టైంపాస్ చేస్తే కుదరదప్పా

సినిమా నటుడిగా మంచి స్థాయిలో ఉండి రాజకీయల్లో పవన్ కల్యాణ్ ప్రవేశించారు. అది కూడా 2008లో ప్రజారాజ్యంలో సహాయ పాత్రలో, 2014 నాటికి మల్టీ స్టారర్ పాత్రలో, [more]

Update: 2019-08-17 03:30 GMT

సినిమా నటుడిగా మంచి స్థాయిలో ఉండి రాజకీయల్లో పవన్ కల్యాణ్ ప్రవేశించారు. అది కూడా 2008లో ప్రజారాజ్యంలో సహాయ పాత్రలో, 2014 నాటికి మల్టీ స్టారర్ పాత్రలో, 2019 నాటికి సోలో హీరోగా పవన్ కల్యాణ్ రాజకీయ తెరపై దర్శనం ఇచ్చారు. అంటే ఓ విధంగా చెప్పాలంటే పవన్ రాజకీయాల్లో పదకొండేళ్ల అనుభవం కలిగిన నేతగా చెప్పుకోవాలి. మరి ఇంత అనుభవం గడించిన పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో కూడా ఎందుకు ఓడిపోయినట్లు. 140 వరకూ అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి ఒకే ఒక్క సీటు ఎందుకు గెలుచుకున్నట్లు. ఈ ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఎపుడైనా వెతుక్కున్నారా..? ఇక పవన్ కల్యాణ్ రాజకీయం చేయాల్సింది తాను స్థాపించిన పార్టీ కోసం. ఎవరి కోసమో కాదు. ఈ సత్యమైనా పవన్ కల్యాణ్ గుర్తించారా…?

అదే అయోమయం….

పవన్ కల్యాణ్ ప్రకటలు ఎపుడూ గందరగోళంగానే ఉంటున్నాయి. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఒకసారి, వద్దు అని మరోసారి అంటారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది వెంటనే అధికారం పట్టేయడానికి కాదు అని అంటారు. అంతలోనే నేను తలచుకుంటే అధికారం నా పాదాక్రాంతం అంటారు. ఇక నా చుట్టూ ఎవరూ బలమైన నాయకులు లేకపోవడం వల్లనే నేను ఓడిపోయాయని అంటారు, అదే పవన్ కల్యాణ్ మరో మాటలో ఎవరు ఉన్నా పోయినా నిబధ్ధతతో పనిచేసే కార్యకర్తలు పిడికెడు మంది ఉన్నా చాలు, ఉప్పెన పుట్టిస్తాను అంటారు. మరి ఇదంతా అభిమానుల‌ వరకూ బాగానే ఉండొచ్చు కానీ సాధారణ జనానికి మాత్రం ఏంటి ఇంత అయోమయం అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ చెప్పేదానిలో క్లారిటీ మిస్ అవుతున్నారు, లాజిక్ మిస్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ఓ కచ్చితమైన విధానం అనుసరిస్తున్నట్లుగా కనిపించదు. మరి ఈ వైఖరి పవన్ కల్యాణ్ మార్చుకోగలరా…?

జగన్ ని వదిలేస్తే బెటర్….

జగన్ విషయాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి తన పార్టీ గురించి ఆలోచన చేయడం బెటర్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ విషయమే తీసుకుంటే ఆయన్ని జనం ముఖ్యమంత్రిని చేశారు. ఆయన తప్పులు చేస్తే అపుడు అదే జనం ఏం చేయాలో చూసుకుంటారు. ఆ సమయానికి నేను సరైన ప్రత్యామ్నాయంగా ఉన్నాను అని పవన్ కల్యాణ్ పార్టీ జనసేన జనం మదిలో మెదలాలి అంటే పవన్ కల్యాణ్ పక్కాగా కార్యాచరణ ఇప్పటి నుంచే రూపకల్పన చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఓడిపోయాం అన్న దాని మీద చర్చ అవసరమే. అదే సమయంలో ఎదుటి పక్షం మీద నిందలు వేస్తూ టైం పాస్ చేస్తే అనుకున్న గమ్యానికి చేరలేరు. ఈ సత్యాన్ని పవన్ కల్యాణ్ ఎంత తొందరగా గుర్తిస్తే అంత త్వరగా ఆయన జనసేన పార్టీకి బలమైన పునాదులు పడతాయి.

Tags:    

Similar News