పవన్ కొత్త శత్రువు బాబు ?

అదేంటి రాజకీయంగా చంద్రబాబు అంటే జనసేనాని పవన్ కల్యాణ్ కి అదోరకం ఆరాధనాభావం అని అంతా అనుకుంటారు కదా అంటే రాజకీయాలు ఎపుడూ ఇలాగే ఉంటాయని జవాబు [more]

Update: 2020-07-10 12:30 GMT

అదేంటి రాజకీయంగా చంద్రబాబు అంటే జనసేనాని పవన్ కల్యాణ్ కి అదోరకం ఆరాధనాభావం అని అంతా అనుకుంటారు కదా అంటే రాజకీయాలు ఎపుడూ ఇలాగే ఉంటాయని జవాబు చెప్పాల్సివస్తుంది. నిజానికి జగన్ చంద్రబాబులలో ఇప్పటికీ పవన్ కల్యాణ్ బాబుకే ఓటు చేస్తారు. అందుకే ఆయన 2014 ఎన్నికల సందర్భంగా అనుభవం ఉన్న నేత ఏపీకి సీఎం కావాలని బాబు తరఫున జనంలో తిరిగి ఓటేయించి గెలిపించారు. అయిదేళ్ల పాటు బాబుకు అండగానే ఉన్నారు. మధ్యలో అంటే ఎన్నికలు దగ్గర చేసి ఇద్దరూ విడిపోయినట్లు కనిపించినా అది రాజకీయ వ్యూహమేనని అంటారు. దాని ఆధారాలు కూడా బయటపడడంతో ఇద్దరి పాచికా పారలేదు. కుప్పంలో, మంగళగిరిలో పవన్ తన పార్టీని పోటీకి పెట్టలేదు, ఇక గాజువాక, భీమవరంలో బాబు ప్రచారం చేయలేదు, దీన్ని వైసీపీ ఒడుపుగా పట్టుకుని జనాల్లోకి తీసుకుపోవడంతో ఇద్దరినీ కలసికట్టుగా జనం ఓడించారు.

అనుభవమైందా…?

ఆ తరువాతనే పవన్ కల్యాణ్ కి అనుభవం వచ్చిందని అంటారు. బాబుతో ఉంటే ఆయన వ్యతిరేకత కూడా తనకు తగులుకుంటుందని పవన్ కల్యాణ్ భావించే సొంతంగా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు. ఆ తరువాత బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకోవడం కూడా బాబుకు షాక్ ఇచ్చే పరిణామమే. ఎందుకంటే 2024 నాటికి పవన్ కల్యాణ్ తో కలసి పోటీకి దిగాలని బాబు ప్లాన్ వేశారు. తాము ఇద్దరం కలిస్తే కచ్చితంగా బీజేపీ కూడా తమ కూటమిలో చేరుతుందని ఆ విధంగా జగన్ని గద్దె దించవచ్చునని బాబు మాస్టర్ ప్లాన్. కానీ దానికి దెబ్బకొట్టేలా పవన్ ముందే వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఇపుడు బాబు వైపు బీజేపీ పెద్దలు చూసే అవకాశం లేకుండా పోయిందట.

సీన్ లో లేకుండా …..?

ఇక బీజేపీ జనసేన కూటమికి ఏపీలో వెలుగు రావాలంటే బాబు పార్టీని చీకట్లోకి నెట్టాలి. ఇది జరిగితేనే తప్ప ఏపీలో ఈ కూటమి వైసీపీకి అసలైన ప్రత్యామ్నాయం కాదు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ సంగతి తెలిసే ఎక్కడా బాబు ఎలివేషన్ కి అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతోంది. పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా కొంత గందరగోళంలో ఉన్నారు. అయితే ఆయన ఇపుడు హఠాత్తుగా జగన్ ని పొగడడం ద్వారా బాబుకు గట్టి షాక్ ఇచ్చేశారు. కలలో సైతం బాబు ఊహించని పరిణానం అది. గత ఆరేళ్ళుగా చూసుకున్నా కూడా పవన్ కల్యాణ్ ఎపుడూ జగన్ని పొగిడింది లేదు. అలాటిది పవన్ శభాష్ జగన్ అంటూ 104, 108 అంబులెన్సులను 1088 వరకూ ఏపీలో ఒకేసారి ప్రవేశపెట్టడాన్ని పవన్ కోరి మరీ మెచ్చుకున్నారు. అంతే కాదు, కరోనా కేసుల విషయంలో టెస్టింగులు మూడు నెలలుగా నిబధ్ధతతో జరపడం కూడా పవన్ మెచ్చుకున్నారు. ఈ రెండు విషయాల్లో టీడీపీ జగన్ని ఆడిపోసుకుంటోంది. ప్రత్యేకించి అంబులెన్సులు వ్యవహారంలో అయితే అవినీతి, కుంభకోణం అంటూ టీడీపీ కొత్త ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇపుడు పవన్ కల్యాణ్ లాంటి ప్రత్యర్ధి జగన్ కి కితాబు ఇవ్వడం బాబుకు మింగుడుపడని వ్యవహారమే.

అదీ లెక్క……

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, ఆయన తరువాత వారసుడు లోకేష్ ఇదీ నిరంతర వారసత్వంగా ఉంది. రేపటి రోజున మళ్లీ బాబుకు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి బాబు కానీ ఆయన కుమారుడు కానీ అవుతారు. అదే బాబుని డౌన్ చేస్తే కచ్చితంగా జగన్ కి అసలైన ప్రత్యర్ధిగా పవన్ కల్యాణ్ మాత్రమే ఉంటారు. ఇద్దరూ యువకులు. ఇద్దరి మధ్యనే పోటీ కూడా ఉంటుంది. అందువల్ల బాబుని సైడ్ చేయాలంటే ఆయన ప్రతిపక్ష పాత్రని కూడా వీక్ చేయాలి. ఈ కారణంతోనే, వ్యూహాత్మకంగా జగన్ కి పవన్ కల్యాణ్ మద్దతుగా మాట్లాడారని అంటున్నారు. దీని వల్ల బాబు డొల్ల విమర్శలు జనంలోకి వెళ్తాయి.పవన్ కల్యాణ్ నిర్మాణాత్మకమైన వీక్ష నేతగా ఫోకస్ అవుతారు. ఇక అమరావతి రాజధాని విషయంలో కూడా పవన్ బాబుకు మద్దతు ఇవ్వడంలేదు. అలాగే జేసీ ప్రభాకర‌రెడ్డి అరెస్ట్ మీద కానీ, కొల్లు రవీంద్ర అరెస్ట్ మీద కానీ జనసేన నుంచి ఒక్క కామెంట్ కూడా టీడీపీకి అనుకూలంగా రాలేదు. అంటే బాబుని వీక్ చేయాలని జగన్ భావిస్తూంటే ఇక పవన్ నుంచి కూడా మద్దతు ఉంటుందన్న మాట. ఇది బీజేపీ కేంద్ర నాయకత్వం స్ట్రాటజీ కూడా. బాబు ఏపీ పొలిటికల్ సీన్ నుంచి ఎలిమినేట్ కావాల్సిన టైం వచ్చేసింది. దాని కోసమే అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. ఇపుడు పవన్ కూడా చేయి వేయడంతో దాదాపుగా బాబు రాజకీయ జీవితం క్లైమాక్స్ కి వచ్చేసిందనుకొవాలేమో.

Tags:    

Similar News