ఆ డైలాగ్ కు అర్థం లేదు

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కు జరిగిన ఘోరపరాభవం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా బయటపడలేదా …? అవుననే చెప్పక చెబుతున్నాయి ఆయన వ్యాఖ్యలు. ఓటమి నుంచి [more]

Update: 2019-08-01 12:30 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కు జరిగిన ఘోరపరాభవం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా బయటపడలేదా …? అవుననే చెప్పక చెబుతున్నాయి ఆయన వ్యాఖ్యలు. ఓటమి నుంచి తాను కోలుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని ఫలితాలు వచ్చాక ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. అలాగే రిజల్ట్ రాకుండానే ఓటమి తప్పదన్న చేదు నిజాలను అభిమానులు జీర్ణించుకునేలా మాత్రం ముందుగానే పవన్ కళ్యాణ్ నూరిపోశారు. గెలుపు ఓటములు సహజమే కదా అని తత్త్వం బోధించేశారు. ఇక్కడి దాకా బాగానే వున్నా తాజాగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు రాజకీయాల్లో ఇంకా పరిపక్వత రాలేదని చెప్పేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైకి నేను నా పార్టీ ఒకే ఓకే అన్నా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ కోలుకోలేదని తెలుస్తుందంటున్నారు.

సమయం సరిపోలేదు …

ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కి రివర్స్ కావడానికి ప్రచారం కి సమయం చాలాకే అని చెప్పడం పై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా లేరు తప్ప ఆయన కొత్తేమి కాదు. 2009 లో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధినేతగా ప్రచార బాధ్యతలు వహించారు. సుమారుగా వైసిపి అధినేత జగన్ తో సమానంగా లోకేష్ కన్నా ముందుగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఎన్నికల్లో అయితే పోటీ చేయకపోయినా పీఆర్పీ లో కీ రోల్ వహించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో సొంత పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పోటీ చేయకుండా బిజెపి, టిడిపి కి మద్దతు ప్రకటించి ఆ రెండు పార్టీల విజయంలో కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు కూడా.

ఐదేళ్ళు అడపాదడపా …

జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి పవన్ కళ్యాణ్ పటిష్టం చేస్తారని జనసైనికులు ఎంతో ఆశగా ఎదురు చేశారు. పార్టీ లో చురుగ్గా కదిలేందుకు సైన్యం సిద్ధంగా వున్నా టిడిపి సర్కార్ లో అవినీతి కంపు పై వైసిపి తీవ్ర పోరాటం చేస్తున్నా ఎపి రాజకీయాల్లో అతిధి పాత్రనే పవన్ కళ్యాణ్ పోషించారు. ఇక ప్రత్యేక హోదా అంశాన్ని నెత్తికి ఎత్తుకున్నా చిత్రంగా అధికారపార్టీపై కాకుండా విపక్షంలో వున్న పార్టీ పై పవన్ కళ్యాణ్ నిప్పులు కురిపించి టిడిపి తోనే పవన్ అన్న సంకేతాలు జనంలోకి వెళ్లేలా చేశారు. ఇక ఏడాదిన్నర ముందు మాత్రం టిడిపి పై తిరుగుబాటు చేసి రెండు ప్రధాన పక్షాలను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినా జరగాలిసిన డ్యామేజ్ జరిగిపోయింది. టిడిపి చిక్కుల్లో పడిందన్నప్పుడల్లా ఎంట్రీ ఇచ్చి హల్ చల్ చేసి తిరిగి మాయం కావడంతో కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ టైం నాయకుడు కాదన్న వైసిపి ప్రచారం జనం బాగానే నమ్మారు. దీనికి తోడు ప్రజారాజ్యం పార్టీ నీడ జనసేనను వెంటాడింది.

అంతా ఎదురుచూసినా ….

జనసేన కోసం తమ సొంత డబ్బును కూడా వెచ్చించి మరీ అభిమానులు దూసుకువచ్చారు. వారి స్పీడ్ ను అందుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలం అయ్యారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకుంటూ సాగాలని ఆయన 2019 ఎన్నికల ముందు వరకు కార్యాచరణ మొదలు పెట్టలేదు. ఫలితంగా వ్యూహం లేకుండా యుద్ధంలోకి దిగిపోయింది జనసేన. ఐదేళ్లపాటు బంగారంలాంటి సమయాన్ని పవన్ కళ్యాణ్ వృధా చేసుకుని ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోవడానికి సమయం సరిపోలేదని చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ విశ్లేషకుల విమర్శలకు తెరతీసింది. జరిగింది ఏదో జరిగింది ఇకనైనా పవన్ కళ్యాణ్ పాత పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం పార్టీ నిర్మాణం పై గతంలో లా కాకుండా సీరియస్ గా దృష్టి పెట్టాలన్నది అటు అభిమానులు ఇటు విశ్లేషకుల సూచన. మరి ఇది ఎంతవరకు వాస్తవ రూపంలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతారో రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News