పవన్ పోటీ చేసే స్థానాలు ఇవేనా …?

టిడిపి అధినేత కుప్పం నుంచే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. అలాగే పులివెందుల నుంచి వైసిపి అధినేత బరిలోకి దిగనున్నారు. ఈ రెండిటిపై అందరిలో క్లారిటీ వుంది. [more]

Update: 2019-02-08 04:02 GMT

టిడిపి అధినేత కుప్పం నుంచే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. అలాగే పులివెందుల నుంచి వైసిపి అధినేత బరిలోకి దిగనున్నారు. ఈ రెండిటిపై అందరిలో క్లారిటీ వుంది. వచ్చే ఎన్నికలు త్రికోణ పోటీలో సాగుతాయని అంతా భావిస్తున్న నేపథ్యంలో కీలకమైన జనసేన అధినేత పోటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు ? అదే ఇప్పుడు ఆ పార్టీలోనూ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠరేకెత్తిస్తుంది. దీనిపై జనసేన పార్టీ లోతైన కసరత్తు సైతం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. తన ఓటరు చిరునామాను హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు మార్చిన నాటినుంచి జనసేనాని పోటీ చేసే స్థానం పై చర్చ సాగుతుంది. ఒక సందర్భంలో రాయలసీమ లోని అనంతపురం నుంచి పోటీ చేస్తాను అని పవన్ స్పష్టం చేశారు. ఆ తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది.

సేఫ్ ప్లస్ లు ఇవేనా ..?

ప్రజారాజ్యం పార్టీ అధినేత గా వున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేశారు. తన సొంత ప్రాంతమైన పాలకొల్లులో చిరంజీవి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో నాటి పాఠాలు గుణపాఠం గా నేర్చుకున్న జనసేన అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంచి మెజారిటీని అందించే సురక్షిత ప్రాంతాలు అధ్యయనం చేయిస్తున్నారు. వాటిలో విశాఖ జిల్లా అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లేదా, ఏలూరు రాయలసీమ లోని తిరుపతి, అనంతపురం ల నుంచి పోటీ చేయడానికి పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు ఆ పార్టీలో ప్రచారం నడుస్తుంది. వీటిలో ది బెస్ట్ ఏమున్నాయో ఫైనల్ గా లెక్కేసి అక్కడ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఆయన వీటిలో ఏ స్థానం ఎంపిక చేస్తారో లేదా ఇవన్నీ కాకుండా కొత్త నియోజక వర్గం వైపు చూస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News