ఆ ముగ్గురి మంత్రులే మెగా బ్రదర్స్ టార్గెట్

మెగాబ్రదర్స్ అంటే ఎవరో కాదు నాగబాబు, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరూ ఇపుడు జనసేన ద్వారా రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో చేతులు కలిపాం కాబట్టి భవిష్యత్తు బేఫికర్ [more]

Update: 2020-05-28 08:00 GMT

మెగాబ్రదర్స్ అంటే ఎవరో కాదు నాగబాబు, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరూ ఇపుడు జనసేన ద్వారా రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో చేతులు కలిపాం కాబట్టి భవిష్యత్తు బేఫికర్ అన్నట్లుగా కొంత ధైర్యం చూపిస్తున్నారు. సరే తమ పార్టీని ఏదోలా నెట్టుకురావడంలో తప్పు లేదు కానీ ఇద్దరు మెగా బ్రదర్స్ ప్రధాన టార్గెట్ వైసీపీ అన్నది తెలిసిందే. కానీ అందులో కూడా ఆ ముగ్గురు మంత్రులు అంటే మరీ టార్గెట్ చేస్తున్నారు. దీని వెనక కధ వేరేగా ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులెవరూ, ఏమా కధ అంటే చాలానే చెప్పాలి. దాని కంటే ముందు తాజాగా నాగబాబు విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ గురించి చెప్పుకోవాలి. అన్ని పశువులూ గడ్డి తినవు శ్రీనూ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇపుడు సెగలు పుట్టిస్తోంది.

కారణమదేనా ?

విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్, టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. జగన్ చేరదీసి టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. దాంతో తమ అన్న పార్టీ ద్వారా బయటకు వచ్చి ఎమ్మెల్యే అయి తమ కళ్ల ముందే ఎదిగి ఇలా మంత్రి అయిపోవడం మెగా బ్రదర్స్ కి మింగుడు పడినట్లుగా లేదని ప్రచారం ఉంది. గతంలో జనసేన అధినేత పవన్ కూడా అవంతి మీద వ్యక్తిగ‌త విమర్శలు చేయడం, దానికి అవంతి తనదైన శైలిలో రియాక్ట్ కావడం జరిగాయి. ఇపుడు చూసుకుంటే నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ కామెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

కన్నబాబు మీద…

ఇక మరో వైపు వైసీపీలో జగన్ కి ఇష్టుడు, వ్యవసాయ శాఖ చూస్తున్న మంత్రి కన్నబాబుని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇలాగే గట్టిగానే టార్గెట్ చేశారు. విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కన్నబాబునే నేరుగా లక్ష్యం చేసుకుని బాణాలు ఎక్కుపెట్టిన సంగతి విధితమే. తమ అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయం చేసి ఇపుడు ఇలా తమ పైనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ‌్ ఆనాడు ఆవేశపడడం తెలిసిందే. అయితే దానికి కన్నబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దాంతో కొంత వివాదం రేగినా ఆ తరువాత సద్దుమణిగింది.

ఆయన‌ కూడా ….

ఇక మరో నేత, వైసీపీ మంత్రి ఉన్నారు. ఆయనే విజయవాడకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన కూడా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక ఆయన ఇపుడు వైసీపీలో మంత్రిగా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన్ని కూడా జనసైనికులు మెగా బ్రదర్స్ టార్గెట్ చేస్తూంటారు. నిజానికి ఈ ముగ్గురూ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తమ టాలెంట్ ని చూపించి ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఈ రోజు కీలకమైన మంత్రులుగా వైసీపీ సర్కార్ లో ఉన్నారు. అటువంటిది వారి మీద అసూయతోనో లేక తమ పార్టీకి రాజకీయానికి అండగా లేరనో కామెంట్స్ చేస్తే దాని వల్ల ఎంత లాభమెంతో మెగా బ్రదర్స్ ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో ఆకర్ష్ పధకాలు ఉంటాయి. కానీ అలా ఆకర్షించాలంటే తేనె మన దగ్గర కూడా ఉండాలిగా. మరి దాన్ని సంపాదించుకుంటే ఈ ముగ్గురేంటి, మందకు మంద కట్టకట్టుకుని వస్తారు. అదేంటో తెలియకపోవడం వల్లనే ఇలా ఊసుపోని ట్వీట్లతో తమ మాజీ నేస్తాలను తరచూ మెగా బ్రదర్స్ కెలుకుతున్నారని కూడా అంటున్నారు.

Tags:    

Similar News