ఇద్దరూ ఎందుకో ఆ సైలెన్స్ ?

ఏపీ అంటే మరీ అనువుగా ఉందేమో. అందరూ ఇక్కడే తమ సత్తా చూపిస్తారు సవాళ్ళు చేస్తారు. ఆరేళ్ల క్రితం వరకూ రెండు రాష్ట్రాలూ ఒకటే కదా. పైగా [more]

Update: 2020-10-28 15:30 GMT

ఏపీ అంటే మరీ అనువుగా ఉందేమో. అందరూ ఇక్కడే తమ సత్తా చూపిస్తారు సవాళ్ళు చేస్తారు. ఆరేళ్ల క్రితం వరకూ రెండు రాష్ట్రాలూ ఒకటే కదా. పైగా కొన్ని పార్టీలు అక్కడా ఇక్కడా రాజకీయం చేస్తామని చెప్పుకుని జాతీయ పార్టీలుగా కలరింగు ఇస్తూంటాయి. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. హైదరాబాద్ లో తాజాగా వరదలు ఏ రేంజిలో వచ్చాయో, సిటీ ఎలా మునిగిపోయిందో ఆయన కళ్లారా చూశారు. కానీ పల్లెత్తు మాట కేసీయార్ సర్కర్ కి వ్యతిరేకంగా మాట్లాడరు, ఇదేనా విశ్వనగరం దుస్థితి అంటూ గుండెలు బాదుకునే సీన్ కూడా చంద్రబాబుకు అసలు లేదు. కానీ ఆయన టీడీపీకి జాతీయ అధ్యక్షుడు మరి.

ఈయన అంతేగా ….?

ఇక పవన్ కళ్యాణ్ నటనలో అన్న చిరంజీవి నుంచి ఎన్ని రకాల మెలకువలు నేర్చుకున్నారో తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుతో కలసి అడుగులు వేస్తూంటారు. ఏదైనా విషయం మీద బాబు మాటా విధానం చూసిన తరువాత అచ్చం అలాగే తానూ మాట్లాడుతారని పేరు. ఇక తెలంగాణాలో వరదలు రావడం పూర్తిగా మానవ తప్పిదం. ఇంకా చెప్పాలంటే అక్రమార్కుల, అవినీతిపరుల దందాలకు సామాన్య జనం బలి అయ్యారు. అక్కడ విపక్ష నేతలుగా బాబు, పవన్ ఎంతైనా మాట్లాడవచ్చు. కానీ ఏపీలో అలా కాదు, ఇది ప్రకృతి విపత్తు. దిగువన సముద్రానికి చేరువలో ఉన్న రాష్ట్రం ఏపీ. తుఫాన్లు, వరదలు ఇక్కడ సహజం. కానీ పవన్ చంద్రబాబు ఇద్దరూ కూడా ఏపీనే ఆడిపోసుకుంటారు. ఏపీలో ప్రభుత్వం ఏం చేస్తుందని రంకెలు వేస్తారు. సరదాకి అయినా కేసీయార్ సర్కార్ని పల్లెత్తు మాట అనరు కాక అనరు.

భయమేనా…?

సినిమాలో పవర్ స్టార్ గా ఒంటిచేత్తో డజన్ల కొద్దీ విలన్లను కొట్టే పవన్ రాజకీయ తెర మీద మాత్రం డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు అని విమర్శలు ఉన్నాయి. తెలంగాణాలో గత ఎనిమిది నెలలుగా ఉంటున్న ఆయన కరోనా అక్కడ తీవ్రంగా ఉన్నా ఉలకలేదు, అదే సమయంలో ఏపీ సర్కార్ మీద ప్రతీసారీ దాడి చేస్తూనే ఉన్నారు. ఇపుడు వరద రాజకీయం మొదలెట్టారు. దీనికి తోడు ఏపీ సర్కార్ దసరా సందర్భంగా బస్సులను నడపలేదంటూ కొత్త పాయింటుతో విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఇది రెండు రాష్టాల మధ్య వ్యవహారం. మరీ ముఖ్యంగా తెలంగాణా మంకుపట్టు పట్టి మరీ అంతరాష్ట్ర బస్సుల విషయంలో కేవలం ఏపీ కే కొత్త నిబంధనలు విధిస్తోంది. దాంతో అది ఎంతకూ తేలడంలేదు. మరి ఈ సంగతి పవన్ కి తెలుసో లేదో కానీ ఊరకే జగన్ సర్కార్ మీద విరుచుకుపడిపోతున్నారు. ఏపీ సర్కార్ నిర్లక్ష్యం అంటున్నారు.

ఇక్కడా అంతేగా…?

రాయలసీమలో బాబు పుట్టారు, పవన్ అయితే తాను సీమకు దత్తపుత్రుడిని అంటారు. కానీ సీమకు తాగు, సాగు నీళ్ళు ఇవ్వాలని జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం మొదలుపెడితే దానిని తెలంగాణా సర్కార్ అడ్డుకుంటోంది. అది వివాదం కూడా అయి అపెక్స్ కమిటీ దాకా కధ నడిచింది కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు కానీ పవన్ కానీ కనీసం స్పందించకుండా మౌనం దాల్చారని విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రజల ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఒక్కటిగా ఉండాల్సిన ఇద్దరు నేతలూ ఎందుకు సైలెంట్ అయ్యారో వారికే తెలియాలి. ప్రత్యర్ధులు మాత్రం వారికి కేసీయార్ అంటే భయం అని అంటారు. ఏది ఏమైనా పవన్, బాబు తెలంగాణాలో ఉంటూ ఏపీకి టూరిస్టులుగా వస్తున్నారని వైసీపీ నేతల సెటైర్లు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలేమో.

Tags:    

Similar News