ప‘‘వన్’’ కంటే జ‘‘గన్’’ బెటరని…?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపే టార్గెట్ [more]

Update: 2019-03-14 03:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపే టార్గెట్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా స్నేహం వేరు రాజకీయం వేరు అంటున్నారు పవన్ కళ్యాణ్ సన్నిహితులు. సినిమా ఇండస్ట్రీలో, బయట పవన్ కళ్యాన్ కు, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు వెళ్లకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కలిగి ఉన్న వారు సైతం రాజకీయంగా పవన్ కు వ్యతిరేకంగా మారుతున్నారు. వరుసగా పవన్, మెగా ఫ్యామిలీ సన్నిహితులు వైసీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. గతంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్, చిరంజీవి పార్టీలు పెట్టినప్పుడు ఇండస్ట్రీలో చాలా మద్దతు లభించింది. కానీ, పవన్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు.

సినీ ఇండస్ట్రీలో సన్నిహితులు…

సినీ నటుడు అలీ ఇటీవలే జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులు. అలీ లేని పవన్ సినిమా లేదంటే వారిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను, పవన్ స్నేహితులమే అని అయితే రాజకీయాలు మాత్రం వేరు అని అలీ ప్రకటించారు. ఇక, ఇవాళ మరో నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీలో చేరారు. ఆయన కూడా మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రాజారవీంద్ర చిరు వెనకాలే ఉండేవారు. ఆయన కూడా జనసేనలో కాకుండా వైసీపీలో చేరడం గమనార్హం. నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పవన్ కు మంచి అనుబంధం ఉంది. 2014లో విజయవాడ పార్లమెంటు టీడీపీ టిక్కెట్ కోసం పవన్ కళ్యాణ్ తో సిఫార్సు కూడా చేయించుకున్నట్లు ప్రచారం ఉంది. ఇలా సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న వారు రాజకీయాల్లోకి వచ్చే సరికి దూరంగా ఉంటున్నారు.

పవన్ రాజకీయంపై నమ్మకం లేదా..?

రాజకీయంగా గతంలో చిరంజీవికి దగ్గరగా ఉండి ప్రజారాజ్యం పార్టీలో పార్టీలో కీలకంగా పనిచేసిన కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత సి.రామచంద్రయ్య కూడా వైసీపీలో చేరిపోయారు. ఈయన మొదట జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినా వైసీపీలో చేరేందుకే మొగ్గు చూపారు. విజయవాడ మాజీ మేయర్, మెగా ఫ్యామిలీకి బంధువు రత్నబింధు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. మరి, రాజకీయంగా పవన్ కళ్యాణ్ విజయవంతం అవుతారనే నమ్మకం లేకనో లేదా గతంలో ప్రజారాజ్యం అనుభవంతోనే వీరు పవన్ వైపు కాకుండా ఆయనకు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇలా పవన్ కు సన్నిహితంగా ఉన్న వారు వైసీపీలో చేరుతున్నప్పుడు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల నుంచి మాత్రం తీవ్రంగా విమర్శలు ఎదుర్కుంటున్నారు. అలీ విషయంలో పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించి సోషల్ మీడియాలో దూషణలకు దిగారు. ఏదేమైనా పవన్ కి మాత్రం ఇలా సన్నిహితులే ప్రత్యర్థి పార్టీలో చేరడం ఇబ్బందికరంగా మారింది.

Tags:    

Similar News