పవన్ తో నష్టం వీరికే....!

Update: 2018-09-29 15:30 GMT

జన సేనాని పవన్ కల్యాణ్ కు రాజకీయ చేదు నిజాలు ఒక్కటొక్కటిగా అర్థమవుతున్నాయి. రాష్ట్రాన్ని చుట్టుముట్టేసి పర్యటనలు జరిపినంతమాత్రాన అధికారం చేజిక్కదని తనంతతానుగా చెబుతున్నారు. ఇప్పటికే పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీల పోరులో తమది తృతీయ పక్షమేనని అంగీకరిస్తున్నారు. పార్టీలో క్యాడర్, అభిమానులు అంగీకరించడానికంటే ముందే నాయకునిగా తన బలాలు, బలహీనతలు, పరిధులపై స్పష్టత ఏర్పరచుకుంటున్నారు. జనసేనకు ఒక సామాజిక వర్గంలో మాత్రమే బలమైన మద్దతు లభిస్తోంది. మిగిలిన వర్గాల్లోకి ఇంతవరకూ పట్టు చిక్కడం లేదన్న విషయాన్ని సైతం గ్రహించారు. తాను వ్యూహకర్తగా నియమించుకున్న వ్యక్తి చేసిన సర్వేల సారాంశం ఇటీవలనే పవన్ వద్దకు చేరినట్లు సమాచారం. మొదట్లో అనుకున్నంతటి పాజిటివ్ ఫలితాలు అందులో కనిపించకపోవడం ఆశ్చర్యపరిచిందనే చెబుతున్నారు. ఆ గణాంకాలు జీర్ణించుకోవడం కష్టమే అయినప్పటికీ క్రమేపీ అర్థం చేసుకున్నారని సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఫలితంగా చెప్పకనే నిజాలు పవన్ నోటి వెంట వెలువడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దిగి వస్తున్నట్లే...

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. అందువల్ల ఆ పార్టీ వాస్తవిక బలం ఎంతమేరకు ఉంటుందనేది ఎవరికీ తెలియదు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆ బలం ఉపయోగపడిందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. త్రిముఖ పోటీ జరిగితే తాము అధికారంలోకి వచ్చే సంఖ్యలో సీట్లు సాధిస్తామని జనసేన నాయకులు ఏడాదికాలంగా చెబుతూ వచ్చారు. సామాజిక వర్గ పరంగా కాపు,తెలగ,బలిజ,ఒంటరి కులాల సంఖ్య జనాభాలో 20 శాతం మేరకు ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పటికే రిజర్వేషన్ కోటా లో ఉన్న ఉత్తరాంధ్ర లోని సామాజిక వర్గాన్ని మినహాయిస్తే మిగిలిన సంఖ్య 15 శాతానికే పరిమితం కావొచ్చు. ఈ సామాజిక వర్గంలో మూడింట రెండు వంతుల ఓట్లు జనసేనకే వేసినప్పటికీ మొత్తం ఓట్లలో 10 శాతం దాటదు. మిగిలిన వర్గాల ఓట్లను ఎంతమేరకు రాబట్టుకుంటామన్నదానిపై ఆధారపడే జనసేన సక్సెస్ రేటు అంచనా వేయవచ్చు. ఆయా విషయాలపై క్షేత్రస్థాయి అంకెలను, గణాంకాలను, ప్రజాస్పందనను పవన్ తెలుసుకుంటున్నారు. వాటి ఆధారంగానే జనసేనాని తాము 2019 ఎన్నికల్లో కొంతమేరకే ప్రభావం చూపగలమని అంచనా వేసుకుంటున్నారనేది పార్టీ వర్గాల సమాచారం.

నాడు కాదు..నేడు...

2009లో ప్రజారాజ్యం రంగంలోకి దిగినప్పుడు చిరంజీవి మంచి ఇమేజ్ తో ఉన్నారు. మెగా ప్యామిలీ మొత్తం పనిచేసింది. కాంగ్రెసు ప్రభుత్వంపై అవినీతి ముద్రలు బలంగా పడ్డాయి. తెలుగుదేశం పుంజుకోలేదు. ఈ స్థితిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. దాంతో రికార్డు స్థాయిలో అధికారంలోకి వస్తారని ఆశించారు. చిరంజీవికి ఉన్న క్లీన్ ఇమేజ్, ఎన్టీయార్ తర్వాత తిరిగి ఒక సినీతార ముఖ్యమంత్రి కాబోతున్నారన్నంత ప్రచారం సాగింది. కానీ పరిస్థితులు తిరగబడ్డాయి. 17 శాతం ఓటింగుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. చిరంజీవితో పోలిస్తే పవన్ కు అభిమానుల్లో క్రేజ్ ఎక్కువే. కానీ 2009 నాటి ఓటింగులో వివిధ వర్గాల నుంచి ప్రజారాజ్యానికి ఆదరణ లభించింది. ప్రస్తుతం జనసేనకు ఆనాటి పరిస్థితులు కనిపించడం లేదు. పైపెచ్చు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండూ బలంగా ఉన్నాయి. పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. కులపరమైన సమీకరణలు కూడా బలపడిపోయాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఇతరపార్టీలకు ఓట్ల చీలిక బాగా తక్కువగా ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా. బీసీలు టీడీపీ వైపు మొగ్గు చూపుతుంటే, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓటింగు వైసీపీవైపు ఉన్నట్లుగా ఇటీవలి పార్టీ సర్వేల్లో వెల్లడైంది. అందువల్ల కాపు సామాజిక వర్గాన్ని , అభిమానులను మినహాయించి సొంతంగా ఓటు బ్యాంకును సృష్టించుకోవడం జనసేనకు అంతసులభం గా కనిపించడం లేదు.

సెంటిమెంటు కార్డు...

పవన్ కల్యాణ్ సెంటిమెంటు కార్డునూ పైకి తీస్తున్నారు. తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలో రెండో విడత పర్యటనలో ఉన్న పవర్ స్టార్ తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. సానుభూతి పవనాలను పొందే యత్నమే ఇదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ పార్టీ గెలుపు సాధించి అధికారంలోకి రావడం కష్టమనీ తేల్చేశారు. అయితే టీడీపీ, వైసీపీలు రెండూ బలంగా లేవు. అధికారంలో ఎవరుండాలని తేల్చేది తమపార్టీయే అని చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద కింగ్ కావాలనుకున్న భావన నుంచి కింగ్ మేకర్ గా మారితే చాలు అన్న సర్దుబాటు ధోరణికి జనసేనాని సెటిల్ అయిపోయినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇందుకు కనీసం 15 స్థానాలైనా చేతిలో లేకపోతే జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికిగాను బలమైన నియోజకవర్గాల అన్వేషణ సాగుతోంది. ఏదేమైనా పవర్ స్టార్ పంచ్ అధికార, ప్రతిపక్షాలను కట్టడి చేసే పగ్గంగా మారుతుందోలేదో భవిష్యత్తే తేల్చి చెప్పాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News