ఇప్పటి వరకయితే ఇంతేనట

అన్నగారు అంటే నందమూరి తారకరామారావు అనుకునేరు. కానీ ఇక్కడ అన్నగారు వేరు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఆయన బాటలో తమ్ముడు పవన్ నడుస్తున్నాడని అంటున్నారు. నిజమే చిరంజీవికి [more]

Update: 2020-01-16 09:30 GMT

అన్నగారు అంటే నందమూరి తారకరామారావు అనుకునేరు. కానీ ఇక్కడ అన్నగారు వేరు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఆయన బాటలో తమ్ముడు పవన్ నడుస్తున్నాడని అంటున్నారు. నిజమే చిరంజీవికి నిదానత్వం ఎక్కువే. కానీ రాజకీయంగా ఆయన క్విక్ డెసిషనే తీసుకోగలిగారు. పవన్ దూకుడెక్కువ. కానీ ఆయన తొందరగా కాకుండా తాపీగా అయినా కూడా అన్న గారు రూటు కరెక్ట్ అనుకుంటున్నారుట. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు అంశం. నిజానికి పేరుకు పొత్తు అంటున్నా ఇది విలీనం కోసం ముహూర్తం వెతకడమేనని కూడా ప్రచారం సాగుతోంది.

కొన్నాళ్ళు ఇలా….

మొదటే విలీనం అంటే జనసేనలో ఉన్న కొంతమంది నాయకులు ఒప్పుకోరు అన్న మాట కూడా వినిపిస్తోంది. నిజానికి పవన్ కల్యాణ్ పొలిటికల్ లైఫ్ కొనసాగించడానికే బీజేపీకి దగ్గర అవుతున్నాడని కూడా అంటున్నారు. 2019 ఎన్నికలలోనే జనసేన కధ సమాప్తం అయిందని, పవన్ పార్టీ దారుణంగా ఓటమి పాలు కావడంతో పాటు, ఆయన కూడా రెండు చోట్ల ఓడిపొయారని, దాంతోనే రాజకీయంగా ఆ పార్టీ నుంచి అద్భుతాలు చేయలేమన్న సంగతి పవన్ కి అర్ధమైందని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ‌్ తో పాటు వెంట ఉండే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా జనసేనను బీజేపీతో విలీనానికే మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి పొత్తుగా చెప్పుకుంటూనే తొందరలోనే విలీనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

అధికార పార్టీలో….

పవన్ కల్యాణ‌ అధికారాన్ని 2014లో పరోక్షంగా ఎంజాయ్ చేశారు కానీ 2019 నాటికి ఆయన డైరెక్ట్ గానే పవర్ రుచి చూడాలనుకున్నారు. అయితే కాలం కలసిరాకపోవడం వల్ల ఆయన ఓడిపోయారు. పైగా సరైన వ్యూహాలు లేకపోవడం, ఏపీ రాజకీయాల్లో తానే తురుపు ముక్క అవుతానని ఊహించుకోవడం వల్లనే పవన్ కల్యాణ్ అలా ఒంటరి పోరుకి దిగి బొక్క బోర్లా పడ్డారని అంటున్నారు. ఇక ఇపుడు మాత్రం పవన్ కల్యాణ్ అయిదేళ్ళ పాటు వెయిట్ చేసే ఓపికతో లేరని అంటున్నారు. ఓ వైపు చూస్తే ఏపీలో వైసీపీ బలంగా ఉంది. మరో వైపు టీడీపీ రెండవ పక్షంగా ఉంది. ఎంత పోరాడినా మళ్ళీ చేదు ఫలితాలే వస్తాయని ఊహించిన మీదటనే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చెలిమి చేస్తున్నారని అంటున్నారు.

చెగువీర నుంచి…

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో విప్లవవీరుడు చెగువీరా పేరు పదే పదే తలచేవారు. నిన్నటి ఎన్నికల వరకూ కూడా ఆయన వామపక్ష భావజాలం ఎక్కువగా వల్లించేవారు. అందుకే ఆయన 2019 ఎన్నికల్లో కామ్రేడ్స్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇపుడు హఠాత్తుగా బీజేపీ వైపు రావడం అంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్లేనని విమర్శలు వస్తున్నాయి. ఎవరెన్ని అనుకున్నా పవన్ రాజకీయ భావజాలం ఇదీ అని ఇంతవరకూ ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఇక సామాజిక న్యాయం అంటూ చిరంజీవి వచ్చి కాంగ్రెస్ లో తన పార్టీని కలిపేశారు, ఇపుడు కొత్త రాజకీయం అంటూ జనసేనను స్థాపించిన పవన్ కూడా బీజేపీలో ఏదో ఒక రోజు తన పార్టీని విలీనం చేస్తారని అంటున్నారు. దానికి ప్రాతిపదికగానే పొత్తుల పేరిట కొత్త రాజకీయ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాజకీయంగా అన్నగారు చూపిన మార్గమే ఇపుడు తమ్ముడు పవన్ కల్యాణ్ కి శిరోధార్యం కావడం విశేషమే.

Tags:    

Similar News