పవన్ బలం తెలిసే దిగారా? లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమాన జనం పూనకాలు వచ్చి ఊగిపోవడం సర్వ సాధారణం. పవన్ కళ్యాణ్ అంటే అంత ఆదరణ [more]

Update: 2020-05-31 00:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమాన జనం పూనకాలు వచ్చి ఊగిపోవడం సర్వ సాధారణం. పవన్ కళ్యాణ్ అంటే అంత ఆదరణ ఉంది. అయితే ఇదంతా రీల్ హీరో వరకే. రియల్ గా రాజకీయాల్లోకి పవన్ వస్తే ఆయన్ని రెండు చోట్లా ఇదే అభిమానులు ఓడించారు. అంటే పవన్ కళ్యాణ్ ని సినిమా నటుడిగానే చూడడానికి వారు ఇష్టపడుతున్నాట్లుగా అర్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ కి ఆ సంగతి తెలిసే సినిమాలకు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారని అంటారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే పవన్ లో ఇంకా పొలిటికల్ మెటీరియల్ చాలా ఉందని, ఆయన సరిగ్గా వాడుకోలేక వదిలేస్తున్నాడని కమలనాధులు గట్టిగానే నమ్ముతున్నారుట. అందుకే పవన్ కళ్యాణ్ తో జత కడితే ఆయన సినిమాటిక్ చరిష్మాను రాజకీయాలకు పెట్టుబడిగా పెట్టి ఓట్ల పంట పండించుకోవచ్చునని వ్యూహాలు రచిస్తున్నారు.

విశేషమే మరి….

బండి సంజయ్, తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్, యువకుడు, ఆర్ఎస్ఎస్ భావజాలం నిండుగా ఉన్నవాడు, గత ఏడాది ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీల్లో ఆయన ఒకడు, అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక కేసీఆర్ మీద బాగానే కాలు దువ్వుతున్నారు. తెలంగాణాలో బీజేపీని అగ్ర భాగాన నిలబెట్టాలని చూస్తున్నారు. ఆయన తపన అంకితభావం మెచ్చగతగినదే అయినా అక్కడ బీజేపీకి అంత సీన్ ఉందా అన్నదే ఇపుడు ప్రశ్న. ఇక సంజయ్ ఉన్నట్లుండి జనసేనాని పవన్ కళ్యాణ‌్ ని కలవడం ఒక విశేషంగా చూడాలి. ఈ మధ్యకాలంలో పవన్ కేవలం ట్వీట్లు ద్వారానే రాజకీయాలు నడుపుతున్నారు. మరో వైపు వరస సినిమాలకు రెడీ అవుతున్నారు. ఆయన రాజకీయం ఇలా ఉండగా సంజయ్ కలసి వచ్చి పోరాటాలు చేద్దామని చెప్పడం ఆసక్తి రేపే అంశమే.

ఇద్దరినీ దించేయాలట….

బీజేపీ ఆత్రుత ఎలా ఉంది అంటే కన్నూ మిన్నూ కానక అన్నట్లుగా ఆకాశానికి నిచ్చెనలు వేస్తోందని చెప్పాలి. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. భారీ మెజారిటీతో ప్రభుత్వం వచ్చింది. ఏడాది పాలనలో అవినీతి లేదు. సంక్షేమ పధకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక జగన్ కూడా అత్యంత ప్రజాదరణ కల నేతగా ఉన్నారు. ఇక ఏపీలో బీజేపీకి ఊపిరి లేదు, ఈ సమయంలో జగన్ ని దించేయాలని సంజయ్ అనడం అతి ఉత్సాహమే అవుతుంది. అలాగే కేసీయార్ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన‌ తెలంగాణాను తన సొంతంగా చేసుకుని శాసిస్తున్నాడు. అటువంటి కేసీయార్ మీద యుధ్ధం చేసి ఓడించాలన్నది సంజయ్ పంతం. అంతవరకూ బాగానే ఉన్నా, ఇది సమీప భవిష్యత్తులోనైనా జరిగే పనేనా అన్న సందేహాలు చాలా ఉన్నాయి.

పవనే ఆధారం….

పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడికీ రాని జనం వస్తారని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత జనాదరణ ఉందని దాన్ని తాము వాడుకుంటామని, రెండు పార్టీలు కలసి జనాలకు తామే అసలైన ఆల్టరేషన్ అని చెబుతామని అంటున్నారు. ఇపుడు సంజయ్ కూడా అదే మాట అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి జనాలు రారని ఎవరైనా చెబితే అది వట్టి మాటే అవుతుంది. పవన్ కళ్యాణ్ కి వెల్లువలా జనం వస్తారు. వచ్చిన వారంతా ఓటేస్తే పవన్ గత ఎన్నికల్లోనే ఎక్కువ సీట్లు సంపాదించేవారు. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ జనాలను తెప్పిస్తుంది. అయితే ఓటేసేందుకు ఇది కాదు కావాల్సింది విధానాలు, రాజకీయ సిధ్ధాంతాలు. జనాలకు భరోసా. మరి బీజేపీ ఇప్పటికీ ఒక వర్గం పార్టీగానే రెండు రాష్ట్రాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా పరిమితంగానే ఉంది. అయినా అతనితో కలసి అధ్బుతాలు చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారంటే ఇప్పటికి మాత్రం అతిగా ఊహించుకుంటున్నారనే అనుకోవాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చరిష్మాను సరిగ్గా వాడుకుంటే ఏపీలో కొంత వరకూ బీజేపీ, జనసేన కూటమికి ఒక చోటు దొరుకుతుంది అన్న దాని మీద మాత్రం విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News