరింత పెరిగి పెద్దవి అయ్యాయి. అయినా సరే ఇప్పటికిపుడు ఈ రెండు పార్టీలు విడిపోయే చాన్స్ అయితే లేదు అంటున్నారు. ఏపీలో బీజేపీతో విడిపోతే పవన్ కళ్యాణ్ ఏకాకి అవుతారు. టీడీపీ తో జట్టు కట్టినా కూడా అక్కడ లోకేష్ రూపంలో సీఎం సీటుకు పోటీ ఉంది. బీజేపీతో పొత్తు అయితే తానే చరిష్మాటిక్ లీడర్. ఇలా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నాయి. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ తో పొత్తు తెంచుకుంటే ఏపీలో తమ మాట వినే పార్టీ మరేదీ ఉండదు అని బాగా తెలుసు. అందుకే ఒక్కోసారి తగ్గినట్లుగా తగ్గి పవన్ ని దారికి తెస్తోంది. ఈ పొత్తు ఇలాగే మరికొన్నాళ్ళు సాగుతుంది అంటున్నారు. దానికి కారణం ముందే చెప్పుకున్నట్లుగా ఎవరి అవసరాలు వారివి.

Tags:    

Similar News