పడిన రంగు పోద్దా?

ప్రశ్నిస్తున్నానని చెప్పి మరీ రాజకీయాల్లోకి వచ్చిన అయిదేళ్ల తరువాత జనసేనాని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఠంచనుగా నెలకు కనీసం ఒక ప్రొగ్రాం అయినా పెట్టుకుని మరీ జనంలోకి వస్తున్నారు. [more]

Update: 2019-12-07 06:30 GMT

ప్రశ్నిస్తున్నానని చెప్పి మరీ రాజకీయాల్లోకి వచ్చిన అయిదేళ్ల తరువాత జనసేనాని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఠంచనుగా నెలకు కనీసం ఒక ప్రొగ్రాం అయినా పెట్టుకుని మరీ జనంలోకి వస్తున్నారు. బాగానే ఉంది కానీ, పవన్ ప్రశ్నించడంలో మరీ లాజిక్ మిస్ అవుతున్నారన్నదే అందరి బాధగా ఉంది. నిజానికి ప్రతిపక్షం బాధ్యతే ప్రశ్నించడం, అధికారం మత్తులో నాయకులు తెలిసీ తెలియక తప్పులు చేస్తారు. వాటిని ఇవిగో అని చూపించడం ప్రతిపక్షం లక్షణం. కేవలం చూపించడమే కాకుండా నిర్మాణాత్మకమైన సలహాలు కూడా చెప్పి సర్కార్ కి దిశానిర్దేశం చేయడం ఉత్తమ ప్రతిపక్ష నేత ధర్మం. కేవలం వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ బురుద జల్లి వెళ్ళిపోవడం మరో రకం ప్రతిపక్ష పాత్ర లక్షణం. ఈ కేటగిరీలు చూసుకున్నపుడు మనం ఉత్తమ ప్రతిపక్ష నాయకులు లేరని తేలిపోయింది. ఉంటే గింటే వారు తొలి మూడు నాలుగు ఎన్నికల వరకే పరిమితం అని కూడా చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి.

బాధ్యత అంతేనా..?

ఇక మధ్యరకం ప్రతిపక్ష పాత్రను కూడా గడచిన కొద్ది సంవత్సరాలలో చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇది తప్పు అని చూపించి ప్రశ్నించడం కూడా గొప్ప విషయమే. అలాంటి రాజకీయం మారిపోయి ఇపుడు తప్పున్నా లేకపోయినా మేము ప్రశ్నిస్తాము మీరు భరించడనే రాజకీయం తయారైంది. ఇందులో విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా తమదైన పాత్ర పోషిస్తూంటే పవన్ కల్యాణ్ లాంటి కొత్త నాయకుడిని అని ఏం లాభం అనుకోవాలి. ఇపుడు ప్రభుత్వాలను నిందించడం కూడా దాటి వ్యక్తిగత దూషణలు, కులమతాల‌ ప్రస్తావనలూ చాలా దూరం సాగుతోంది రాజకీయం. పవన్ కళ్యాణ్ తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని అంటున్నారు, మంచిదే కానీ ముందు సమస్య గురించి పూర్తిగా తెలుసుకుని ప్రశ్నించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఆ సమస్య ఎపుడు పుట్టింది, దాని ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నీ చూసి మాట్లాడాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు సలహా ఇస్తున్నారు.

నిజంగా చేసి ఉండాల్సింది…

పవన్ కల్యాణ్ నిజంగా అయిదేళ్ళ క్రితం ఎందుకు ఇంతలా జనంలోకి వచ్చి ప్రశ్నించలేదో తెలియదు కానీ నాడే ఈ పని చేసి ఉంటే ఈ పాటికి ఆయన కాస్త బలమైన ప్రతిపక్ష నాయకుడిగానైనా మిగిలేవారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయిదేళ్ళ చంద్రబాబు హయాంలోనూ అనేక తప్పులు జరిగాయి. ఆనాడూ ఉల్లి ధరలు పెరిగాయి. అపుడు కూడా వివిధ రకాలుగా కార్మికులు రోడ్డున పడ్డారు, ప్రజలు ఇబ్బందులు ఎన్నో నాడూ ఉన్నాయి, అపుడే గట్టిగా గళమెత్తి జనంలోకి పవన్ కల్యాణ్ వచ్చి ఉంటే నిన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీ ఇంత దారుణంగా ఓటమి పాలు అయ్యేది కాదని కూడా అంటున్నారు. ఇపుడు పవన్ కల్యాణ్ గట్టిగానే నిలదీస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి గొంతు ఎత్తి మాట్లాడుతున్నారు.

తేడా అదేగా…

అయితే పవన్ కల్యాణ్ ఇక్కడే లాజిక్ మిస్ అయ్యారని అంటున్నారు. నాడు బాబుని ప్రశ్నించి నేడు జగన్ ని కూడా నిలదీస్తే పవన్ కల్యాణ్ లోని నిజాయతీ జనానికి అర్ధమయ్యేదని పేర్కొంటున్నారు. అలా కాకుండా బాబుని వదిలేసి జగన్ మీద పడడంతోనే ఆయన వివక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్న కలరింగ్ వచ్చేసిందని కూడా అంటున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా గత ప్రభుత్వ లోపాలను బట్ట బయలు చేయడంతో పాటు, ప్రతిపక్షంగా ఎపుడూ ప్రశ్నించడ‌మే కాదు, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం, మంచిని మంచిగా చూడడం, ప్రతి సమస్యనూ ప్రజా కోణం నుంచి ఆలోచించడం కనుక చేస్తే జనసేనకు కొత్త బలం వస్తుందని అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేయగలరా?

Tags:    

Similar News