ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ కన్పించడం లేదే?

యుద్ధానికి ముందే చేతులెత్తేయకూడదు. ఓటమి తర్వాత ఏవిధమైన సమర్థన చేసుకున్నాచెల్లుతుంది. రాజకీయ యుద్ధమైన ఎన్నికలు ప్రజాభిప్రాయంతో ముడిపడి ఉంటాయి. నాయకుడు పార్టీ శ్రేణులకు తామే అధికారంలోకి వస్తున్నామన్న [more]

Update: 2020-03-13 15:30 GMT

యుద్ధానికి ముందే చేతులెత్తేయకూడదు. ఓటమి తర్వాత ఏవిధమైన సమర్థన చేసుకున్నాచెల్లుతుంది. రాజకీయ యుద్ధమైన ఎన్నికలు ప్రజాభిప్రాయంతో ముడిపడి ఉంటాయి. నాయకుడు పార్టీ శ్రేణులకు తామే అధికారంలోకి వస్తున్నామన్న భరోసా కల్పించాలి. అంతేకాదు, తాను అత్యున్నత పదవిని అధిష్ఠిస్తాననే నమ్మకాన్ని కూడా కలిగించాలి. కానీ తమిళనాట రజనీ కాంత్ ప్రకటన భిన్నంగా ఉంది. తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని , సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టంగానే చెప్పేశారు. ఆయన మనోభావం ఏదైనప్పటికీ అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చిలకరించేశారు. ఎవరినినో ముఖ్యమంత్రిని చేయడానికి అభిమానులు చిత్తశుద్దితో కష్టపడతారా? ఈ విషయంలో జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్ తో రజనీకాంత్ కు పోలికలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో మార్పుకోసం, దేశం కోసం తాను పాలిటిక్స్ లోకి వచ్చానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పదే పదే చెబుతుంటారు. తాను ముఖ్యమంత్రి కావాలనుకోవాలనుకోవడం లేదని పలు సందర్బాల్లో ప్రస్తావించారు. నైతిక సూత్రాలు, ఆశయాలు చెప్పడంలో తప్పు లేదు కానీ, అభిమానులు ఆశించేది వేరు. సినీ పొలిటీషియన్స్ ఫ్యాన్స్ ను బేస్ చేసుకుంటూ మిగిలిన వర్గాలను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులో అత్యంత ఆదరణ కలిగిన నటుడు రజనీకాంత్ . దేశంలోనే అత్యధిక సంఖ్యలో అభిమాన సంఘాలు కలిగిన సూపర్ స్టార్ కూడా అతనే. రజనీ మక్కల్ మండ్రం రూపకల్పనలో అభిమాన సంఘాలదే ప్రధాన పాత్ర. ఎంజీఆర్, జయలలితలను అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో వారి అభిమానులు పోషించిన పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం రజనీకాంత్ తాను కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే మిగిలిపోతాననడంతోనే పార్టీలో జోష్ తగ్గించేశారు.

ఫెయిల్యూర్ పాలిటిక్స్…

గతంలో సినిమా నటులు రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారంటే రాజకీయాల దశ మార్చేస్తారనే భావన ఉండేది. గడచిన రెండు మూడు దశాబ్దాల్లో సీన్ రివర్స్ అయిపోయింది. ముఖ్యంగా సినీ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తమిళనాడులోనే ఆ ధోరణి తిరగబడింది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత సినీరంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించిన వారు పెద్దగా కనిపించరు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమలహాసన్ వంటి వారు పార్టీలను పెట్టినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో నూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఎన్టీయార్ తర్వాత అంత పెద్ద నటుడిగా రికార్డు కలిగిన చిరంజీవి ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది. పవన్ కల్యాణ్ జనసేన కనీసం ప్రజారాజ్యం స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. పార్టీ స్థాపన తర్వాత మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినప్పటికీ చట్టసభల ఫలితాలను ప్రభావితం చేయలేకపోయింది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు రజనీ మక్కల్ మండ్రం తమిళనాడులో ఈ ట్రెండ్ ను రివర్స్ చేసి పొలిటికల్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించగలదా? అన్నదే ఇప్పుడు రాజకీయాల్లో నలుగుతున్న చర్చ

రజనీలో పవన్ శైలి…

పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశారు. కానీ 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. పొత్తు కుదుర్చుకుని కొన్ని స్థానాలకైనా పోటీ చేసి ఉంటే జనసేన నిర్మాణానికి పునాదులు ఏర్పడి ఉండేవి. కానీ వైసీపీని నిరోధించడమనే ఏకైక లక్ష్యంతో తన పార్టీ ఎదుగుదలను సైతం కుదించేసుకున్నారు. ఫలితంగా జనసేన లోక్ సభ, శాసన సభ వంటి చట్టసభల్లో అడుగుపెట్టలేకపోయింది. త్యాగపూరిత రాజకీయాలు నడుపుతున్నామనే భావన ప్రజల్లో కలిపించాలని పవన్ యోచించారు. స్వార్థరహితంగా ముద్ర వేసుకోవాలనుకున్నారు. రాజకీయాలంటే సేవాభావంతో కూడినవే. కానీ ప్రజల సంక్షేమంలో , రాష్ట్రప్రగతిలో తనదైన ముద్రవేయాలనే స్వార్థం ఉండాలి. లేకపోతే పార్టీ , నాయకుడు ముందుకు వెళ్లలేడు. జనసేనకు ఈ ముందు చూపు కొరవడటంతో పార్టీ పటిష్ఠం కాలేకపోయింది. రజనీకాంత్ సైతం ఇదే తరహా ధోరణిలో ప్రసంగాలు చేస్తుండటంతో రజనీ మక్కల్ మండ్రం భవిష్యత్తుపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి.

రాజకీయ శూన్యత…

తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణించడంతో అన్నాడీఎంకే, డీఎంకేలకు మార్గదర్శకులు కరవు అయ్యారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న ఈ రెండుపార్టీలు రాష్ట్రంపై పట్టు బిగించాయి. అనేక విధాల వనరులు ఉన్న రాష్ట్రాన్ని అయాచిత పథకాలు, అనుచిత పంపిణీల పాలు చేశాయి. పెత్తందారీ ధోరణి ప్రబలిపోయింది. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ వంటి నాయకుడు వస్తే సులభంగానే అధికారాన్ని దక్కించుకోవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. కానీ ప్రతి ఊరు,వాడ విస్తరించిన శ్రేణులతో ఉన్న పార్టీలు డీఏంకె, ఏఐఏడీఎంకే. వాటిని దీటుగా ఎదుర్కోవడం అంత చిన్నవిషయం కాదు. రజనీకాంత్ కొత్త పార్టీ అభిమాన సంఘాలనే పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. తాను ముఖ్యమంత్రిని అవుతాననే సంకేతాన్ని వారికి అందిస్తేనే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని రజనీ చెప్పడం తీవ్రమైన పొరపాటే. ఇప్పటికే తాము సానుభూతిపరులుగా ఉన్న పార్టీల వైపే అభిమానులు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. అందువల్ల రజనీకాంత్ ప్రకటన ముందరికాళ్లకు బంధం వేసుకున్నట్లుగానే చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News