జగన్ మేలుకోవాల్సిందేగా

ముఖ్యమంత్రి జగన్ ది అదేం జాతకమో తెలియదు కానీ ఇలా సీఎం కుర్చీ ఎక్కారో లేదో కానీ అలా చంద్రబాబు విమర్శలతో తగులుకున్నారు. ఆ పక్కనే తోడున్నానంటూ [more]

Update: 2019-11-04 11:00 GMT

ముఖ్యమంత్రి జగన్ ది అదేం జాతకమో తెలియదు కానీ ఇలా సీఎం కుర్చీ ఎక్కారో లేదో కానీ అలా చంద్రబాబు విమర్శలతో తగులుకున్నారు. ఆ పక్కనే తోడున్నానంటూ మెగా బ్రదర్ పవన్ కూడా సీన్లోకి వచ్చారు. ఇలా మాటల తూటాలు పేల్చుతూ హోరెత్తిస్తున్న వీళ్ళు ఇపుడు మరికాస్తా ముందుకువెళ్ళిపోయారు. ఏకంగా రోడ్డు మీదకు ఆందోళనల దాకా వచ్చేశారు. ఇసుకే వారికి ఆయుధం అయింది. మొదట టీడీపీ ధర్నాలు చేస్తే నారా లోకేష్ దీక్షకు కూర్చున్నాడు, ఇపుడు పవన్ ఏకంగా లాంగ్ మార్చ్ అనేశారు. పవన్ కి ఎమ్మెల్యేలు లేరు, ఆయన పని అయిపోయిందని అనుకోవచ్చు, కానీ పవన్ బంగారం లాంటి వాడు, గోడ దాపు ఉండాలి కానీ మెరిసిపోతాడు. మొత్తానికి స్ర్రిప్ట్ డైరెక్షన్ ఎవరిది అన్నది పక్కన పెడితే విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ లో పవన్ రెచ్చిపోయారు. అది ఓ విధంగా వైసీపీకి డేంజర్ సిగ్నలే.

జనమే జాతర….

పవన్ అంటే జనం వస్తారు, రాకపోతే అది వార్త అవుతుంది. ఆయన ఎంతటి అదృష్టవంతుడంటే చేసినవి పాతిక సినిమాలు, అందులో బ్లాక్ బస్టరులు, హిట్లు కూడా ఎక్కువగా ఏం లేవు కానీ పవన్ సూపర్ స్టార్ డమ్ అనుభ‌విస్తున్నాడు, ఇపుడు పవన్ రెండు చోట్లా ఓటమిపాలు అయ్యారు. కానీ అయిదు నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున జన సందోహం మధ్య పవన్ దూసుకువచ్చేశారు. ఓ విధంగా చూస్తే ఏపీ రాజకీయల్లో పవన్ ఫోర్స్ అని చెప్పలేం కానీ పవన్ తో పొత్తు ఉంటే మాత్రం ఏపీలో పెద్ద ఫోర్స్ తయారవడం ఖాయం. పవన్ తాను ఒంటరిగా గెలవకపోవచ్చు. కానీ తన వద్ద ఉన్న ఓట్లతో గెలిపించగలరు, ఓడించగలరు, ఈ రెండూ 2014, 2019 ఎన్నికల్లో ప్రూవ్ అయ్యాయి. ఇపుడు పవన్ మరో మారు పంజా విసిరారు. మరి పవన్ ని జాగ్రత్తగా తమ పక్కన ఉంచుకుంటే లాభమనుకునే రెండు పార్టీలు కూడా ఏపీలో సిధ్ధంగా ఉన్నాయి. అవి బీజేపీ, టీడీపీ. అందువల్ల పవన్ విషయంలో వైసీపీ కొత్త అంచనాలకు రావాల్సిన అవసరం ఉంది.

ఎన్ని చేసినా…?

ప్రజలకు ఏపీ సర్కార్ చాలా చేస్తోంది. దానికి మార్కులు ఎటూ పడతాయి.కానీ లక్షలాది మందితో ముడిపడి ఉన్న అతి పెద్ద సమస్య గా ఇసుక కొరత తయారైంది. దీన్ని కనుక పరిష్కరించుకోకపోతే మాత్రం వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోవడం ఖాయం. కేవలం అయిదే అయిదు నెలలకు ఇంత పెద్ద ఎత్తున విపక్షాల ఆందోళనకు జరిగితే రేపటి రోజున మరింత రచ్చ ముదిరితే ఇక ప్రతిపక్షాలను ఆపగలమా అన్నది వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా కూడా జగన్ మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే పాతికమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ మొత్తం కూడా. పవన్ లాంగ్ మార్చ్ ఓ విధంగా వైసీపీకి మంచే చేసిందని భావించి కార్యక్షేత్రంలోకి దూకాల్సిందే.

Tags:    

Similar News