ఆ ‍స్కోప్ ఉందంటారా?

బిజెపి – జనసేన ఏపీ లో ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ప్రకటించాయి. వీరిద్దరి ప్రకటనతో ఆ స్కోప్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ లో ఉందా [more]

Update: 2020-01-18 00:30 GMT

బిజెపి – జనసేన ఏపీ లో ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ప్రకటించాయి. వీరిద్దరి ప్రకటనతో ఆ స్కోప్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ లో ఉందా అనే చర్చ మొదలైంది. తెలుగు రాజకీయాలను గతం నుంచి పరిశీలిస్తే ఇక్కడ రెండే పక్షాలు అమీతుమీకి సిద్ధం అవుతుండటం ఎదో ఒక పక్షానికి ప్రజలు మద్దతు పూర్తిగా కట్టబెట్టడమే జరుగుతూ వస్తున్న నేపధ్యం కనిపిస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం నుంచి పరిశీలించినా ఎపి రాజకీయాల్లో మూడో కూటమిని జనం ఆదరించలేదు. బిజెపి కి ఎపి లో ఎదిగే అవకాశం లభిస్తున్న తరుణంలో టిడిపి ఆవిర్భావం ఆ పార్టీ ఆశలపై పూర్తిగా నీళ్ళు చల్లేసింది.

వాజ్ పేయి, మోడీ గాలిని…

ఆ తరువాత వాజ్ పేయి గాలి ఏపీలో వీచినప్పుడు చంద్రబాబు ఆ అవకాశం వారికి దక్కకుండా పూర్తిగా తానే వినియోగించుకుని ఆ పార్టీ ఎదుగుదలను పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. ఇదే రకంగా 2014 లో తిరిగి మోడీ హవాతో కమలం పుంజుకునే దశలో చంద్రబాబు ఆ గాలిని తనకు అనుకూలంగా మార్చుకుని ఆ పార్టీని విజయవంతంగా జీరో చేశారు. ఇలా గత చరిత్ర అంతా బిజెపి కి గతుకులమయంగానే ఎపి లో సాగింది. ఇప్పుడు తాజాగా జనసేన తో పొత్తుతో ఎపి లో పార్టీని పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనలో కమలం కసరత్తు సాగుతుంది. ఈ ప్రయత్నం ఎలా వుండబోతుందన్న ఆసక్తి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారితీసింది.

ప్రజారాజ్యం, జనసేన…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా కమ్మ, రెడ్డి పాలిటిక్స్ గా మారిపోయాయని బలమైన కాపు సామాజికవర్గంతో తృతీయ ప్రత్యామ్నాయం సాధ్యమే అని రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆయన అనుకున్నది ఒకటి ప్రజాక్షేత్రంలో జరిగింది మరొకటి అయ్యింది. కేవలం 18 స్థానాలే ప్రజారాజ్యానికి లభించగా ఒక్క ఎంపి సీటు ఆ పార్టీకి దక్కలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తన పార్టీని ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసుకుని వారితో ఒప్పందం లో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా, మంత్రి పదవులతోసరిపెట్టుకున్నారు. ఆ తరువాత 2014 లో పవన్ ఇదే భ్రమలో పార్టీని స్థాపించారు. అయితే ఆయన పై వచ్చిన వత్తిడి కారణంగా అనూహ్యంగా బిజెపి – టిడిపి లతో చేతులు కలిపి ఆ కూటమి విజయంలో తనపాత్ర ఉందనిపించుకున్నారు.

దెబ్బతీసిన పవన్ నిర్ణయం …

వైసిపి ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పవన్ నాడు తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిందనే వాదన వుంది. టిడిపి – వైసిపి లపై అసంతృప్తి కాంగ్రెస్ – బిజెపి లపై మంట తో రగిలిపోతున్న ఎపి వాసులు నాడు జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే అధికారం ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా చేసి ఉండేవారని ఇప్పటికి విశ్లేషకులు వాదిస్తారు.

తక్కువ సీట్లు వచ్చినా సిఎం అవ్వొచ్చని …

ఆ తరువాత 2019 లో కర్ణాటక ఇతర రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనించిన జనసేనాని సొంతంగా పోటీ చేసి కొన్ని సీట్లు దక్కించుకున్నా ఎదో ఒక పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలనని విశ్వసించి చారిత్రక తప్పిదం చేసి పార్టీ మనుగడనే ప్రశ్నార్ధం చేశారు. పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు కావడమే కాకుండా ఆయన లోపాయికారీగా మద్దతు ఇచ్చిన టిడిపి ని కూడా నామరూపాలు లేకుండా చేసింది. అంతే కాదు వైసిపికి 151 అఖండ సీట్లు దక్కడం 22 ఎంపి స్థానాలను దక్కేలా 7శాతం ఓట్లకు ఒక్క అసెంబ్లీ సీటుకు జనసేన ను పరిమితం చేసేలా పరిణమించింది. ఈ విషాద ఓటమి నుంచి తేరుకుని తమ పార్టీ మనుగడకు తాను సుదీర్ఘ రాజకీయాలు చేయాలన్నా కమలం తో దోస్తీ తప్ప మరో దారి పవన్ కల్యాణ్ కి కనిపించేలా లేకుండా చేసింది.

ఇప్పుడు ఎవరో ఒకర్ని తొక్కితే కానీ …

ఎపి రాజకీయాలు నేర్పుతున్న పాఠం నేపథ్యంలో బిజెపి – జనసేన కూటమి మూడో ప్రత్యామ్నాయం కావాలి అంటే టిడిపి – వైసిపిలలో ఎవరో ఒకర్ని పూర్తిగా భూస్థాపితం చేయాలిసిందే. అయితే అది అంత సులభమైన విషయమేమి కాదు. నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు సారధ్యంలోని టిడిపి ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితం అయినా ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. బాబు రాజకీయ చదరంగం ఆడుతున్నంత కాలం ఆయనకు ఏపీ లో తిరుగులేదని వాదన వుంది. దీనికి తోడు టిడిపి కి 13 జిల్లాల్లో పటిష్టమైన క్యాడర్ ఉండటం తో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట నుంచి నిష్క్రమించే అవకాశం ఇప్పట్లో లేదనే వారే ఎక్కువ.

కలలు నెరవేరుతాయా?

ఇక వైసిపి విషయానికి వస్తే వైఎస్ ముఖ్యమంత్రిగా వేసిన సంక్షేమ పథకాల పునాదిని వైసిపి అధినేత జగన్ సమర్ధంగా వినియోగించుకుని పదేళ్ళు ఒంటరి పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీకి చరిత్రలో ఎవ్వరికి దక్కని విజయాన్ని ప్రజలు అందించారు. దీనికి తోడు పటిష్టమైన ఓటు బ్యాంక్ వైసిపి సొంతమని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందినా బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుంది తప్ప పార్టీ స్కూల్ మూసివేసే ఛాన్స్ లు మాత్రం లేవనే అంటున్నారు. జగన్ పై కేసులు తొందరగా తేల్చి ఆయన్ను జైల్లో వేసినా వైసిపిని అణగదొక్కడం అయ్యే పనేమీ కాదని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి – జనసేన కలలు నెరవేరుతాయా లేక పగటి కలలు గానే మిగిలిపోతాయా అన్నది కాలమే చెప్పాలి.

Tags:    

Similar News