ఇక అంతా కొత్త ఏడాదిలోనేనట ?

విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ప్రజలు నాకు కుటుంబ సభ్యులతో సమానమని పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా ఉన్నప్పటి నుంచే చెబుతూ వస్తున్నారు. జనసేనాని [more]

Update: 2020-12-12 15:30 GMT

విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ప్రజలు నాకు కుటుంబ సభ్యులతో సమానమని పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా ఉన్నప్పటి నుంచే చెబుతూ వస్తున్నారు. జనసేనాని అయ్యాక ఆయన విశాఖ నుంచే అనేక కార్యక్రమాలు మొదలెట్టేవారు. ఇక ప్రజా పోరాట యాత్ర అంటూ విశాఖలో రెండేళ్ళ క్రితం పూర్తిగా తిరిగి ఆర్కే బీచ్ లో కవాతులు కూడా నిర్వహించిన పవన్ కళ్యాణ్ గత ఏడాది సెప్టెంబర్ లో ఇసుక మీద పోరాటం పేరిట విశాఖ వచ్చారు. ఆ తరువాత ఏడాది దాటిపోయింది కానీ ఈ వైపు తొంగి చూడలేదు.

అదే బాధటగా …?

విశాఖను తాను ఎంతో ప్రేమిస్తే ఇక్కడ జనం ఓటేయలేదు అన్న బాధ అయితే పవన్ కళ్యాణ్ లో ఎక్కడో ఉందని అంటారు. అయితే పవన్ కళ్యాణ్ సరిగ్గా ప్రచారం చేయకపోవడం, భీమవరం రెండవ సీటుగా చేసుకోవడం, గెలిస్తే అక్కడే ఉంటానంటూ ప్రకటనలు చేయడమే గాజువాకలో గెలుపును డ్యామేజ్ చేసిందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప తటస్థ జనాన్ని పార్టీ వైపు తిప్పలేకపోవడం ఒక మైనస్ అయితే నామినేషన్ తరువాత విశాఖ ఊసే మరచిపోవడం అతి పెద్ద తప్పిదమ‌ని జనసైనికులే చెబుతారు. అయినా గత ఏడాది పవన్ విశాఖలో లాంగ్ మార్చ్ తరువాత గాజువాకలో సమీక్ష చేశారు. తాను ఇకపైన తరచూ వస్తానని మాట కూడా ఇచ్చారు. కానీ ఇప్పటిక్ పదిహేను నెలలు గడచినా పవన్ కళ్యాణ్ విశాఖ ముఖం చూడలేదు అన్న బాధ జనసైనికులకే ఉంది.

ఎందుకు మారిందో మరి …?

చాతుర్మాస దీక్ష తరువాత విశాఖ నుంచే తన జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడతాను అని పవన్ కళ్యాణ్ ఆ మధ్య పార్టీ వారికి చెప్పారట. దాంతో అక్టోబర్ నెలాఖరులో పవన్ విశాఖ వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాపీగా డిసెంబర్ నెలను కూడా రానిచ్చేశారు. ఇపుడు కొస్తా రాయలసీమ‌ల్లోనే ఆయన పర్యటనలు చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది కూడా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉండడం చేత పవన్ అటు వైపే ఎక్కువగా టూర్లు వేస్తారని జనసేన నుంచి వినిపిస్తున్న మాట.

క్యాలండర్ మారాలిట….

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది విశాఖ వచ్చేది లేదని ఇప్పటికైతే జనసైనికులే కచ్చితంగా చెబుతున్నారు. అంటే పవన్ విశాఖ రాకుండానే 2020 గడచిపోతుంది అన్న మాట. కొత్త ఏడాది పవన్ కళ్యాణ్ జిల్లాల టూర్లు ప్లాన్ చేస్తున్నాని, అపుడు విశాఖ వస్తారని తాజా భోగట్టా. ఇవన్నీ కన్ ఫర్మ్ అయి పవన్ వస్తే అపుడు కదా ముచ్చట అని ప్రత్యర్ధి పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. ఇక పవన్ కి విశాఖ మోజు తగ్గిందన్న మాట కూడా ఉంది. పొత్తుల్లో భాగంగా బీజేపీ విశాఖను కచ్చితంగా కోరుకుంటుంది. ఎంపీ సీటు సహా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను అడుగుతుంది. దానికి తోడు పవన్ కూడా ఈసారి విశాఖ నుంచి కాకుండా వేరే చోట నుంచి పోటీకి దిగుతారు అంటున్నారు. దాని వల్లనే ఆయన విశాఖకు రాకపోకలు తగ్గించేశారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కొత్త ఏడాదే పవర్ స్టార్ మెగా సిటీలో అడుగుపెట్టేది అని మాత్రం తెలుస్తోంది.

Similar News