Pawan kalyan : గుర్తు కూడా పోతే గుర్తులేకుండా పోతారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో గుర్తుపరంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. అసలే అంతంత మాత్రంగా ఉన్న గుర్తు కూడా చేజారి పోయే సూచనలు [more]

Update: 2021-10-10 03:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో గుర్తుపరంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. అసలే అంతంత మాత్రంగా ఉన్న గుర్తు కూడా చేజారి పోయే సూచనలు కన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ గాజు గ్లాసు గుర్తును జనంలోకి తీసుకెళ్లగలిగారు.

ఫ్రీ సింబల్ కావడంతో….

అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తప్పేలా లేవు. గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చింది. అంటే ఎవరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా పేరులో అక్షరాన్ని బట్టి వారికి గాజు గ్లాసును కేటాయించే అవకాశాలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజుగ్లాసు గుర్తును కేటాయించాల్సి వస్తే పవన్ కల్యాణ్ ను రాజకీయంగా దెబ్బతీయడం పెద్ద కష్టమేమీ కాదు.

తిరుపతి ఉప ఎన్నికల్లోనూ….

గాజుగ్లాసు గుర్తును ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగానే స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. సింబల్ రిజర్వ్ చేయాల్సిన పార్టీ కాదని ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడినట్లుంది. ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకున్నా జనసేన కు జనం మద్దతు లభించింది తక్కువే. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేనకు సింబల్ సమస్య ఉంటుందంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట వారికి గాజు గ్లాసు గుర్తు వచ్చే అవకాశాలు తక్కువ.

జనంలోకి తీసుకెళ్లి….

గాజుగ్లాసు గుర్తును జనంలోకి పవన్ కల్యాణ్ బలంగా తీసుకెళ్లగలిగారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో గాజుగ్లాసు గుర్తును పల్లె ప్రజలకు కూడా చేర్చగలిగారు. కానీ గాజుగ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ గా ఎన్నికల కమిషన్ ఎంపిక చేయడంతో జనసేనకు పెద్ద దెబ్బే తగిలినట్లయింది. అయితే దీనిపై జనసేన తరుపున తిరిగి ఎన్నికల కమిషన్ ను సంప్రదించాలని నిర్ణయించారు. గాజుగ్లాసు గుర్తుపై న్యాయస్థానాన్ని అయినా ఆశ్రయిస్తామని జనసేన నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News