జనారణ్యంలోకి అజ్ఞాతవాసి...!

Update: 2018-05-18 15:30 GMT

తెలుగుదేశం పార్టీతో విడిపోయిన తర్వాత జనసేన ఎదుర్కొంటున్న పలు ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు వెదికే పనిలో పడ్డారు. ఈనెల 20 వ తేదీ నుంచి మొదలు పెట్టనున్న ప్రజాపోరాట యాత్ర ఈదిశలో ఏరకమైన సంకేతాలు అందిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. జనసేనకు సంబంధించి ఇది తొలి క్రియాశీల రాజకీయ పర్యటన. 45 రోజులపాటు ఏకధాటిగా యాత్ర నిర్వహించబోతున్నారు. నిన్నామొన్నటివరకూ మేధోపరమైన చర్చలు,అధ్యయనాలు, అడపాదడపా వివిధ వర్గాలతో భేటీలకే పరిమితమైన జనసేన పూర్తిస్థాయి పొలిటికల్ యాక్టివిటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల లక్ష్యంగా తమ రాజకీయం కొనసాగుతుందని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ సంధిస్తున్న అనేక ప్రశ్నలు ఇంకా జనసేనను వెన్నాడుతూనే ఉన్నాయి. వాటికి ఒక్కటొక్కటిగా ఈ పర్యటనలో బదులిస్తారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. తన చర్యల ద్వారా కమలం పార్టీకి, తమకు సంబంధం లేదనే విషయాన్ని చాటి చెబుతారంటున్నారు.

నాలుగేళ్ల చిక్కుముడి...

అధికార తెలుగుదేశంపార్టీ లక్ష్యంగానే జనసేనాని ఇంతవరకూ ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. నేరుగా చంద్రబాబు నాయుడి కుమారుడు,మంత్రి లోకేశ్ నే టార్గెట్ చేశారు. పార్టీలోని కొందరు శాసనసభ్యులు, మంత్రులపై ఆరోపణలు చేసి ఉంటే టీడీపీ ఏదో రకంగా సర్దిపుచ్చుకునేది. కానీ టీడీపీ అధినేత వారసుడి తీరునే ప్రశ్నించడంతో విభజన రేఖలు స్పష్టమైపోయాయి. జనసేన టీడీపీ పార్టీకి ప్రత్యర్థిగా నిలవాలనుకుంటోందన్న వ్యూహం తేటతెల్లమైపోయింది. అప్పట్నించే టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తూవస్తోంది. నాలుగేళ్లుగా తమ పార్టీలో కనిపించని అవినీతి హఠాత్తుగా పవన్ కు ఎలా కనిపించిందని ప్రశ్నిస్తోంది. భారతీయ జనతాపార్టీ పరోక్ష సూచనల మేరకే జనసేనాని తమను రాజకీయంగా బద్నాం చేస్తున్నాడని ఆరోపిస్తోంది. బీజేపీ,జనసేన, వైసీపీలను ఒకే గాటన కట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ నుంచి కేంద్రప్రభుత్వం నుంచి తాము బయటికి వచ్చేసిన తర్వాత పవన్ ను బీజేపీ రెచ్చగొట్టిందనే ఆరోపణలను తెలుగుదేశం ముందుకు తెస్తోంది. వైసీపీ ఎలాగూ బీజేపీ చేతిలోని పనిముట్టే అనేది టీడీపీ విమర్శ. వీటన్నిటికీ బదులిచ్చే అవకాశాన్ని పవన్ తన పోరాట యాత్రలో ఎలా వినియోగించుకొంటారనేది ఆసక్తిదాయకం.

హోదా చాంపియన్ ...

ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి 2019 ఎన్నికలు ప్రత్యేక హోదా చుట్టూ తిరిగే అవకాశం ఉంది. 2014 ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని టీడీపీ పక్కనపెట్టేసింది. వైసీపీ వ్యూహాత్మక మౌనం పాటించింది. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని మళ్లీ ముందుకు తెచ్చి గొడవమొదలుపెట్టారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోలుస్తూ ఈ విషయంలో రాజీపడిన ఏపీ సర్కారును కూడా నిలదీశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడితో రెండు సందర్బాల్లో పవన్ సమావేశమయ్యారు. తర్వాత హోదా విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవడం మానేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఏ రూపంలో అయినా న్యాయం జరిగితే చాలన్నట్లుగా తన ధోరణిని మార్చుకున్నారు. దీంతో పవన్ కు చంద్రబాబు నాయుడు సర్దిచెప్పగలిగారని అంతా భావించారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టిన తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా ప్రజల్లో చర్చనీయం అవుతూ వచ్చింది. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయాస్త్రంగా మలచుకోగలిగింది. దీనిని గ్రహించిన తర్వాతనే టీడీపీప్యాకేజీని పక్కనపెట్టి హోదా గళమెత్తింది. పవన్ లో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తాను ఆ డిమాండ్ ను వదులుకోలేదు. మాట కూడా మార్చలేదంటూ తాజాగా ప్రకటన చేశారు. అయితే ఇదే విషయమై తామే చాంపియన్లుగా నిలవాలని పోటీలు పడుతున్న చంద్రబాబు, జగన్ లను ఎలా కౌంటర్ చేస్తారనేది వేచి చూడాలి.

ఉత్తరాంధ్ర ఉత్సాహం నింపుతుందా? ...

అసలు పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రను ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారనే విషయంలోనూ అనేక రకాల వాదనలు వినవస్తున్నాయి. రాయలసీమలో జనసేన బలం అంతంతమాత్రమే. రాజధానిలో బహిరంగ సభ నిర్వహణ, రైతు సమస్యలపై నేరుగా వారితో చర్చలు నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల్లో లక్షల సంఖ్యలో అభిమానుల మద్దతు ఉంది. ఉత్తరాంధ్రలో ఉద్దానం కిడ్నీ బాధితుల వంటి సమస్యలపై ఇప్పటికే పవన్ ఫోకస్ పెట్టారు. ఈ ప్రాంతంలో గిరిజనుల సమస్యలు ఎక్కువే. వెనకబాటు తనం ఎక్కువగా ఉంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రాయలసీమలో జగన్ పార్టీ ఈసారి బలంగా తలపడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో టీడీపీ బలంగా ఉన్నట్లు అంచనా. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ సారి చాలా కీలకంగా మారబోతున్నాయి. అందుకే క్షేత్రస్థాయి యాత్రకు ముందుగా ఉత్తరాంధ్రను జనసేన ఎంపిక చేసుకుందనే వాదన వినవస్తోంది. పవన్ తన 45 రోజుల పోరాట యాత్రలో ఈ ప్రాంత ప్రజలపై ఎటువంటి ఇంపాక్టు చూపుతారనేదానిపై జనసేన భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News