పవన్ ని వెంటాడుతున్న బాబు నీడ ?

పవన్ కళ్యాణ్ కి నిలకడ లేదు అని అంతా అంటారు కానీ ఆయన కొన్ని విషయాల్లో తన స్టాండ్ ఎపుడూ మార్చుకోలేదు అని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తూంటారు. [more]

Update: 2020-12-15 05:00 GMT

పవన్ కళ్యాణ్ కి నిలకడ లేదు అని అంతా అంటారు కానీ ఆయన కొన్ని విషయాల్లో తన స్టాండ్ ఎపుడూ మార్చుకోలేదు అని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తూంటారు. అదే కొన్ని స్నేహాల విషయంలో అన్న మాట. పవన్ కి చంద్రబాబు అంటే అదో నమ్మకం, అభిమానం, గురి. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తన అన్న చిరంజీవిని రాజకీయంగా దెబ్బ తీసిన బాబు అంటే పవన్ కళ్యాణ్ కి ఎందుకు మోజు అంటే దానికి సమాధానం ఉండదు. కానీ బాబు పవన్ కి ఇచ్చే విలువ మాత్రం ఎవరూ రాజకీయంగా ఇంతవరకూ ఇవ్వలేదు, ఇవ్వరేమో కూడా. బహుశా అందుకే పవన్ కి బాబుని చూస్తే ప్రేమ అలా పెల్లుబుకుతుందని చెబుతారు.

నాటి నుంచే అలా…?

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ నివాసానికే వచ్చి స్నేహ హస్తం చాటారు. అప్పటికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్త్రి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అలా తన‌ కోసం రావడాన్ని ఇప్పటికీ పవన్ మరచిపోలేదు అంటారు. ఇక బాబు సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎపుడూ రెడ్ కార్పెట్ పరచేవారు. గన్వవ‌రం ఎయిర్ పోర్టు నుంచే అద్బుతమైన రిసీవింగ్ పవన్ కి ఉండేది. మంత్రులు వచ్చి ఘన స్వాగతం పలికేవారు. ప్రత్యేక విమానాలు కూడా పవన్ కోసం పంపేవారు. మరి అంత చేసిన బాబు అంటే పవన్ కళ్యాణ్ కి కోపం ఎందుకు ఉంటుంది. ఇక పవన్ని బాబు ఏనాడూ పల్లెత్తు పరుషంగా అన్నది లేదు. 2018 తరువాత పలు సభల్లో పవన్ నోరు జారినా బాబు సర్దుకున్నారు. అందుకు కూడా పవన్ కళ్యాణ్ కి బాబు మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా.

అదే శాపమా…?

ఇక బీజేపీతో ఇపుడు పవన్ కళ్యాణ్ పవన్ ప్రయాణం సాగిస్తున్నా మనసంతా బాబు మీదేనని వైసీపీ నేతలు అంటూంటారు. బాబు పవన్ ఎప్పటికీ ఒక్కటేనని కూడా వారు గట్టిగా చెబుతారు. బహుశా ఇదే బీజేపీ పవన్ ల మధ్య బంధం గట్టిపడకపోవడానికి మరో కారణం అంటున్నారు. ఈ మధ్యనే మహిళా నేత విజయశాంతికి ఢిల్లీ పిలిపించి మరీ తనతో సమానంగా గౌరవం ఇచ్చారు దేశానికి హోం మంత్రి, బీజేపీ పెద్ద అయిన అమిత్ షా. అదే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అంతా ఉల్టా సీదాగా జరిగింది. పవన్ బీజేపీతో పొత్తు అంటే ఏపీకి వచ్చిన వారు జీవీఎల్ నరసింహారావు, సునీల్ డియోధర్ వంటి పెద్దలే. ఇక ఈ మధ్య పవన్ ఢిల్లీకి వెళ్తే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శన భాగ్యానికి మూడు రోజులు వేచి ఉండాల్సివచ్చింది.

అపాయింట్ మెంట్ ఇవ్వరా :..?

ఇక పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడిగా ఉన్నా, పొత్తు పొడిచి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటికి అమిత్ షా అపాయింట్ మెంట్ లేదు, అంతే కాదు, నరేంద్ర మోడీ దర్శన భాగ్యం కలగలేదు. దాంతో పవన్ కళ్యాణ్ కి ఏదోలా ఉందని అంటున్నారు. ఇక జనసైనికులకు అయితే ఇది అవమానంగా ఉందిట. పవన్ చరిష్మాటిక్ లీడర్. తెలుగు నాట తిరుగులేని స్టార్. రాజకీయాల్లో కూడా బలమైన సామాజికవర్గం ప్రతినిధిగా ఉన్నారు. సొంతంగా పోటీ చేస్తే ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఓ విధంగా పవన్ కళ్యాణ్ అనే పొలిటికల్ ఫ్యాక్టర్ ని ఏపీలో విస్మరింపలేనిదే. మరి బీజేపీకి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు దూరం పెడుతున్నారు అంటే పవన్ వెనక బాబు ఉన్నాడన్న అనుమానంతోనే అంటున్నారు. బాబు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఒక్కటి అన్న వైసీపీ స్లోగన్ ని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నట్లుగా ఉందంటున్నారు. ఇక బీజేపీ శత్రువులు పవన్ కి శత్రువులు కాదు, తెలంగాణాలో కేసీయార్ ని ఒక్క మాట అనలేని నిస్సహాయత పవన్ ది. ఏపీలో కూడా బాబు మీద బాణాలు వేయమంటే ఒకటికి పదిసార్లు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు. ఇలాంటి రాజకీయ అయోమయం పవన్ లో ఉండడం వల్లనే బీజేపీ పెద్దలు పూర్తిగా నమ్మడంలేదా అన్న చర్చ అయితే గట్టిగా వస్తోంది. మొత్తానికి బాబు పడగ‌ నీడ పవన్ని ఇలా కూడా వెంటాడుతోంది అన్న మాట.

Tags:    

Similar News