ఇద్దరిదీ ఒకే మాట.. ఒకే బాట..?

ఎట్ హోం అంటే బ్రిటిష్ వారి సంప్రదాయం. నాడు గవర్నర్లే ఏలికలు. వారు అప్పట్లో ప్రముఖులను పిలిచి వారితో టీ బ్రేక్ ముచ్చట్లు వేసేవారు. స్వాతంత్రం వచ్చాక [more]

Update: 2020-01-27 03:30 GMT

ఎట్ హోం అంటే బ్రిటిష్ వారి సంప్రదాయం. నాడు గవర్నర్లే ఏలికలు. వారు అప్పట్లో ప్రముఖులను పిలిచి వారితో టీ బ్రేక్ ముచ్చట్లు వేసేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా గవర్నర్ల వ్యవస్థ మీద మోజు పోలేదు. ఆ సంప్రదాయాలూ అలా కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ ఎట్ హోంలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇక విభజన తరువాత విజయవాడలో తొలిసారి ఎట్ హోం జరిగింది. గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నియామకం తరువాత జరిగిన మొదటి కార్యక్రమం ఇది. ఇక ఇంతకు అయిదేళ్ళ ముందు తీసుకుంటే తెలంగాణాలో ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అక్కడి రాజ్ భవన్ లో ఎట్ హోం జరిపేవారు.

ఠంచనుగా పవన్…

ఇక ఎట్ హోం విషయానికి వస్తే ఎవరు రాకపోయినా ఠంచనుగా పవన్ మాత్రం వచ్చేవారు. ఆయన జనసేన అధినేత హోదాలో ఆహ్వానం అందుకుని మరీ అక్కడ తెగ హుషార్ చేసేవారు. కేసీఆర్ తో ముచ్చట్లు పెట్టి మీడియాను అట్రాక్ట్ చేసేవారు. దాంతో పవన్ ఏపీ నుంచి ప్రముఖ నాయకుడిగా, వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ గా పెద్ద ఎత్తున బిల్డప్ అయితే జరిగేది. పవన్ సైతం కేవలం ఒక రాజకీయ పార్టీ నేతగా ఉన్నా కూడా అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించేవారు.

బాబు అలా…

ఇక ఎట్ హోం కి చంద్రబాబు 2015లో తొలి ఏడాది ఒక్కసారి హాజరయ్యారు. అప్పట్లో ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ తో కరచాలనం చేయడం, ఇద్దరినీ పక్కన పెట్టుని నరసింహన్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఓ ముచ్చట. అయితే అదే ఏడాది మేలో జరిగిన ఓటుకు నోటు కేసు కారణంగా బాబు విజయవాడ వచ్చేసారు. దాంతో ఆయన మళ్ళీ కేసీఆర్ ముఖం చూడలేదు. ఎట్ హోం కి వెళ్ళలేదు. ఏపీకి చెందిన మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప వంటి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు.

జగన్ కూడా…

ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన కూడా ఒకే ఒకసారి విపక్ష నేత హోదాలో ఎట్ హోంకి వచ్చారు. అపుడు బాబుతో సహా అంతగా ఆయన వైపే చూపు సారించడం హైలెట్ గా మారింది. గవర్నర్ నరసింహన్ అయితే ప్రత్యేక శ్రధ్ధతో జగన్ ని రిసీవ్ చేసుకోవడమూ మీడియాలో ప్రముఖ అంశమైంది. ఇలా ఒకే ఒకసారి బాబు, జగన్, కేసీఆర్ గ్రూప్ గా ఎట్ హోంలో పాలుపంచుకున్నారు.

షరా మామూలుగా….

ఇపుడు చూస్తే విజయవాడలో రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి బాబు డుమ్మా కొట్టారు. ప్రతీ సారీ తెగ హడావుడి చేసే పవన్ కూడా ఈసారి రాకపోవడం విశేషం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన అధికార హోదాను చూడలేక విపక్ష నేతలు రాలేదా అన్న చర్చ ఒకటి సాగుతోంది. బాబు సంగతి సరేసరి. కానీ ప్రతీ సారీ ఠంచనుగా హాజరయ్యే పవన్ డుమ్మా కొట్టడమే ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నారు. జగన్ తో ఇప్పటివరకూ ఎక్కడా ముఖాముఖీ ఎదురుపడని పవన్ ఎట్ హోం కి సైతం అందుకే రాలేదా అన్న డౌట్లు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా మరో నాలుగు ఎట్ హోం ఫంక్షన్లు ఇలాగే సాగుతాయేమో.

Tags:    

Similar News