భారమంతా బీజేపీపైనేనా ?

పవన్ కళ్యాణ్ రెండు పడవల్లో కాలు వేశానని అనుకుంటున్నారు. కానీ ఆయన ఒక పడవలోనే ఉన్నారు. అదిపుడు సినిమా పడవ. అంతకు ముందు కూడా ఆయన సినిమాలకు [more]

Update: 2020-06-22 00:30 GMT

పవన్ కళ్యాణ్ రెండు పడవల్లో కాలు వేశానని అనుకుంటున్నారు. కానీ ఆయన ఒక పడవలోనే ఉన్నారు. అదిపుడు సినిమా పడవ. అంతకు ముందు కూడా ఆయన సినిమాలకు విరామం ఇచ్చినా కూడా రాజకీయాన్ని పార్ట్ టైం గానే ఎంచుకున్నారు. ఇపుడు ఎన్నికల్లో ఓటమి రాగానే అర్జంట్ గా బీజేపీతో పొత్తు పెట్టుకుని భారమంతా కాషాయం పార్టీ మీద వేసారు. దేశంలో బలమైన పార్టీ కాబట్టి వారే అన్నీ చూసుకుంటారని పవన్ కళ్యాణ్ ఆలోచనలాగుంది. కానీ ఎక్కడైనా కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఏమీ కాని చోట అద్భుతాలు సృష్టించిన వారే విజేతలుగా చరిత్రలో నిలుస్తారు.

సౌండ్ లేదుగా….

ఏపీలో చూసుకుంటే జనసేనకు సౌండ్ లేకుండా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గత నాలుగు నెలలుగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. పోనీ షూటింగుల్లో బిజీ అయ్యారనుకుంటే లాక్ డౌన్ వల్ల అది కూడా లేదు. ఇక ట్విట్టర్ ట్వీట్లు కూడా అడపా తడపా వస్తున్నాయి తప్ప మరేమీ చడీ చప్పుడూ లేదు. పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి అని రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఓడిపోయాం అనుకునేంతలోనే ఏడాది గడచింది. రెండవ ఏడాది కరోనా మహమ్మారితో సాగుతోంది. ఈ జబ్బు తగ్గేసరికి మరో ఏడాది వెళ్లిపోతుంది. మరి అపుడు ఎన్నికల ఏడాదిని కూడా వదిలేస్తే పవన్ కళ్యాణ్ కి మిగిలింది అచ్చంగా రెండేళ్లే. మరి ఇప్పటిదాకా పార్టీని గాలికి వదిలేసి ఆ తక్కువ టైంలో నిర్మించుకోవాలంటే సాధ్యమయ్యేనా.

స్టార్ కాంపెయినర్ గా….

పవన్ కళ్యాణ్ ఇపుడు బీజేపీకి స్టార్ కాంపెయినర్ గా ఉండాలనుకుంటున్నారు. అంటే జనసేన‌తో కలసి కూడా. అయితే బీజేపీకి ఏపీలో చూస్తే బలం పెద్దగా లేదు. పవన్ పార్టీకి 2019లో ఏడు శాతం ఓట్లు వచ్చాయనుకున్న ఆందులో బీఎస్పీ, కామ్రేడ్స్ ఓట్లు కొంత శాతమైనా తీసేయాలి కదా. ఇక పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పోటీ కాబట్టి గెలుస్తాడు సీఎం అవుతాడు అన్న ఆశతో వేసిన ఓట్లే ఆనాడు ఎక్కువగా ఉంటాయి. ఫలితాలు చూశాక జనసేన సినిమా మొత్తం చూశాక ఆ ఊపు ఇంకా అలాగే ఉంటుందా. ఆ ఓట్లు అటు టీడీపీకో, ఇటు వైసీపీకో మెల్లగా షిఫ్ట్ అవుతాయి కదా. అలా కాకుండా ఉండాలంటే పార్టీని జనంలో ఉంచాలి. తాను కూడా క్రియాశీలం కావాలి. కొత్తగా ఓటు బ్యాంక్ నిర్మించాలి. మరి పవన్ కళ్యాణ్ వల్ల అది అయ్యేనా.

గెలిచేస్తారా…?

బీజేపీ ఎటూ ఏళ్ళకు ఏళ్ళుగా హిందూత్వ మంత్రం జపిస్తోంది. ఇక మోడీ గ్లామర్ ని ఇప్పటికి రెండు ఎన్నికల్లో వాడేసింది. 2024 నాటికి మోడీ మళ్లీ ప్రధాని అభ్యర్ధిగా ఉన్నా గతంలో ఉన్న ఊపు ఆయన‌కు ఉండదు, బీజేపీకి పట్టున్నఉత్తరాది రాష్ట్రాల్లోనే కమలం బలం చాలా తగ్గుతుంది అంటున్నారు. అలాంటిది అసలు బలం లేని ఏపీలో మోడీని చూసి ఏం ఓట్లేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ పాత కాపే. ఆయన పొలిటికల్ సినిమా కూడా 2014, 2019లలో జనం చూసేశారు. మరి కొత్తగా ఆకర్షణ ఏంటి. అంటే జనంలో ఉంటూ ప్రజా సమస్యలపైన అలుపెరగని పోరాటం చేయడమే. జగన్ కి తానే ఆల్టర్నేషన్ అని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నపుడే అది ఆయనకు బీజేపీకి ప్లస్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేనలోని వారు కానీ బీజేపీ గ్లామర్ తో ఒడ్డునపడదామనుకుంటున్నట్లుగా ఉంది. కానీ బీజేపీ వైపు కూడా సేమ్ టూ సేమ్. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ని అడ్డం పెట్టుకుని ఉనికి చాటాలనుకుంటోంది. అంటే ఇలా ఒకరిని ఒకరు నమ్ముకుని అడుగు కూడా ముందుకు సాగని ఈ రాజకీయ ప్రయాణం ఏపీలో మళ్ళీ వైసీపీ, టీడీపీల మధ్య పోరుకే దారి చూపుతోంది.

Tags:    

Similar News